Ramadan 2022 begins: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం అయింది. సౌదీ అరేబియాలో నెలవంక దర్శనమివ్వడంతో పలు దేశాల్లో ఉపవాస దీక్షలు (రోజా) ప్రారంభమయ్యాయి. సౌదీ అరేబియా స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి నెలవంక దర్శనమిచ్చింది. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి సౌదీ సహా పలు దేశాల్లో (Saudi Arabia) ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నెలరోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తారు. ప్రతియేటా రంజాన్ప్రారంభమయ్యే రోజు.. మారుతూ ఉంటుంది. ముస్లింలు ఇస్లామిక్ క్యాలెండర్‌ను అనుసరిస్తూ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. ప్రపంచంలోని అఫ్గానిస్థాన్, అల్బేనియా, అర్మేనియా, ఆస్ట్రియా, అజర్బైజాన్, బహ్రైన్, బెల్జియం, బొలీవియా, బల్గేరియా, చేచ్నియా, డెన్మార్క్, ఫిన్‌ల్యాండ్, జార్జియా, హంగేరీ, ఐస్‌ల్యాండ్, ఇరాక్, ఇటలీ, జపాన్, జార్డన్, కజకిస్థాన్, కువైట్, కిరిగిస్థాన్, లెబెనాన్, మౌరీటనియా, నెథర్లాండ్స్, పాలెస్తీనా, ఖతార్, రొమేనియా, రష్యా, సింగపూర్, సుడాన్, స్విడెన్, స్విట్జర్లాండ్, సిరియా, తైవాన్, తజకిస్థాన్, టోగో, యూఏఈ, యూకే, ఉజ్బెకిస్థాన్, యెమెన్ తదితర దేశాలు.. సౌదీ అరేబియా ప్రకటనను ప్రామాణికంగా తీసుకుని రంజాన్పవిత్ర మాసాన్ని ప్రారంభించారు. కాగా.. ఆస్ట్రేలియాలో నెలవంక శుక్రవారమే దర్శనమిచ్చింది. దీంతో అక్కడ కూడా ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి.
కాగా.. భారత్‌లో ఈరోజు సాయంత్రం నెలవంక దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. దీంతో దేశంలో ముస్లింలు ఈ నెల 3న ఉపవాస దీక్షలు మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు మలేషియా, ఇండోనేషియాలోనూ ఏప్రిల్3నే పవిత్ర రంజాన్‌మాసం ప్రారంభంకానుంది. అయితే.. శనివారం నెలవంక దర్శనమివ్వకపోతే.. సోమవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు.
ఇదిలాఉంటే.. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం మైనారిటీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో ఉద్యోగులు ప్రతి రోజూ సాయంత్రం గంట ముందే విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుతించింది. రంజాన్ మాసం మొత్తం ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.
-నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Also Read: