కాల్పుల్లో మృతి చెందిన ప్రముఖ పాప్ సింగర్
ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ హుయే(32) మిస్సోరిలో కాల్పుల్లో మృతి చెందాడు. కిన్‌లోచ్‌లోని మార్టిన్ లూథర్ కింగ్ కాలనీలో హుయే నివసిస్తుండగా..

ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ హుయే(32) మిస్సోరిలో కాల్పుల్లో మృతి చెందాడు. కిన్‌లోచ్‌లోని మార్టిన్ లూథర్ కింగ్ కాలనీలో హుయే నివసిస్తుండగా.. గురువారం అతడు బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్ హుయే శరీరంలోకి చొచ్చుకుపోగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లే లోపే హుయే కన్నుమూశాడు. ఇక ఈ కాల్పుల్లో మరో వ్యక్తి గాయపడగా.. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ ఘటన జరిగిన సమయంలో పది మంది ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై దర్యాప్తును ప్రారంభించామని స్థానిక పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. కాగా జాత్యాంహకారంతోనే హుయేను హత్య చేసినట్లు సమాచారం.
కాగా 2006లో రాపర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన హుయే అనతికాలంలోనే మంచి పేరును తెచ్చుకున్నారు. అతడి మొదటి ఆల్బమ్ ‘పాప్, లాక్ అండ్ డ్రాప్ ఇట్’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఆయన మరణంపై అభిమానులు, సన్నిహితులు సంతాపం ప్రకటించారు. మరోవైపు హుయే ప్రస్తుత మేనేజర్ కూలైడ్ మాట్లాడుతూ.. ”నా హృదయం ముక్కలైంది. బుధవారం నేను ఆరేడు సార్లు హుయేతో మాట్లాడా. ఆ సమయంలో కుటుంబంతో హ్యాపీగా ఉన్నాడు. ఈ హింస ఇప్పటికైనా ఆగిపోవాలి” అని అన్నారు.