Russia – Poland: పోలండ్‌లోకి దూసుకెళ్లిన రష్యా మిస్సైళ్లు.. ఇద్దరు మృతి.. దేశవ్యాప్తంగా హై అలర్ట్..

|

Nov 16, 2022 | 8:15 AM

రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్లీ తారాస్థాయికి చేరింది. మంగళవారం రష్యా.. ఉక్రెయిన్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో పోలాండ్‌పై రెండు రష్యా క్షిపణులు దూసుకెళ్లడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది.

Russia - Poland: పోలండ్‌లోకి దూసుకెళ్లిన రష్యా మిస్సైళ్లు.. ఇద్దరు మృతి.. దేశవ్యాప్తంగా హై అలర్ట్..
Russia Poland
Follow us on

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్లీ తారాస్థాయికి చేరింది. మంగళవారం రష్యా.. ఉక్రెయిన్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో పోలాండ్‌పై రెండు రష్యా క్షిపణులు దూసుకెళ్లడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. ఉక్రెయిన్ పై క్షిపణులు ప్రయోగిస్తుండగా.. సరిహద్దుల్లోని పోలండ్‌లో పేలినట్లు తెలుస్తోంది. అయితే, ఈ రష్యా మిస్సైళ్ల ధాటికి ఇద్దరు పోలండ్ జాతీయులు మృతి చెందారు. ఈ క్రమంలో పోలాండ్ అధ్యక్షుడు, ప్రధాని అత్యవసర భేటీ అయ్యారు. నేషనల్ సెక్యూరిటీ బ్యూరో సమావేశానికి పిలుపునిచ్చారు. రష్యా మిస్సైళ్ల దాడి నేపథ్యంలో కౌంటర్ యాక్షన్‌పై చర్చించనున్నారు. ఇదిలాఉంటే.. నాటో పరిధిలోని ప్రతి ఇంచును రక్షించుకుంటామని పెంటగాన్ ప్రకటించింది. నాటో ఆర్టికల్ 5 ప్రకారం భద్రత విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించడం మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీనిపై ప్రపంచ నాయకులతో చర్చిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు. పోలాండ్‌కు అమెరికా మద్దతు ఇస్తుందని తెలిపారు.

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న జీ-20 సమ్మిట్ లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్ధ సంక్షోభాన్ని ప్రస్తావించిన క్రమంలో రష్యన్‌ సేనలు మరోసారి భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్తంగా క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో రాజధాని కీవ్‌ సహా పలు నగరాల్లో భయాందోళన పరిస్థితి నెలకొంది. కీవ్‌లోని పెచెర్స్క్ డిస్టిక్‌పై జరిపిన క్షిపణి దాడుల్లో పలు నివాస భవంతులు ధ్వంసమయ్యాయని నగర మయర్‌ విటాలీ క్లిట్‌ష్కో వెల్లడించారు.

గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో కీవ్‌పై ప్రయోగించిన పలు రష్యన్‌ క్షిపణులను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇది రష్యా పనేనంటూ జెలెన్‌స్కీ కార్యాలయ డిప్యూటీ హెడ్ కిరిలో తిమోషెంకో ఆరోపించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. జెలెన్‌స్కీ ఆన్‌లైన్‌ వేదికగా జీ-20 సదస్సులో మాట్లాడటంతో.. ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు ప్రెసిడెన్షియల్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ యాండ్రీ యెర్మక్‌ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

సైనిక చర్య ముగించేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని జెలెన్‌స్కీ జీ-20 నేతలకు సూచించడంపై రష్యా ప్రతీకార దాడులకు దిగుతోందని ప్రకటించారు.

మరిన్ని ప్రపంచ వార్తల కోసం..