Pakistan Politics: ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం.. ఓవైపు సైన్యం..మరోవైపు విపక్షం.. తప్పుకోవడం తప్పదేమో?

|

Mar 11, 2021 | 4:49 PM

పాకిస్తాన్‌ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే సంకేతాలు మొదలయ్యాయి. ప్రజాదరణ కోల్పోతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగే రోజు ఎంతో దూరంలో లేదన్న ప్రచారం ఊపందుకుంది.

Pakistan Politics: ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం.. ఓవైపు సైన్యం..మరోవైపు విపక్షం.. తప్పుకోవడం తప్పదేమో?
Follow us on

Imran Khan to step down soon: పాకిస్తాన్‌ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే సంకేతాలు మొదలయ్యాయి. ప్రజాదరణ కోల్పోతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగే రోజు ఎంతో దూరంలో లేదన్న ప్రచారం ఊపందుకుంది. పాక్ సైన్యం గట్టిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం ఒకవైపు, ప్రజాదరణ తగ్గడం మరోవైపు.. ఇలా ఇమ్రాన్‌ ఖాన్‌ను సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టు ముడుతున్నాయి. దానికి తోడు రాజకీయపరమైన సవాళ్ళు పెరిగిపోతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి బలహీన పడిపోతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఇమ్రాన్ ఖాన్ కొత్త పాకిస్తాన్ (నయా పాకిస్తాన్) అన్న నినాదాన్ని అందుకోగా.. అది పెద్దగా ప్రజాకర్షణ పొందలేదని తెలుస్తోంది. దానికి తోడు సైన్యం కూడా ఇమ్రాన్ ఖాన్‌ను మోయడం అనవసరంమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పాలన చివరి ఘట్టానికి చేరిందని పాక్ మీడియా, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్తాన్ క్రికెట్‌ను అంతర్జాతీయంగా ఇనుమడింపచేసిన ఘనత ఇమ్రాన్ ఖాన్ సొంతం. 1992లో పాకిస్తాన్ వన్డే ప్రపంచ కప్‌ గెలవడంలో జట్టు కెప్టెన్‌గా ఇమ్రాన్‌ఖాన్‌ పాత్ర అమోఘమైనది. క్రికెట్ నుంచి రిటైరయ్యాక రాజకీయ రంగ ప్రవేశం చేసినా.. నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో.. ఆ తర్వాత ముషారఫ్ లాంటి దిగ్గజాలను దాటుకుని అధికారాన్ని సాధించడానికి ఇమ్రాన్‌ ఖాన్‌ చాలా ఏళ్ళే పడింది. క్రికెట్‌లో రాణించినట్లే రాజకీయాల్లోను ఇమ్రాన్‌ రాణిస్తాడనుకుంటే అందుకు భిన్నంగా వైఫల్యాలను మూటగట్టుకుంటున్నాడు ఇమ్రాన్ ఖాన్. సుదీర్ఘ కాలం పాటు నిరీక్షించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని అయ్యారు ఇమ్రాన్ ఖాన్. ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి పాకిస్థాన్‌ రాజకీయ, ఆర్థిక, సామాజిక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోంది. క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌ని కదా రాజకీయాల్లోను అలాగే సక్సెస్సవుతానని అనుకున్న ఇమ్రాన్ ఖాన్.. ఏ ఒక్క సమస్యలను అధిగమించలేక చతికిలా పడ్డారని పాక్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఫల్యాల నేపథ్యంలో ఇమ్రాన్‌కు ఇప్పుడు అధికారం నిలుపుకోవడం కూడా చాలా కష్టంగా మారింది.

కొత్త పాకిస్తాన్ (నయా పాకిస్థాన్‌) ఇమ్రాన్‌ ఖాన్ తాజా నినాదం. నినాదం బాగానే వుంది కానీ.. పరిస్థితిలోనే మార్పు రావడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. పాకిస్తాన్ గతం కంటే మరింత దారుణమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతోంది. అప్పులు బాగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం కొత్త ఎత్తులకు చేరుతోంది. దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. పేదరికం వెక్కిరిస్తోంది. నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రజల్లో ప్రధాని ఇమ్రాన్‌ పాలనపై విశ్వాసం తగ్గిపోతోంది. అందుకే ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిని కూడా జనరల్‌ సెనేట్‌ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. గత సంవత్సరం పాకిస్థాన్‌లో రాజకీయ పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చి ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నాయి. ఆ కూటమికి మాజీ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ సారథ్యం వహిస్తున్నాడు.

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్‌ సర్కారు నెగ్గింది కానీ.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. విశ్వాస పరీక్ష ఓటింగ్‌ రోజున నవాజ్‌ షరీఫ్‌ పార్టీకి చెందిన ఎంపీలపై తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ ప్రతినిధులు పరస్పరం గొడవ పడడం ఇమ్రాన్ ఖాన్ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. అధికారంలో ఉంటే ఏదైనా సాధ్యమని భావిస్తున్న ఇమ్రాన్‌ పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేడు. ఇన్నాళ్లూ ఇమ్రాన్‌ సర్కార్‌కి వ్యతిరేకంగా ఉన్న వారిపై ఉక్కుపాదం మోపుతూ వచ్చిన పాక్ సైన్యం కూడా మెల్లిగా ఇమ్రాన్ ఖాన్‌కు దూరం జరగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ నుంచి సైన్యం దూరమైతే.. అప్పుడు పదవిలో కొనసాగడం ఇమ్రాన్ ఖాన్‌కు కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు పాక్ మీడియాని చెప్పుచేతల్లో పెట్టుకున్న ఇమ్రాన్ తన వైఫల్యాలు, ప్రభుత్వ అరాచకాలు వెలుగు చూడవని అనుకున్నారు. కానీ విపక్ష పార్టీలు ఇంటర్నేషనల్ మీడియాను, సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఇమ్రాన్ ఖాన్ గుట్టు రట్టు చేస్తున్నాయ. తద్వారా ఇమ్రాన్ ఖాన్ వైఫల్యాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్లాయి విపక్షాలు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారడంతో ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకుంటాడని అందరు అనుకున్నా.. దానికి భిన్నంగా పదవిని పట్టుకుని వేలాడుతున్నాడు. అయితే.. నవాజ్‌ షరీఫ్‌ పార్టీ పీఎంఎల్‌ఎన్‌, జర్దారీ పార్టీకి మధ్య ఒప్పందం కుదిరితే.. ఆ వెంటనే ఇమ్రాన్‌ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. ఆ పరిణామం చోటుచేసుకోవడానికి ఎంతో సమయం పట్టదని విశ్లేషకులు అంటున్నారు.

కునారిల్లిన పాక్ ఆర్థిక పరిస్థితి

పాకిస్తాన్ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి. దాంతో కొత్తగా సంపద సృష్టి అనేది జరగని మాట. ఈ క్రమంలో కేవలం అప్పులతోనే దేశాన్ని నెట్టుకొస్తున్నాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్? కరోనా కారణం కావచ్చు.. లేదా మరే మార్గం లేకపోవచ్చు కానీ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మొదటి ఏడు నెలల్లో పాకిస్తాన్ 670 బిలియన్ డాలర్ల అప్పులు చేశారు. ఇందులో 500 బిలియన్ డాలర్ల మొత్తం ఒక్క చైనా నుంచే తెచ్చుకున్నదే. వాణిజ్య రుణం పేరిట చైనా నుంచి కొత్త అప్పుగా తెచ్చుకుంది పాకిస్తాన్. ఇంతలా అప్పులు పేరుకు పోవడంతోపాటు నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్ ప్రజల్లో ఇమ్రాన్‌ పట్ల విశ్వాసం సన్నగిల్లిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ALSO READ: దాడుల తర్వాత కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం.. సానుభూతి వర్కౌట్ అయ్యేనా?