మిడతల దాడి.. వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన పాక్‌

| Edited By:

Jun 30, 2020 | 1:43 PM

ఓ వైపు కరోనాతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంటే.. మరోవైపు పలు దేశాల్లో మిడతలు దాడి చేస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి.

మిడతల దాడి.. వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన పాక్‌
Follow us on

ఓ వైపు కరోనాతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంటే.. మరోవైపు పలు దేశాల్లో మిడతలు దాడి చేస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో మిడతల సమస్యను అధిగమించేందుకు పాకిస్థాన్ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. మిడతలను పట్టుకొని వాటితో సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేసేలా పాక్‌ జాతీయ ఆహార భద్రత, పరిశోధన మంత్రిత్వ శాఖ ఓ పథకాన్ని అమలు చేయబోతోంది. గ్రామస్థాయిలో ప్రజల నుంచి మిడతలను కొనుగోలు చేసి, పంట వ్యర్థాలతో కలిపి బయో ఎరువు తయారు చేసి తద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న అక్కడి అధికారులు అనుకుంటున్నారు.

దీనివలన 25% మేరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడంతోపాటు 10–15% వరకు పంట దిగుబడులు పెంచుకోవాలన్న ఆలోచనలో పాక్ ఉంది. మిడతలతో తయారైన సేంద్రియ ఎరువులో నత్రజని 9 శాతం, ఫాస్ఫరస్‌ 7 శాతం అధికంగా ఉంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రక్రియలో పరిశోధన, విస్తరణ, అధ్యాపక, పౌర సమాజ ప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నారు. రానున్న 3–4 నెలల్లో అక్కడి ఖోలిస్తాన్, థార్‌ ఎడారి ప్రాంతాల్లో ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నారు.

ఈ క్రమంలో అక్కడ బాధిత ప్రాంతాల ప్రజలకు కందకాలు తవ్వి, వలలు వేసి మిడతలను పట్టుకోవటంపై అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. 50 చోట్ల మిడతల సేకరణ కేంద్రాలను తెరవనున్నారు. అంతేకాదు తొలి ఏడాదే రూ. వంద కోట్ల విలువైన మిడతల కంపోస్టును తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ”మిడతల వల్ల జరిగే పంట నష్టంలో ఒక్క శాతం తగ్గినా రూ. 3,200 కోట్ల లాభం కలుగుతుంది. లక్ష టన్నుల మిడతల ద్వారా 70 వేల టన్నుల కంపోస్టు తయారవుతుంది. దీనివలన సగటున ప్రతి క్రుటుంబం నెలకు రూ. 6 వేల ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రాజెక్టు పెట్టుబడి మూడేళ్లలో వస్తుంది అని” పాక్‌‌ జాతీయ ఆహార భద్రత, పరిశోధన మంత్రిత్వ శాఖ తెలిపింది.