AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్‌కు భారీ నజరానా.. రూ. 14 కోట్లు ప్రకటించిన పాక్ సర్కార్!

ఉగ్రవాదుల బడాడాన్‌కి మరచిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్‌ సింధూర్‌. ఉగ్రసౌధం కళ్లముందే పేకమేడలా కూలిపోయింది. తట్టుకోలేక ఘొల్లుమని ఏడ్చాడు. అంతలోనే బాధా లేదు భయమూ లేదంటూ విర్రవీగాడు. ఫ్యామిలీ అంతా నేలకొరిగినా ఆ ఉగ్రముష్కరుడు మాత్రం వాగుతూనే ఉన్నాడు. ఉగ్రశిబిరాలు నేలమట్టమైనా విర్రవీగుతూనే ఉన్నాడు.

గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్‌కు భారీ నజరానా.. రూ. 14 కోట్లు ప్రకటించిన పాక్ సర్కార్!
Masood Azhar
Balaraju Goud
|

Updated on: May 13, 2025 | 11:52 AM

Share

ఉగ్రవాదుల బడాడాన్‌కి మరచిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్‌ సింధూర్‌. ఉగ్రసౌధం కళ్లముందే పేకమేడలా కూలిపోయింది. తట్టుకోలేక ఘొల్లుమని ఏడ్చాడు. అంతలోనే బాధా లేదు భయమూ లేదంటూ విర్రవీగాడు. ఫ్యామిలీ అంతా నేలకొరిగినా ఆ ఉగ్రముష్కరుడు మాత్రం వాగుతూనే ఉన్నాడు. ఉగ్రశిబిరాలు నేలమట్టమైనా విర్రవీగుతూనే ఉన్నాడు.

అలాంటి ఉగ్రముష్కరుడికి దుష్ట పాకిస్థాన్ ప్రత్యేక నజరానా ప్రకటించింది. కరుడుగట్టిన అండర్‌గ్రౌండ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు 14 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు పాకిస్తాన్ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఆపరేషన్ సింధూర్‌లో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలందరికీ ఒక్కొక్కరికి రూ.1 కోటి ఆర్థిక సహాయం అందించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం షుహాద్ ప్యాకేజీని ప్రకటించింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇంటిపై భారత్ సైన్యం దాడి చేసింది. బహవల్పూర్‌లో ఉన్న మసూద్‌ ఇల్లు నేలమట్టం అయ్యింది. ఈ ఘటనలో మసూద్‌తో సంబంధం ఉన్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ కారణంగానే పాకిస్తాన్ ప్రభుత్వం షుహాద్ ప్యాకేజీ నుండి మసూద్ కు రూ.14 కోట్లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

ఇదిలావుంటే, దాడి తర్వాత, మసూద్ అజార్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశాడు. భారతదేశం చేసిన ఆపరేషన్ వల్ల తన అక్క, బావమరిది తోపాటు అతని పిల్లలు మరణించారని మసూద్ చెప్పాడు. దీని తరువాత, మసూద్ సోదరుడు రవూఫ్ మరణ వార్త కూడా బయటకు వచ్చింది. పాకిస్తాన్ మీడియా ప్రకారం, ఈ దాడిలో రవూఫ్ కూడా మరణించాడు. ఈ మరణాల వార్త విన్న తర్వాత మసూద్ చాలా కలత చెందాడు. మసూద్ ఒక లేఖ విడుదల చేశాడు. నేను ఇప్పుడు జీవించాలని అనుకోవటం లేదని. నేను కూడా ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నాను అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

మసూద్ కుటుంబానికి చెందిన ఉగ్రవాదులందరినీ చంపారు. వారందరికీ మసూద్ సంరక్షకుడు. మసూద్ బావమరిది తన సొంత మదర్సాలో పిల్లలకు శిక్షణ ఇచ్చేవాడు. సోదరి కూడా మసూద్ ఇంట్లో నివసించేది. అదేవిధంగా, అతని సోదరుడు జైషేతో సంబంధం కలిగి ఉన్నాడు. కాందహార్ విమాన హైజాక్ కేసులో ప్రధాన సూత్రధారి కూడా. అంటే, ప్రకటించిన పరిహారం మొత్తం ప్రకారం, ప్రతి ఉగ్రవాదికి మసూద్‌కు రూ. 1 కోటి ఇవ్వడం జరుగుతుంది. అయితే, బహావల్‌పూర్‌లో చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన డబ్బు ఎవరికి ఇస్తారన్న దానిపై పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.

మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్‌లో మసూద్ అజార్‌ బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ హెడ్‌క్వార్టర్‌ ఇదే. బహావల్‌ పూర్ పాక్‌లో 12వ అతిపెద్ద నగరం.. ఇక్కడున్న జామియా మసీద్‌ సుభాన్ అల్లా కాంప్లెక్స్‌ నుంచి జైషే మహమ్మద్‌ టెర్రర్‌ ప్లాన్స్‌ వేస్తోంది. దాదాపు 18 ఎకరాల్లో ఉంది ఆ సంస్థ టెర్రర్‌ క్యాంప్‌ ఉంది. దాన్ని సమాధి చేయడంతో మసూద్‌ అజార్‌ రగిలిపోతున్నాడు. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి మసూద్ అజార్ అజ్ఞాతంలో ఉన్నాడు.

మసూద్ అజార్‌ మొదట్లో హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి.. 2000 సంవత్సరంలో జైష్-ఎ-మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మసూద్ అజార్‌ని 1994లో భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో అతనితో పాటు మరో ఇద్దరిని భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతడ్ని మట్టుబెట్టేందుకు భారత్‌ ఆర్మీ దూకుడు మీదుంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితేంటన్నది ఎవరికీ తెలీట్లేదు. మసూర్ అజార్‌ ఇప్పుడెక్కడున్నాడు..? ఎప్పుడూ హై సెక్యూరిటీ కల్పించే పాకిస్థాన్‌ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా..? లేక మరెక్కడైనా దాక్కున్నాడా అన్నది తెలియట్లేదు. అంతేకాదు ప్రతీకారం తప్పదన్న లేఖ అతనిదేనా.. లేకపోతే ఉగ్రగురువు పోవటంతో అతని తోకలెవరన్నా వదిలారా అన్న డౌట్‌ కూడా ఉత్పన్నమవుతోంది. మరోవైపు మసూద్‌ అజార్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కథ మిగిలే ఉందంటూ ఆయన కామెంట్స్‌ చర్చనీయాంశమయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..