
ఇరాన్, అమెరికాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ ఒక సంచలన వార్త అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వాషింగ్టన్ పర్యటనలో భాగంగా మే 29న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఇషాక్ దార్ అమెరికాకు చేరవేశారని, ఇది విన్న రూబియో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని మాజీ సీఐఏ (CIA) విశ్లేషకుడు లారీ జాన్సన్ ఆరోపించారు.
ఈ లీకేజీ వ్యవహారంపై అమెరికా కాంగ్రెస్‌లోనూ చర్చ జరిగింది. జూన్ 2న యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు స్కాట్ పెర్రీ, మార్కో రూబియోను ఈ విషయమై ప్రశ్నించారు. “ఇరాన్ తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉందనే సందేశాన్ని ఇషాక్ దార్ మీకు ఇచ్చారా?” అని అడగగా, రూబియో ఆ వార్తలను తోసిపుచ్చారు. అలాంటి నివేదికలేవీ తాను చూడలేదని, ఇరాన్ ప్రస్తుతానికి అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయలేదని మాత్రమే తనకు తెలుసని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఆరోపణలు ఇరాన్-పాకిస్తాన్ సంబంధాలను దెబ్బతీసేలా ఉండడంతో పాక్ విదేశాంగ శాఖ తక్షణమే స్పందించింది. గురువారం (జూన్ 4) నాడు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. అమెరికా విదేశాంగ మంత్రితో జరిగిన సమావేశంలో ఇరాన్ అణు కార్యక్రమం గురించి ఎలాంటి చర్చా జరగలేదని, లారీ జాన్సన్ చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవ దూరం అని కొట్టిపారేశారు.
మరోవైపు ఇరాన్ వద్ద ప్రస్తుతం 60 శాతం వరకు సుసంపన్నం చేసిన 440 కిలోగ్రాముల యురేనియం ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. దీనిని 90 శాతానికి పెంచితే ఇరాన్ సులభంగా అణ్వాయుధాన్ని తయారు చేయగలదు. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలు సాధిస్తే అది ఇజ్రాయెల్ ఉనికికే ముప్పని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తామే వారధిగా ఉంటామని పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ, ఈ లీకేజీ ఆరోపణలు పరోక్షంగా ఇరాన్‌కు ద్రోహం చేసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..