
Pakistan Elections 2024: పాకిస్తాన్‌లో గురువారం (ఫిబ్రవరి 8న) సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. పకడ్బంధీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. 266 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే, ఏడాది కాలంగా దేశం రాజకీయ, ఆర్థిక, న్యాయపరమైన సమస్యలకు కేంద్రంగా ఉంది. 240 మిలియన్ల జనాభా ఉన్న పాకిస్తాన్ దేశంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తర్వాత.. గత ఐదేళ్లలో పాకిస్తాన్ ముగ్గురు ప్రధాన మంత్రులు మారారు. ఇమ్రాన్ ఖాన్ (2018-2022), షెహబాజ్ షరీఫ్ (2022- 23), అన్వార్-ఉల్-హక్ కాకర్ (2023-ప్రస్తుతం) ప్రధానమంత్రిగా ఉన్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ప్రముఖ పోటీదారులలో ఒకటిగా ఉండగా.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు.. ఆయన రాజకీయ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. మునుపటి ప్రభుత్వాల మాదిరిగానే అనేక సమస్యలు పాక్ ను సతమతం చేస్తున్నాయి. ఆర్థిక, సామాజిక-రాజకీయం, ఉగ్రవాదం, భద్రతా సవాళ్లు పాకిస్తాన్ ప్రభుత్వం ముందున్నాయి.
కాగా.. పాకిస్తాన్ ద్విసభ పార్లమెంటరీ వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో జాతీయ అసెంబ్లీలోని పలువురు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. వాటిలో 266 స్థానాలకు ప్రజలు ఓటు వేసి సభ్యులను నిర్ణయిస్తారు. 266 స్థానాల్లో 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు ముస్లిమేతరులకు రిజర్వ్ చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 141 సీట్లు ఉండగా.. సింధ్‌లో 75, ఖైబర్ పఖ్తుంక్వాలో 55, బలూచిస్థాన్‌లో 20, ఇస్లామాబాద్‌లో మూడు సీట్లు ఉన్నాయి.
పాకిస్తాన్‌లో 12.85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇది దేశ జనాభాలోని 241 మిలియన్లలో సగానికి పైగా ఉంది. ఓటర్లలో.. 6.9 కోట్ల మంది పురుషులు ఉండగా, 5.9 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా.. ప్రస్తుతం.. నమోదైన ఓటర్లలో కూడా 44 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. 2018 నుంచి దేశంలో ఓటర్ల సంఖ్య 2.25 కోట్లు పెరిగినట్లు అక్కడి ఎన్నికల సంఘం తెలిపింది. అందులో 1.25 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 52 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పాకిస్తాన్ 2024 ఎన్నికల్లో 5,121 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 4,806 మంది పురుషులు, 312 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 167 నమోదిత రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా మొత్తం 5,121 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. రాష్ట్ర శాసనసభల్లో 12,695 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ కూడా పోటీ చేస్తోంది. 25 ఏళ్ల సవీరా ప్రకాశ్ పాకిస్తాన్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా ప్రావిన్సులో బునెర్ జిల్లాలోని పీకే–25 నియోజకవర్గం నుంచి పీపీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.
పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు..
ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల్లో.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఫలితంగా పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కాగా.. సార్వత్రిక ఎన్నికల కోసం మొత్తం 90,582 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈ పోలింగ్ స్టేషన్లలో దాదాపు 17,500 అత్యంత సున్నితమైన పోలింగ్ స్టేషన్లుగా నిర్ణయించారు. పాక్ ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసి.. అభ్యర్థులను ఎన్నుకోనున్నారు.
ఇదిలాఉంటే.. పాక్ లో ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలుచిస్తాన్ ప్రాంతంలో రెండో చోట్ల బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ రెండు విధ్వంసక ఘటనల్లో 25 మందికి పైగా మరణించగా.. 50 మంది వరకు గాయాలపాలయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..