మరికొన్ని గంటల్లో ఎన్నికలు.. అంతలోనే ఉగ్రవాదుల దుశ్చర్య.. 25మంది దుర్మరణం..

Pakistan Elections 2024: పాకిస్థాన్‌లో మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. గురువారం పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది.. ఈ క్రమంలోనే ముందు రోజు బుధవారం (ఫిబ్రవరి 7) బలూచిస్థాన్‌లోని పిషిన్ ప్రాంతంలోని స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 25మందికిపై మరిణించారని.. పాక్ మీడియా తెలిపింది.

మరికొన్ని గంటల్లో ఎన్నికలు.. అంతలోనే ఉగ్రవాదుల దుశ్చర్య.. 25మంది దుర్మరణం..
Pakistan Blast

Updated on: Feb 07, 2024 | 4:34 PM

Pakistan Elections 2024: పాకిస్థాన్‌లో మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. గురువారం పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.. ఈ క్రమంలోనే ముందు రోజు బుధవారం (ఫిబ్రవరి 7) ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని గంటలముందు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులు నిర్వహించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఎన్నికల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన రెండు విధ్వంసక బాంబు పేలుళ్లలో కనీసం 25 మంది మరణించగా.. 42 మందికి పైగా గాయపడ్డారు. మొదటి సంఘటనలో, పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ కార్యాలయం వెలుపల జరిగిన పేలుడులో 17 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు.

ఒక గంట లోపే, కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్-ఉలేమా ఇస్లాం-పాకిస్థాన్ ఎన్నికల కార్యాలయం వెలుపల మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు.

బలూచిస్థాన్ పంజ్‌గూర్‌లోని సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా జెహ్రీ మాట్లాడుతూ, అభ్యర్థి అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ ఎన్నికల కార్యాలయం వెలుపల జరిగిన పేలుడు రిమోట్‌తో పేల్చివేశారని.. భవనం వెలుపల ఒక సంచిలో బాంబును ఉంచి ఈ విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు.

గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని చికిత్స నిమిత్తం క్వెట్టాకు తరలించామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 17 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అబ్దుల్లా చెప్పారు.

పోలింగ్ స్టేషన్‌లకు ప్రజలు వెళ్లకుండా ఉగ్రవాదులు ఎన్నికల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా భద్రతా సిబ్బందిని మరింత పెంచుతున్నామని జెహ్రీ చెప్పారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని JUI అభ్యర్థి ఎన్నికల కార్యాలయం లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారీ నష్టం వాటిల్లిందని.. ఎనిమిది మంది మరణించారని తెలిపారు.

పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ECP) రెండు పేలుళ్లను ధృవీకరించింది. గురువారం ఎన్నికల కోసం ప్రావిన్స్‌లో భద్రతను మరింత పెంచినట్లు తెలిపింది.ఈ ఉగ్రదాడులకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని.. ఎవ్వరిని ఉపేక్షించమని ECP అధికార ప్రతినిధి తెలిపారు. బలూచిస్తాన్ హోం మంత్రి జన్ అచక్జాయ్ ఈ దాడులను ఖండించారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..