ఇస్లామాబాద్, ఆగస్టు 15: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హఖ్ కాకర్ (52) సోమవారం (ఆగస్టు 14) ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి భవనం ‘ఐవాన్ ఇ సదర్’లో నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ అపద్ధర్మ ప్రధానిగా కకర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పాక్ ప్రధాని పదవి నుంచి వైదొలగిన షెహబాజ్ షరీఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజాగా ప్రమాణం చేసిన అన్వర్ పాకిస్థాన్‌కు 8వ తాత్కాలిక ప్రధానమంత్రి కావడం గమనార్హం. కకర్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే పాక్ పార్లమెంటు ఎగువ సభకు సోమవారం ఆయన రాజీనామా చేశారు. సెనేట్ ఛైర్మన్ సాదిక్ సంజరాణి కకర్ రాజీనామాను ఆమోదించారు. మరోవైపు పాక్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న క్రమంలో కకర్ తాను స్థాపించిన బలూచిస్థాన్ అవామీ పార్టీకి (బీఏపీ) సైతం రాజీనామా చేశారు. మరికొద్ది నెలల్లో జరగాల్సిన నేషనల్ అసెంబ్లీ (దిగువసభ) సార్వత్రిక ఎన్నికలను నిష్పాక్షపాతంగా నిర్వహించం, దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం కకర్ ముందున్న ప్రధాన లక్ష్యాలు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు.
కాగా ఈ నెల 9న పాక్ పార్లమెంట్ రద్దు అయిన సంగతి తెలిసిందే. పాక్ పార్లమెంట్ నియమాల ప్రకారం ప్రభుత్వం రద్దయిన 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఎన్నికల నిర్వహణ 2 నెలలు ఆలస్యం కానున్నాయి. ఆపద్ధర్మ ప్రధానిగా కకర్ ఎంపికపై ప్రతిపక్ష నేత రియాజ్ ఆపద్ధర్మ ప్రధానిగా చిన్న ప్రావిన్స్‌కు చెందిన నేత ఉండాలని నిర్ణయించామని, ఈ క్రమంలోనే బలూచిస్థాన్‌కు చెందిన కాకర్ పేరును తమ పార్టీ ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. దానిని మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు. దీంతో కాకర్ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదముద్ర వేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.