North Korea: ఏ క్షణానైనా యుద్ధం.. సిద్ధం కావాలంటూ ఆర్మీకి కీలక ఆదేశాలిచ్చిన కిమ్‌..!

|

Mar 10, 2023 | 3:27 PM

North Korea: దక్షిణ కొరియా, అమెరికా ఈ ఐదేళ్లలోనే అతిపెద్ద సంయుక్త సైనిక విన్యాసాలను సోమవారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉత్తర కొరియాలో డ్రిల్ జరిగింది.

North Korea: ఏ క్షణానైనా యుద్ధం.. సిద్ధం కావాలంటూ ఆర్మీకి కీలక ఆదేశాలిచ్చిన కిమ్‌..!
Kim Jong Un
Follow us on

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్ ఉన్ మిలిటరీకి సంచలన ఆదేశాలు జారీ చేశారు. యుద్ధానికి సిద్ధం ఉండాలని ఆదేశ సైన్యానికి పిలుపునిచ్చారు. ఇప్పటికే మిలిటరీ డ్రిల్ కొనసాగుతుండగా.. ఇక నిజమైన వార్‌కు రెడీ అవ్వాలంటూ హుకుం జారీ చేశారు. తన కూతురితో పాటు ఈ డ్రిల్స్‌ను పరిశీలించిన కిమ్‌…వెంటనే ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

వచ్చేవారం ప్రారంభం కానున్న అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల పట్ల ఉత్తర కొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది తమ ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతుందని, ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొడుతున్నారని ఆ దేశం ఆరోపిస్తోంది. అమెరికా B-52 బాంబర్‌ను దక్షిణ కొరియా ఫైటర్ జెట్‌లతో జాయింట్ డ్రిల్ కోసం ఇప్పికే ఆదేశ సరిహద్దుల్లో మోహరించాయి. ఈ నేపథ్యంలో కిమ్ కూడా దుందుడుకు చర్యలు కొనసాగిస్తున్నారు. సైన్యాన్ని యుద్ధానికి సిద్దంగా ఉండాలని ఆదేశించారు.

ఏ క్షణానైనా యుద్ధం వచ్చే అవకాశముందని.. నిజయమైన యుద్ధం కోసం విన్యాసాలు తీవ్రతరం చేయాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. తన రెండో కుమార్తెతో కలిసి సైనిక విభాగం ఫైర్ డ్రిల్‌ను పర్యవేక్షించినట్టు పేర్కొంది. అధికారిక మీడియా విడుదల చేసిన ఫోటోల్లో కిమ్, అతని కుమార్తె ఇద్దరూ నల్లటి జాకెట్లు ధరించి, యూనిఫాంలో ఉన్నట్లు తెలిపింది. ఆదేశ ఉన్నతాధికారులతో కలిసి ఫిరంగి దళం చేపట్టిన క్షిపణి ఫైరింగ్‌ను వారు వీక్షించారు. కాగా, ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించామని పేర్కొన్న దక్షిణ కొరియా సైన్యం.. అదే ప్రదేశం నుంచి అనేక ప్రయోగాల అవకాశాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటికే ఉత్తర కొరియా నుంచి ఓ బాలిస్టిక్ మిజైల్‌ లాంఛ్ అయినట్టు గుర్తించామని దక్షిణ కొరియా వెల్లడించింది. మరి కొన్ని మిజైల్స్‌నీ లాంఛ్ చేసే ప్రమాదముందన్న అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు హ్వాసంగ్ యూనిట్ నుంచి ఒకేసారి ఆరు మిజైల్స్‌ను లాంఛ్ చేసినట్టు గుర్తించామని తెలిపింది. దాడులు చేసేందుకు వినియోగించే క్షిపణులను టెస్ట్ చేయడంపై సౌత్ కొరియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొరియాలోని పశ్చిమ సముద్రాన్ని టార్గెట్‌గా చేసుకుని దాడులకు తెగబడే అవకాశముందంటోంది.

ఇక దక్షిణ కొరియా, అమెరికా ఈ ఐదేళ్లలోనే అతిపెద్ద సంయుక్త సైనిక విన్యాసాలను సోమవారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ డ్రిల్ జరిగింది. ఉభయ కొరియాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉత్తర కొరియా మరింతే రెచ్చగొట్టేలా అణ్వాయుధ, క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా దక్షిణ కొరియా.. అగ్రరాజ్యం అమెరికాతో భద్రతా సహకారాన్ని తీసుకుంటోంది.

కాగా, అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ రెండు రోజుల కిందటే గట్టి హెచ్చరికలు పంపిన విషయం తెలిసిందే. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే, అది ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించినట్టుగానే భావిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా క్షిపణి పరీక్షలు చేపడుతోందని, అందుకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టే ఎలాంటి సైనిక చర్య అయినా అది యుద్ధ ప్రకటనే అవుతుందని ఆమె హెచ్చరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..చదవండి