కరోనా ఎఫెక్ట్ : ఆ దేశంలో న్యూఇయర్ వేడుకలు నిషేధం.. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన దేశాలు..ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. మరో వైపు కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన దేశాలు..ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. మరో వైపు కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒక వైపు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టి అన్‌లాక్‌లో ఉంటే.. జర్మనీ దేశం మాత్రం లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతోంది. కరోనా కట్టడి కోసం డిసెంబర్ 16 నుంచి జనవరి 10వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించనున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెలా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశంలో కొత్త సంవత్సరం వేడుకలపై కూడా నిషేధం విధించింది అక్కడి మంత్రిత్వశాఖ. అంతేకాకుండా క్రిస్మస్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటంతో పలు ఆంక్షలు విధించింది.
ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, బార్లు, ఇతర కేంద్రాలు సైతం నవంబర్ నుంచి మూతపడ్డాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జర్మనీలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కోవిడ్ ప్రభావం న్యూఇయర్ వేడుకలపై పడింది. ఇక క్రిస్మస్ పండగ సందర్భంగా కేవలం ఐదుగురు మాత్రమే ఒక చోట చేరడానికి అనుమతి ఇచ్చింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. క్రిస్మస్, న్యూఇయర్ వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయితే మిగతా యూరప్ దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి విషయంలో జర్మనీ మెరుగ్గానే ఉంది.
ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెలా అభిప్రాయపడుతున్నారు. అయితే జర్మనీలో ఇప్పటి వరకు 13 లక్షలకుపైగా మంది కరోనా బారిన పడగా, 22 వేల మంది మృతి చెందారు. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతుండటం, అందులో క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుండటంతో ముందస్తు చర్యలు చేపట్టింది.