Covid Variant: బ్రిటన్‌లో కలకలం రేపుతున్న కొత్త వేరియంట్‌ వైరస్‌.. 16 మందిలో గుర్తింపు

|

Jul 26, 2021 | 6:08 AM

Covid Variant: గత ఏడాది నుంచి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. అయితే ఈ వైరస్‌ రూపాంతరం చెందుతూ

Covid Variant: బ్రిటన్‌లో కలకలం రేపుతున్న కొత్త వేరియంట్‌ వైరస్‌.. 16 మందిలో గుర్తింపు
Follow us on

Covid Variant: గత ఏడాది నుంచి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. అయితే ఈ వైరస్‌ రూపాంతరం చెందుతూ కొత్త కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. డెల్టా వేరియంట్‌ కారణంగా బ్రిటన్‌లో విధించిన ఆంక్షలను ఇప్పుడిప్పుడే సడలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో మరో కొత్త రకం బయట పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 16 మందిలో బి.1.621 వేరియంట్‌ వైరస్‌ను బ్రిటన్‌ ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. అయితే కొత్త వేరియంట్‌ వైరస్‌ గురించి విచారణ జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. 16 కేసుల్లో పది కేసులను లండన్‌లోనే గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే అంతర్జాతీయ ప్రయాణాల వల్లనే ఈ కేసులు బ్రిటన్‌లోకి వచ్చి ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం, సామూహిక వ్యాప్తి గురించి స్పష్టమైన సమాచారం లేదని పేర్కొన్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు లేబొరేటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇతరులకు వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దీని ప్రభావం తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు బిట్రన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కొత్త వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌వో స్పందన

కాగా, ఈ బ్రిటన్‌లో కొత్తగా వ్యాప్తి చెందిన వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది. ఈ వేరియంట్‌ను తొలిసారిగా జనవరిలో కొలంబియాలో గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ అమెరికాలో – 592 కేసులు, పోర్చుగల్‌ – 56, జపాన్ – 47, స్విట్జర్లాండ్‌ – 41 కేసులు గుర్తించినట్లు వెల్లడించింది. గత కొన్ని వారాలుగా బ్రిటన్‌లో డెల్టా వేరియంట్‌ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని, అయినా ఈ వారంలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. తాజా నివేదికల ప్రకారం బ్రిటన్‌లో ఆర్ రేటు 1.2 నుంచి 1.4 శాతంగా ఉంది. దీని ప్రకారం కరోనా సోకిన వ్యక్తి వైరస్‌ను ఒకరి కంటే ఎక్కువ మందికి వ్యాప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి

Delta Variant: రెండు డోసుల టీకా తీసుకున్నా కరోనా ఆగట్లేదు.. కారణాలేమిటి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Covid 19: కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి.. సెప్టెంబర్ కల్లా పిల్లలకు కోవిడ్ టీకాలుః ఎయిమ్స్ చీఫ్ గులేరియా