Nepal: నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత.. హోంమంత్రి రాజీనామా
నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది. అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్‌పై వారం క్రితం నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం.. దీంతో యువత Gen-z పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది.

నేపాల్ అట్టుడుకుతోంది.. సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు Gen-z పేరుతో అవినీతి వ్యతిరేక పోరాటంగా మారింది. ప్రధాని ఓలి తీరును తప్పుబడుతున్న ఆందోళనకారులు… సోషల్ మీడియాపై బ్యాన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు జర్నలిస్టు సంఘాలు సైతం ఆందోళన బాట పట్టాయి. ఇక పరిస్థితిని అదుపు చేయడానికి నేపాల్ రాజధాని ఖాట్మండు సహా 10 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. నేపాల్‌లో జరిగిన Gen Z ఆందోళనల్లో ఇప్పటివరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలోనే.. నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది. అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ నిర్ణయం తీసుకున్నారు.
నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్‌పై వారం క్రితం నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం.. దీంతో యువత Gen-z పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. కాఠ్మాండులో జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగింది. వేలాదిమంది యువకులు నేపాల్ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా.. 300 మందికి పైగా గాయాలయ్యాయి.. కాగా.. అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధానికి అందజేశారు రమేష్ లేఖక్..
చివరకు ఆందోళనలకు తలొగ్గిన నేపాల్ సర్కార్ సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసింది. అయినప్పటికీ.. ఆందోళనకారులు తలొగ్గడం లేదు.. ప్రధాని ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వృద్ధ నాయకత్వం దిగిపోవాలని పోరాటం చేస్తున్నారు. కాగా.. ఈ ఆందోళనల వెనుక విదేశీ కుట్ర ఉందని నేపాల్ ప్రభుత్వం పేర్కొంటోంది.
యువత ఆక్రోశం..
కాగా.. నేపాల్ పార్లమెంట్ ప్రాంగణంలో యువత చేస్తున్న రచ్చ..కుర్రాళ్ల ఆక్రోశాన్ని చూసి పోలీసులే ఎదురెళ్లడానికి వణికిపోయారు.. ఒక్కసారిగా వేలాది మంది రావడంతో చేతులెత్తారు. ఫలితంగా పార్లమెంటులోకి దూసుకెళ్లి మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాస్థిని ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టాల్సిన పోలీసులే తమని తాము రక్షించుకోవడానికి చచ్చి బ్రతికారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బారికేడ్లు పెట్టినా, బాష్పవాయువు ప్రయోగించినా, వాటర్ కెనాన్స్‌తో విరుచుకుపడ్డా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దారి పొడుగునా ఉన్నా వాహనాలను తగులబెట్టుకుంటూ పోయారు. ప్రజాప్రతినిధుల కార్లకు నిప్పంటించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
