Mars Quakes: భూగ్రహం కాకుండా మానవులకు నివాసంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భూమికి అత్యంత దగ్గరగా అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చనే భావనతో నాసా ఇప్పటికే మార్స్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్ అనే రోవర్‌లను ప్రయోగించింది. ఈ రోవర్స్ సహాయంతో నాసా అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది.
తాజాగా అంగారక గ్రహంపై ఈ నెల 18 న సుమారు 90 నిమిషాల పాటు భారీ ప్రకంపనలు సంభవించాయని నాసా వెల్లడించింది. నాసాకు చెందిన ఇన్‌సైట్ ల్యాండర్ అంగారక గ్రహంపై నమోదైన భారీ ప్రకంపనలను రికార్డు చేసింది. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకంపనలు సంభవించడం ఇది మూడోసారి. 2019లో వచ్చిన 3.7 తీవ్రతతో పోలిస్తే.. తాజాగా కనిపించిన 4.2 తీవ్రత ప్రకంపనల ప్రభావం ఐదు రెట్లు అధికమని నాసా పేర్కొంది.
ఇన్‌సైట్ ల్యాండర్ ఇప్పటివరకు అంగారకపై సుమారు 700 ప్రకంపనలను గుర్తించింది. ఇన్‌సైట్ అందించిన సమాచారంతో నాసా శాస్త్రవేత్తలు భావించినా దాని కంటే అంగారక క్రస్ట్ అత్యంత పలుచగా ఉందని గుర్తించారు. భూగ్రహంతో పోలిస్తే అంగారకపై ప్రకంపనలు ఎక్కువ సమయం పాటు రావడానికి కారణం అంగారక క్రస్ట్ అత్యంత పలుచగా ఉండడమే కారణమని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.