Myanmar Military Action: ఆర్మీ నిర్బంధంలో మయన్మార్.. ప్రజల మీదికి ఖైదీల అస్త్రం.. సైన్యం నిర్ణయంపై ఆగ్రహం

|

Feb 15, 2021 | 5:37 PM

మయన్మార్ దేశంలో రోజురోజుకూ ఉద్రిక్తత పెరుగుతోంది. నిరసన వ్యక్తం చేయాలనుకుంటున్న ప్రజలపై మయన్మార్ ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా అమెరికా, ఇండియా వారిస్తున్నా మయన్మార్ సైన్యం వెనక్కి తగ్గడం లేదు.

Myanmar Military Action: ఆర్మీ నిర్బంధంలో మయన్మార్.. ప్రజల మీదికి ఖైదీల అస్త్రం.. సైన్యం నిర్ణయంపై ఆగ్రహం
Follow us on

Military rule in Myanmar at violent level: ఫిబ్రవరి ఒకటవ తేదీన సైనిక తిరుగుబాటుతో వార్తలకెక్కిన మయన్మార్ (బర్మా)లో ఆర్మీ అరాచకం కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించాలన్న ప్రజా సంకల్పాన్ని సైనికాధికారులు తమ బూట్ల కింద అణచివేస్తున్నారు. సామాన్య ప్రజల నెత్తిన కర్ఫ్యూ అస్త్రాన్ని సంధించి.. జనజీవనాన్ని దాదాపు స్థంభింపచేస్తోంది బర్మా ఆర్మీ. దేశంలో అతిపెద్ద నగరం యాంగూన్ (రంగూన్)తోపాటు పలు నగరాలు, పట్టణాలు సైనిక బలగాల కవాతులతో భీతిల్లిపోతున్నాయి.

దేశంలో మరోసారి ఇంటర్‌నెట్‌ను నిలిపి వేశారు సైనిక పాలకులు. ఆదివారం (ఫిబ్రవరి 14) అర్థరాత్రి దాటిన తర్వాత దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సదుపాయం నిలిపి వేశారు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలపై సైన్యం నిషేధం విధించింది. ప్రజాహక్కుల రద్దు వంటి సైనిక ప్రభుత్వ ఆదేశాలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రజలను, నిరసనకారులను భయభ్రాంతులను చేసేందుకు సైనిక ప్రభుత్వం ఏకంగా 23 వేల మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ విడుదలను అధికారికంగా ఎవరూ ధృవీకరించనప్పటికీ.. ఈ మేరకు వార్తలు షికారు చేస్తున్నాయి. రాత్రివేళ అలజడులు సృష్టించేందుకు గాను.. సైనిక ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతేడాది (2020 నవంబర్‌లో) జరిగిన ఎన్నికల్లో అవకతవకలపై సక్రమ విచారణ జరపలేదన్న సాకుతో.. సైన్యం ప్రభుత్వాన్ని కూలదోసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి ఫిబ్రవరి 1వ తేదీన అధికార పగ్గాలు చేపట్టాలని అనుకున్న ఆంగ్‌ సాన్‌ సూకితోపాటు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులను సైన్యం నిర్బంధించింది. ఇక దేశంలో చెలరేగుతున్న నిరసనలపై ఉక్కు పాదం మోపేందుకు సైనికాధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. ఆంగ్‌ సాన్‌ సూకిని ఇవాళ (ఫిబ్రవరి 15వ తేదీన) న్యాయస్థానంలో హాజరు పరచాల్సి వుండగా.. దానిని సైన్యం ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే, మిలిటరీ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా సూకీ గృహ నిర్బంధాన్ని మరో రెండు రోజులు అంటే ఫిబ్రవరి 17వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సూకీని కోర్టులో హాజరు పరిచే సమయంలో దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగవచ్చని భయపడిన మయన్మార్ మిలిటరీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట నుంచి, సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఇంటర్ నెట్‌ను నిలిపేశారు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటాన్ని ఆర్మీ ప్రభుత్వం నిషేధించింది. అంతేకాకుండా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తోంది.

పలు పౌర హక్కులను (సివిల్ రైట్స్) రద్దు చేస్తూ సైనిక నేత మిన్‌ ఆంగ్‌ లయాంగ్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. ఆదివారం నిరసనలు ఉధృతమయ్యాయి. నిబంధనలను అతిక్రమించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామన్న వార్నింగ్‌ను ఖాతరు చేయకుండా దేశ రాజధాని నయాపైటాతో సహా పలు ప్రాంతాల్లో లక్షలాది పౌరులు వీధులకెక్కారు. ఈ నిరసనల్లో ప్రభుత్వోద్యోగులు కూడా పెద్ద ఎత్తున పాలుపంచుకోవడం విశేషం. నిరసనకారులతో కలిపి ఉద్యమించేందుకు రైల్వే శాఖ సిబ్బంది కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. సైన్యం ఉద్దేశపూర్వకంగా విడుదల చేయ తలపెట్టిన ఖైదీలను ఎదుర్కొనేందుకు మయన్మార్‌ ప్రజలు ఐక్య రక్షక దళాలను తమ తమ ప్రాంతాల్లో సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మయన్మార్‌లో అంతర్యుద్ధం నెలకొనే పరిస్థితి వుందని అంతర్జాతీయ సమాజం హెచ్చరిస్తోంది.

మయన్మార్ వ్యవహారాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వారిపై హింసాత్మక చర్యలను మానుకోవాలని అమెరికా మయన్మార్ సైనికాధికారులను హెచ్చరించింది. అమెరికాతోపాటు కెనడా సహా 12 యూరోపియన్‌ దేశాల రాయబారులు మయన్మార్‌ సైనిక ప్రభుత్వానికి సునిశిత రీతిలో హెచ్చరిక జారీ చేశారు. మయన్మార్‌లో జరిగిన రాజకీయ నాయకుల అరెస్టులను కూడా ఈ దేశాల రాయభారులు ఖండించారు. మరోవైపు పొరుగునే వున్న మయన్మార్ వ్యవహారాలను భారత ప్రభుత్వం సునిశితంగా పరిశీలిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి మయన్మార్ వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రధాని మోదీకి నివేదిస్తున్నట్లు తెలుస్తోంది.

గత నవంబర్ నెలలో మయన్మార్ దేశంలో ఎన్నికలు జరుగుతుంటే ఇన్నేళ్ళ తర్వాతైనా ఆ దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని యావత్ ప్రపంచం భావించింది. ఎన్నికలు జరిగి.. నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్.ఎల్.డీ) అధినేత అంగ్ సాన్ సూకీ లాంటి ప్రజాస్వామ్యం పోరాట యోధురాలు ఆధిపత్యం సాధిస్తే పలు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ.. ఆ దేశ రాజ్యాంగమే అక్కడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తాజాగా ఆర్మీ తిరుగుబాటుతో నిరూపణ అయ్యింది. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం అక్కడి సైన్యానికి విశేషాధికారాలున్నాయి. దేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న అది బర్మా ఆర్మీ సానుకూల, వ్యతిరేక విధానాలపైనే ఆధారపడి వుంటుంది.

2020 నవంబరు నెలలో ఎన్నికలు జరిగిన నాటి నుంచీ సైన్యం, దాని అడుగులకు మడుగులొత్తే రాజకీయ నాయకుల కదలికలు అనుమానాస్పదంగానే ఉన్నాయని పలు దేశాల రాయభారులు ముందే హెచ్చరించారు. ఆర్మీ తిరుగుబాటు చేసేందుకు సరిగ్గా ఒక వారం రోజుల ముందు అనేక విదేశీ రాయబార కార్యాలయాలు తిరుగుబాటు జరిగే అవకాశముందన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. కానీ ఈ ప్రచారాన్ని మయన్మార్‌ సైన్యం కొట్టి పారేసింది. మయన్మార్ సైన్యాన్ని అనవసరంగా అనుమానిస్తున్నారని తేల్చేసింది. కొద్దిరోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో తిరుగుబాటు అనుమానాలపై కొందరు జర్నలిస్టులు ప్రశ్నించగా… సైన్యం ప్రతినిధి ఆ అవకాశాలను తోసిపుచ్చలేదు. దాంతో సైనిక తిరుగుబాటు ఖాయమన్న అభిప్రాయాన్ని పలు రాయభార కార్యాలయాలు తమ తమ దేశాలకు సమాచారమందించాయి.

మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నా.. అక్కడి సైన్యానికే విశేషాధికారాలుంటాయి. అందుకే సుదీర్ఘ గృహ నిర్బంధం నుంచి విడుదలై అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆంగ్‌ సాన్‌ సూకీ… మొదట్నించి సైన్యంతో సయోధ్యతోనే వ్యవహరించారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్‌ సైనికులు జరిపిన దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించినా… సూకీ మాత్రం సైన్యానికే మద్దతిచ్చారు. అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠకు మచ్చ వస్తున్నా సూకీ సైన్యంతో స్నేహంగానే మెలిగారు. ఇతరత్రా కూడా వారిపై ఎన్నడూ విమర్శలు గుప్పించలేదు.

నవంబర్ ఎన్నికల్లో అంగ్ సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్.ఎల్.డీ) పార్టీ ప్రతినిధుల సభలో 258 సీట్లు, హౌస్ ఆఫ్ నేషనాలిటీస్‌లో 138 సీట్లు గెలుచుకుంది. సైన్యం బహిరంగంగా మద్దతు ప్రకటించిన యూనియన్ సాలిడారిటీ డెవలప్‌మెంటు పార్టీ (యూ.ఎస్.డీ.పీ) ఘోర పరాజయం పాలైంది. దాంతో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పట్నించి దేశంలో సైనిక తిరుగుబాటు ఖాయమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బంపర్ మెజారిటీతో పాలన పగ్గాలు చేపట్టే అవకాశాలుండడంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ప్రతిపాదనను అంగ్ సాన్ సూకీ పరిశీలించడం ప్రారంభించారు. ఈ దిశగా సూకీ బృందం సంప్రదింపులు కూడా మొదలుపెట్టింది. రాజ్యాంగాన్ని సవరించి, సైన్యానికి వున్న విశేషాధికారాలను కత్తిరించాలన్న సూకీ చర్యలను సైనికాధికారులు సునిశితంగా గమనిస్తూ వచ్చారు. కొత్త పార్లమెంటు ఫిబ్రవరి 1న సమావేశం కానుందగా.. ఈ సెషన్‌లోనే రాజ్యాంగ సవరణకు సూకీ సర్కార్ చర్యలు చేపట్టే సంకేతాలను సైనికాధికారులు గమనించారు. దాంతో సరిగ్గా పార్లమెంటు సెషన్ ప్రారంభమయ్యే రోజున తెల్లవారుజామునే సైన్యం ఉన్నట్లుండి తిరుగుబాటుకు దిగింది.

సైనికాధినేత మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ గత కొంతకాలంగా దేశాధ్య పదవిపై కన్నేశారు. ఇందుకోసం ఆయనకు పార్లమెంటులో మెజార్టీ సభ్యుల మద్దతు అవసరం. మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం… పార్లమెంటులో 25 శాతం సీట్లు సైన్యం చేతిలో ఉంటాయి. రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో తమ మద్దతు అనివార్యంగా మారేందుకు ఈ ఏర్పాటు చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తమ కనుసన్నల్లో నడిచే యూఎస్‌డీపీ సీట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో… స్వయంగా 25 శాతం సీట్లున్నా సైన్యం రాజ్యాంగ సవరణను అడ్డుకునే అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో సైనికాధినేత లయాంగ్‌ దేశ అధ్యక్షుడయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. రాజ్యాంగబద్ధంగా దేశాధ్యక్ష పదవి తనకు దక్కే అవకాశాలు లేకపోవటంతో పాత పద్ధతిలో సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధం చేశారు లయాంగ్. అంతర్జాతీయంగా దాదాపు అన్ని దేశాలు కరోనా వైరస్‌పై సమరంలో మునిగి వుండడం.. అగ్రరాజ్య అమెరికా తమ అంతర్గత విషయాలతో బిజీగా వుండడం మయన్మార్ సైన్యానికి అనుకూల వాతావరణాన్ని కల్పించింది.

లయాంగ్‌ అధ్యక్ష పీఠాన్ని ఆశించడానికి కూడా బలమైన కారణాలున్నాయి. 2021 జులైలో ఆయనకు 65 ఏళ్ళు నిండుతాయి. దాంతో సైన్యాధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వుంటుంది. మామూలుగానైతే ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం ఏమీ కాదు. కానీ… రిటైర్మెంట్‌తో లయాంగ్‌కు కష్టాలు ఆరంభమయ్యే అవకాశం ఉంది. రోహింగ్యాలపై ఆయన సారథ్యంలోనే మారణకాండ జరిగిందనేది అంతర్జాతీయంగా ఉన్న ఆరోపణ. రిటైరైన తక్షణమే ఆయనపై అంతర్జాతీయంగా విచారణకు దారులు తెరుచుకుంటాయి. అప్పుడు సూకీ మద్దతిస్తారో లేదో తెలియదు. పదవిలో ఉంటే ఈ విచారణలన్నింటి నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే లయాంగ్‌ సైనిక తిరుగుబాటుకు ఆదేశించారన్నది పరిశీలకుల అంఛనా. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నట్లుగా ఆ దేశ సైన్యాధ్యక్షుడు లయాంగ్.. సైనిక తిరుగుబాటు అనివార్యమైనందునే ఆ దిశగా చర్యలు తీసుకున్నామని ప్రకటించడం గమనార్హం.

తాను అనుకున్న ప్రకారం సైనిక తిరుగుబాటుకు దిగిన లయాంగ్.. అంగ్ సాన్ సూకీని మరోసారి గృహనిర్బంధానికి పరిమితం చేశారు. దేశంలో టీవీ ప్రసారాలను, ఇంటర్ నెట్ వినియోగాన్ని బ్యాన్ చేశారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించారు. అయితే.. సైన్యం చర్యలపై దేశ ప్రజలు తమదైన శైలిలో నిరసన చర్యలకు దిగుతున్నారు. అంతర్జాతీయ సమాజం మయన్మార్ వైపు దృష్టి సారించేలా ఆ దేశ ప్రజాస్వామ్య వాదులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో నిరసనకారులపై ఉక్కుపాదం మోపేందుకు మయన్మార్ ఆర్మీ హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఇది ఆందోళన కలిగించే పరిణామమని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

భారత్ సహా పలు దేశాలు ఇదివరకే మయన్మార్ సైనిక చర్యను ఖండించాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బాధ్యతలను గత నెలలో చేపట్టిన బైడన్.. మయన్మార్ విషయంలో జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. తాజాగా అమెరికా, కెనాడా సహా 12 యూరోపియన్ దేశాలు మయన్మార్ సైన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. నిరసన కారులపై హింస ఇలాగే కొనసాగితే అమెరికా సారథ్యంలోని సంయుక్త సేనలు మయన్మార్‌లోకి ఎంటరవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మయన్మార్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: యూటీ ప్రకటనతో రాజకీయ కలకలం.. అసదుద్దీన్ వ్యూహమేంటి?