మహాత్మా గాంధీ అంటే భారత్ లోనే కాదు.. ప్రపంచం మొత్తం పేరొందిన నాయకుడు. అహింస, శాంతి గురించి చెప్తే తొలుత గుర్తొచ్చే నాయకుడు మహాత్మాగాంధీ. భారత స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన మహానీయుడు మహాత్మా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి కూడా. మహానీయుడు మహాత్మాగాంధీ 1948 జనవరి 30వ తేదీన తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసిందే. అయితే గాంధీ జయంతికి మూడు రోజుల ముందు ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓ కార్యక్రమానికి మహాత్మాగాంధీ ప్రత్యేక అతిథిగా దర్శనమిచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం ప్రతి ఒక్కరి వంతైంది. ఇదెలా సాధ్యమనే డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చు. కాని నేటి టెక్నాలజీ యుగంలో సాధ్యం కానిది ఏముంది. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అసాధ్యమైన ఎన్నో ఘటనలు సాధ్యమవుతున్నాయి. అలాగే టెక్నాలజీని ఉపయోగించి ఓ కార్యక్రమానికి మహాత్మాగాంధీ హాజరైన అనుభూతిని కల్పించారు. అంతేకాదు మహాత్ముడు సమావేశానికి హాజరై ప్రసంగించినట్లు చేశారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ ప్రత్యేక అతిథిగా కన్పించారు. అతిథిగా ప్రత్యక్షం కావడమే కాదు విద్యపై గాంధీ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. టెక్నాలజీని ఉపయోగించి దీనిని సాధ్యం చేశారు. యూనెస్కో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయిన్ బుల్ డెవలప్ మెంట్ (ఎంజీఐఈపీ) 10వ వార్షికోత్సవాలను ఐక్యరాజ్యసమితిలో ప్రారంభించారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహింసా లెక్చర్ సిరీస్ సందర్భంగా ఐక్యరాజ్యసమితి కి భారత ప్రతినిధి బృందం గాంధీజీ హోలోగ్రామ్ ను ప్రదర్శించింది.
ఈ సమావేశంలో ప్రదర్శించిన హోలో గ్రామ్ ను చూడగానే బాపూజీనే స్వయంగా సమావేశాలకు వచ్చారా అనే భావన కలిగింది. ఈహోలో గ్రామ్ కు ఉన్న వాయిస్ ఓవర్ విద్య పై మహాత్ముడి అంచనాలను అక్కడి సభికులతో పంచుకుంది. దీంతో స్వయంగా మహాత్మా గాంధీనే మాట్లాడుతున్న అనుభూతి కలిగింది. అక్షరాస్యత అనేది విద్యకు ప్రారంభం, ముగింపు కాదు. విద్యా విధానం ద్వారానే ఓ వ్యక్తిలోని ఉత్తమమైన లక్షణాలు బయటపడతాయి. ఆధ్యాత్మిక శిక్షణ కూడా విద్యా విధానానికి కేంద్ర బిందువుగా ఉంటుందని మాట్లాడారు.
ఈ చర్చలో ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్, ది కింగ్ సెంటర్ సీఈవో అట్లాంటా బెర్నిస్ కింగ్, డిజిటల్ విద్య పై యువ ప్రతినిధి ఇండోనేషియా రాకుమారి హయు పాల్గొన్నారు. అంతకుముందు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ సమావేశంలో ప్రసంగించారు. శాంతియుత సహనంతో కూడిన సమాజానికి మహాత్మా గాంధీ జీవితం ఓ మార్గం చూపిస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ మార్గాన్ని మనమంతా కలిసి అనుసరించాలని వసుధైక కుటుంబంలా ముందుకు సాగాలని ప్రపంచ దేశాలను ఆంటోనియో గుటెరస్ కోరారు.
ఇదిలా ఉండగా మహాత్మాగాంధీకి సంబంధించిన హోలో గ్రమ్ ను హైదరాబాద్ లోని మహాత్మాగాందీ డిజిటల్ మ్యూజియం రూపొందించింది. ఇది మహాత్మా గాంధీకి సంబంధించిన హోలో గ్రామ్ లో రెండో ఎడిషన్ అని మ్యూజియం అధికారులు తెలిపారు. డిజిటల్ గ్రాఫిక్ ఫైల్స్ ను సంగ్రహించి వాటిని మోషన్ గ్రాఫిక్స్ తో కలిపామని, దీంతో హోలో గ్రామ్ స్క్రిప్ట్ ను చదివేలా రూపొందించామన్నారు. భవిష్యత్తులో హోలో గ్రామ్ లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి, నేరుగా వ్యక్తులతో మాట్లాడేలా రూపొదంఇంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..