North Korea Covid-19: నియంత దేశంలో కరోనా విలయతాండవం.. ఆవేదన వ్యక్తం చేసిన కిమ్ జోంగ్ ఉన్..
దేశంలో కోవిడ్ -19 వ్యాప్తిపై మాట్లాడుతూ.. ఉత్తర కొరియా చరిత్రలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటోందని కిమ్ జోంగ్ ఉన్ ఆవేదన వ్యక్తంచేశారు.
Kim Jong Un on Coronavirus: నియంత కిమ్ జోంగ్ ఉన్ పరిపాలిస్తున్న ఉత్తర కొరియా దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు ప్రపంచ దేశాలను హడలెత్తించిన కరోనా.. ఒక్క ఉత్తర కొరియాలోనే ఎంటర్ కాలేదు.. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలోకి ఎంటరైన కోవిడ్ అలజడి రేపుతోంది. దీంతో నియంత కిమ్.. దేశంలో లాక్‌డౌన్ విధించారు. దేశంలో కోవిడ్ -19 వ్యాప్తిపై మాట్లాడుతూ.. ఉత్తర కొరియా చరిత్రలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటోందని కిమ్ జోంగ్ ఉన్ ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ మహమ్మారి ఇన్ఫెక్షన్ కేసులను రెండేళ్ల పాటు తిరస్కరించిన.. ఉత్తర కొరియా ఎట్టకేలకు గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించింది. దేశంలో పరిస్థితి అదుపు తప్పినట్లు స్వయంగా నియంత కిమ్ పేర్కొనడం.. పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తోంది. ఇప్పటివరకు ఈ నియంతృత్వ దేశంలో మాస్క్, వ్యాక్సిన్ లాంటివి కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సైతం ఎట్టకేలకు మాస్క్ ధరించి కనిపించారు.
కాగా.. ఉత్తర కొరియాలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే ఒకరు మృతి చెందారు. లక్షలాది మంది ప్రజలు జ్వరంతో బాధపడుతున్నట్లు మీడియా పేర్కొంది. శనివారం మరో 1,74,440 మందికి జ్వరం లక్షణాలు ఉన్నట్లు ఆ దేశ మీడియా నివేదించింది. కాగా.. జ్వరాలతో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు. గణాంకాల ప్రకారం.. మొత్తం 27 మంది రోగులు మరణించగా, మొత్తం 5,24,440 మంది అస్వస్థతకు గురయ్యారు. ఏప్రిల్ చివరి వారం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారు. 2,43,630 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని, 187,000 మంది ఇంకా క్వారంటైన్‌లో ఉన్నారని ఉత్తర కొరియా తెలిపింది. అయితే.. కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్, మరణాల కేసులు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వ మీడియా వెల్లడించలేదు. మొదటి కేసు బయటపడిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ గురువారం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఒమిక్రాన్ వేరియంట్లు విజృంభిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
అధ్వానంగా పరిస్థితులు.. కిమ్ జోంగ్
కాగా.. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. శనివారం ఒక సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో అతను వైరస్‌ను చారిత్రాత్మకంగా అతి పెద్ద సమస్యగా అభివర్ణించారు. అంటువ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వం – ప్రజల మధ్య ఐక్యత అవసరమని పేర్కొన్నారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడంలో ఉత్తర కొరియా విఫలమైతే, అది వినాశకరమైన పరిణామాలను ఎదుర్కొంటుందని నిపుణులు అంటున్నారన్నారు. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు చాలా బలహీనంగా ఉన్నాయి.. 26 కోట్ల మంది జనాభా టీకాలు లేకుండా జీవిస్తున్నారు.
కాగా.. ఇటీవల ఏప్రిల్ 25న ఉత్తర కొరియాలో కవాతు నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో పౌరులు, సైనికులు పాల్గొన్నారు. ఈ సమయంలో వైరస్ ప్రజలలో వేగంగా వ్యాపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ సమయంలో కిమ్ జోంగ్ వేదిక మధ్యలో నిలబడి ప్రసంగించడంతోపాటు.. సైనిక అణు కార్యక్రమంలో అత్యంత శక్తివంతమైన క్షిపణులను ప్రదర్శించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: