Fuel tanker: కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్‌ను మరో వాహనం ఢీకొనడంతో ట్యాంకర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, చాలా మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నైరోబికి వాయువ్య దిశలో 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలంగా సమీపంలో కిసుము, ఉగాండా సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి క్రెన్లతో చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కెన్యాలో ఇటువంటి ప్రమాదాలు జరగడం ఇది కొత్తేమి కాదు. 2009లో గ్యాస్ ట్యాంకర్ పేలి సుమారు 120 మంది వరకు మరణించారు. ఇవే కాకుండా మరెన్నో ఘటనలు జరిగాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.