Karachi blast: ప్రత్యేక బెలూచిస్తాన్‌ పోరు.. పాక్‌, చైనాలకు స్ట్రాంగ్‌ కౌంటర్.. అసలేం జరుగుతోందంటే..

పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ నగరం బుధవారం మరోసారి బాంబు దాడులతో ఉలిక్కిపడింది. కరాచీ యూనివర్సిటీలో భారీ పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు

Karachi blast: ప్రత్యేక బెలూచిస్తాన్‌ పోరు.. పాక్‌, చైనాలకు స్ట్రాంగ్‌ కౌంటర్.. అసలేం జరుగుతోందంటే..
Karachi Blast
Follow us

|

Updated on: Apr 28, 2022 | 9:43 AM

పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ నగరం బుధవారం మరోసారి బాంబు దాడులతో ఉలిక్కిపడింది. కరాచీ యూనివర్సిటీలో భారీ పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. యూనివర్సిటీలోని కన్ఫ్యూజియిస్ ఇన్‌స్టిట్యూట్ వద్ద ఒక వాహనంలో బాంబును అమర్చిన ముష్కరులు.. దానిని రిమోట్ కంట్రోల్‌ ద్వారా పేల్చివేసినట్టు తెలుస్తోంది. ఈ పేలుళ్లలో మొత్తం ముగ్గురు చైనీయులు మృతిచెందారు. దీంతో చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ఈ ఆత్మాహుతి దాడిపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసినట్లు ది డాన్ పత్రిక తెలిపింది. కరాచీ యూనివర్సిటీ కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌లో ముగ్గురు చైనీస్ ఉపాధ్యాయులతో కూడిన వ్యాన్ ఇన్‌స్టిట్యూట్‌లోకి ప్రవేశించబోతుండగా బయట ఆత్మాహుతి దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో బురఖా ధరించిన మహిళ ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ ద్వారం వెలుపల నిలబడి ఉండడంతో వ్యాన్ ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోగానే తనను తాను పేల్చుకుంది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డింగ్ ముపెంగ్‌తో సహా ముగ్గురు చైనీస్ ఉపాధ్యాయులు, వాహనం డ్రైవర్ మరణించారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. కాగా ఈ దాడి జరిగిన వెంటనే చైనా సహాయ విదేశాంగ మంత్రి జియాంగ్‌హావో చైనాలోని పాకిస్తాన్ రాయబారికి అత్యవసరంగా ఫోన్ చేశారు. బాంబుదాడి వివరాలపై ఆరా తీశారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిని పట్టుకుని శిక్షించాలని మంత్రి డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌లోని చైనా పౌరుల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని చైనా మంత్రి కోరారు.

మొదటి మహిళా బాంబర్‌..

కాగా ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మహిళా బాంబర్‌ షరీ బలోచ్ గా గుర్తించారు. కాగా ఈ దాడిని ‘బలూచ్ ప్రతిఘటన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం’ అని పాక్‌ దినపత్రికలు పేర్కొన్నాయి. షరీ బలోచ్ ఉన్నత విద్యావంతులైన కుటుంబం నుంచి వచ్చిందని, ఆమె భర్త వైద్యుడిగా పనిచేస్తున్నారని, వారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని ఉటంకిస్తూ కథనాలు ప్రచురించాయి. అంతేకాదు ఆమె రెండు మాస్టర్స్ డిగ్రీలు, జంతుశాస్త్రంలో MSc, విద్యలో ఎంఫిల్ చేసినట్లు తెలిపాయి. కాగా జూలై 2021లో పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని దాసు వద్ద బస్సుపై బాంబు దాడి జరిగిన ఘటనలో 10 మంది చైనా పౌరులు మరణించారు. ఆ ఘటన తర్వాత మళ్లీ ఇప్పుడు చైనీయులపై దాడి జరిగింది. అయితే బస్సుపై బాంబు దాడిని బలూచ్ మిలిటెంట్లు క్లెయిమ్ చేయలేదు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TLP) అని కూడా పిలువబడే పాకిస్తానీ తాలిబాన్ ఈ దాడికి బాధ్యత వహించింది. గత ఏడాది ఉగ్రవాదుల దాడిలో మరణించిన, గాయపడిన 36 మంది చైనా పౌరులకు పరిహారం ఇవ్వాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. ప్రభుత్వం $4.6 మిలియన్ల (పాక్ రూ. 810 మిలియన్లు) నుండి $20.3 మిలియన్ల (పాక్ రూ. 3.6 బిలియన్లు) వరకు నాలుగు వేర్వేరు పరిహారం మొత్తాలను రూపొందించింది. ప్రభుత్వంపై ఎలాంటి చట్టపరమైన లేదా ఒప్పంద బాధ్యత లేనప్పటికీ బాధితులకు పరిహారం చెల్లిస్తామని పాకిస్థాన్ తెలిపింది.

పాక్‌ వర్సెస్‌ బలూచ్‌ వేర్పాటువాదులు..

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, పారామిలిటరీ దళానికి పెద్ద నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ, బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) రెండు శిబిరాలపై BLA దాడి చేసింది. మొత్తం 195 మంది ఈ దాడిలో గాయపడినట్లు బీఎల్‌ఏ పేర్కొంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఈ వాదనలను ఖండించాయి. ఇక జూన్ 28, 2020న కరాచీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంపై గ్రెనేడ్‌లతో పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు BLA తీవ్రవాదులు . ఈ దాడిలో కనీసం ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ మరణించగా, ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే దాడికి పాల్పడిన నలుగురినీ నిమిషాల వ్యవధిలోనే హతమార్చినట్లు పాక్‌ పోలీసులు ప్రకటించారు. బలూచిస్తాన్‌లోని అనేక పట్టణాలు, గ్రామాలలోని శుష్క భూభాగాలలోని ఎత్తైన ప్రాంతాలలో, దాక్కున్న తిరుగుబాటుదారులపై పాకిస్తాన్ సైన్యం పలు సార్లు దాడులకు పాల్పడింది. దీంతో బలూచ్ తిరుగుబాటు మరింత ఊపందుకుంది. ఇందులో భాగంగా రెండు బలూచ్ జాతీయవాద సంస్థలు, బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ (BRA), యునైటెడ్ బలూచ్ ఆర్మీ (UBA) ఈ ఏడాది జనవరిలో రద్దై పోయి బలూచ్ నేషనలిస్ట్ ఆర్మీ (BNA) అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశాయి. ఇక ఈ ఏడాది జనవరిలో బలూచ్ తిరుగుబాటు గ్రూపులు జరిపిన మెరుపుదాడిలో కనీసం 50 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని నివేదించింది. కాగా గతంలో BLA కమాండర్లు తరచుగా మారువేషంలో, నకిలీ గుర్తింపులతో భారతదేశంలోని ఆసుపత్రులలో వైద్య చికిత్సను తీసుకున్నట్లు పాకిస్తాన్ మీడియా సంస్థలు తెలిపాయి. ఖుజ్దార్ నగరానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఒక మిలిటెంట్ కమాండర్ 2017లో ఆరు నెలల పాటు ఢిల్లీలో ఉన్నాడని.. అక్కడ అతను కిడ్నీ సంబంధిత వ్యాధులకు చికిత్స పొందాడని పేర్కొంది.

ప్రత్యేక దేశం కోసం..

కాగా బలూచిస్తాన్‌లోని పంజ్‌గూర్, నోష్కీ జిల్లాల్లోని రెండు ఫ్రాంటియర్ కార్ప్స్ క్యాంపులపై ఫిబ్రవరి 72 గంటల పాటు కొనసాగిన దాడుల్లో, ఆత్మాహుతి బాంబర్లతో కూడిన మజీద్ బ్రిగేడ్‌కు చెందిన బలూచ్ తిరుగుబాటుదారులు తమ నాయకులతో ఫోన్ సంభాషణల క్లిప్‌లను పంపినట్లు తెలిసింది. వారిని చంపడానికి పాకిస్తానీ బలగాలు శిబిరాలను ఎలా చుట్టుముట్టాయో, తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న భవనాలలోకి ప్రవేశించడానికి సాయుధ వాహకాలను ఉపయోగిస్తున్నారని వారు వివరించారు. చివరి వరకు పట్టుదలగా ఉన్న తిరుగుబాటుదారులు పాకిస్తాన్ SSG కమాండోలను ఎలా చంపగలిగారో కూడా అందులో నివేదించారు. కాగా ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సాగిన బలూచ్ తిరుగుబాటు రోజురోజుకు ఉధృతమవుతోంది. కలాత్-బలూచిస్థాన్ రాచరిక రాష్ట్రం మార్చి 27, 1948న పాకిస్తాన్‌లో విలీనమైంది. కాగా సహజ వాయువు, చమురు, బొగ్గు, రాగి, సల్ఫర్, ఫ్లోరైడ్ మరియు బంగారం వంటి సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో బాగా వెనక బడిన ప్రావీన్స్‌. అందుకే ప్రత్యేక దేశం కోసం 1948, 1958-59, 1962-63, 1973-1977 లలో తిరుగుబాట్లు జరిగాయి. ఇక బలూచ్ వేర్పాటువాదులు పాకిస్తాన్‌లోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తాము ఆర్థికంగా అట్టడుగున ఉన్నామని , పేదలమని వాదించారు. ఇక 2013లో, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లి గ్వాదర్ ఓడరేవులో కలుస్తున్నప్పుడు, బలూచ్ జాతీయవాదులు ఈ అభివృద్ధి పనులలో తమకు ఎటువంటి వాటా లేదని గ్రహించారు. ప్రాజెక్ట్ పని కోసం చైనా తన సొంత ఇంజనీర్లను పంపినప్పుడు మరియు స్థానిక బలూచిలు వెళ్లడానికి నిషేధించబడిన రోడ్లను నిర్మించినప్పుడు వారి భయాలు నిజమయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం బలూచ్ సముద్ర కార్మికుల చేపల వేట హక్కులను చైనా లాక్కోవడంతో సమస్య ముదిరి పాకాన పడింది. గత సంవత్సరం, గ్వాదర్ కో హక్ దో తెహ్రీక్ (గ్వాదర్ హక్కుల ఉద్యమం) నాయకుడు మౌలానా హిదయతుర్ రెహ్మాన్ మాట్లాడుతూ ‘ CPEC, బలూచిస్తాన్ వనరులు ప్రావిన్స్ ప్రజలకు చెందినవి. వాటిని దోచుకోవాలంటే చూస్తూ ఊరుకోం’ అని హెచ్చరించారు. ఇక బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు చీఫ్ అయిన డాక్టర్ అల్లా నాజర్ బలోచ్ మాట్లాడుతూ ‘బలూచిస్తాన్ ప్రజలు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)ని వ్యతిరేకిస్తున్నారని, ఎందుకంటే చైనా గ్వాదర్‌లో తన సామ్రాజ్యాన్ని నిర్మించి, పెంచాలని కోరుకుంటోందన్నారు. ‘బలూచిస్తాన్‌లో 100 కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా వీటిని దోచుకుంటోంది. ఇప్పుడు చైనా సహాయంతో బంగారం, రాగి, యురేనియం, రాగి, వెండి, ఇతర వనరులను కొల్లగొడుతోంది. బలూచిస్థాన్‌లోని వేలాది మంది నివాసితులను CPEC మార్గంలో బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలించడం ద్వారా పాకిస్తాన్ సైన్యం జనాభా మార్పులను తీసుకువస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు గ్వాదర్‌లో ఐదు లక్షల మందికి పైగా చైనీయులు స్థిరపడ్డారని, మూడు వేల ఎకరాల భూమిని చట్టబద్ధం చేసి వారికి కేటాయించారు” అని బలోచ్ చెప్పారు.

భారత్ మద్దతే కీలకం..

కాగా బలూచిస్థాన్‌ ప్రత్యేక ఉద్యమానికి భారత్‌ మద్దతు ఇవ్వాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ సార్వభౌమ హక్కులను ఉల్లంఘిస్తూ సీపీఈసీని నిర్మిస్తున్నారు. కలాత్, ఖుజ్దార్ , మస్తుంగ్ ప్రజలు ఎక్కువగా బ్రాహుయి భాషను మాట్లాడతారు. ఇది కన్నడ, మలయాళం, తమిళం వంటి భారతదేశ భాషలకు అనుసంధానంగా ఉంటుంది. ఇక 2015లో ఎర్రకోట నుండి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్‌కు అనుకూలంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలకోపన్యాసం చేశారు. దీనిని బలూచ్‌ వేర్పాటువాదులు స్వాగతించారు. ‘ భారతదేశం ఈ ప్రాంతంలోని శక్తులలో ఒకటి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. భారత్‌దేశం రూపంలో మాకు ఒక స్నేహితుడు ఉన్నారని సంతోషిస్తున్నాం’ అని వారు హర్షం వ్యక్తం చేశారు. ఇక 2019లో, బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ అనుబంధ సంస్థలు పాకిస్తాన్ దురాగతాలను ఎత్తిచూపాలని, బలూచిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమానికి సహాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరాయి. బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ సభ్యులు అలాగే వరల్డ్ సింధీ కాంగ్రెస్, బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆజాద్ వంటి గ్రూపులు బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం వహించినందుకు UK ప్రభుత్వాన్ని మోసకారి ప్రభుత్వంగా అభివర్ణించాయి. ‘గత రెండు దశాబ్దాల్లో 20,000 మందికి పైగా బలూచ్ ప్రజలను పాకిస్తానీ భద్రతా దళాలు అపహరించారు వారిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. భారత ప్రభుత్వానికి మా సందేశం ఏమిటంటే, పాకిస్తాన్ భద్రతా దళాల దురాగతాలకు వ్యతిరేకంగా వారు తమ గళాన్ని వినిపించాలి’ అని బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి హమ్మల్ హైదర్ కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Also Read:

Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత

Viral Video: మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ మీరే బ్రదర్స్.. బైకర్స్ చేసిన పనికి సలాం చేయాల్సిందే.. వైరల్ వీడియో

Viral Video: మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ మీరే బ్రదర్స్.. బైకర్స్ చేసిన పనికి సలాం చేయాల్సిందే.. వైరల్ వీడియో