ఆర్థికమాంద్యం కారణంగా పలు కంపెనీలు లక్షలాది ఉద్యోగులను ఇంటికి పంపాయి. జాబ్ ఉంటుందో.. పోతుందో తెలియక ఓవైపు ఉద్యోగులు దినదిన గండంగా బతుకుతుంటే.. ఓ ఐటీ ఉద్యోగి మాత్రం 15 ఏళ్లుగా సిక్ లీవ్‌లో ఉన్నాడు. అతను పని చేస్తున్న కంపెనీ ఏడాదికి రూ.55 లక్షల జీతం చెల్లిస్తోంది కూడా. అన్నేళ్లుగా లీవ్‌లో ఉన్నప్పటికీ ఉన్న ఉద్యోగం పోకుండా జాగ్రత్త పడటానికి బదులు.. కంపెనీపైనే కేసు పెట్టాడు. తనకు ప్రస్తుతం వస్తున్న జీతం సరిపోవడం లేదనీ.. కంపెనీ జీతం పెంచడం లేదనేది సదరు వ్యక్తి కంప్లైంట్. ఈ విచిత్ర ఘటన యూకేలో చోటుచేసుకుంది.
ప్రముఖ దిగ్గజ కంపెనీకి చెందిన ఇయాన్ క్లిఫర్డ్ అనే ఉద్యోగి 2008 సెప్టెంబర్ నుంచి సిక్ లీవ్ పెట్టి 15 ఏళ్లుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. కంపెనీ రూల్స్ ప్రకారం.. అతనికి ప్రతి నెలా ఠంఛన్‌గా సాలరీ అందుతూనే ఉన్నది. ఇలా 15 ఏళ్లుగా సిక్ లీవ్‌లో ఉన్న ఐబీఎం ఉద్యోగి ఏడాదికి రూ.55 లక్షల చొప్పున జీతం పుచ్చుకుంటున్నాడు. 2013 నుంచి మెడికల్లీ రిటైర్డ్. కానీ, తనకు వస్తున్న జీతం సరిపోవడం లేదని కంపెనీ పెంచట్లేదని కోర్టుకెక్కాడు. కంపెనీ తనపై డిజేబిలిటీ డిస్క్రిమినేషన్ చూపుతోందని.. అందుకే 15 ఏళ్లుగా తనకు జీతం పెంచడం లేదని ఇయాన్ క్లిఫర్డ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో ఐబీఎం ఆయనకు కంప్రమైజ్ అగ్రిమెంట్ ఆఫర్ చేసింది. ఆయన మొత్తం జీతం 73,037 పౌండ్లు ఉండగా, 2013 నుంచి 25 శాతం కోతతో 54,028 పౌండ్లు (75 శాతం) ప్రతీ ఏట కంపెనీ ఇస్తుంది.
దీనిపై కూడా ఆ ఉద్యోగి కంపెనీపై 2022 ఫిబ్రవరిలో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారించిన జడ్జీ.. ఆఫీసుకు వచ్చే ఉద్యోగులకు మాత్రమే జీతం పెరుగుతుందని, పనిలోలేని ఉద్యోగికి జీతం పెంచడం సాధ్యంకాదని తెలిపారు. ఈ ప్లాన్ కేవలం డిజేబిలిటీ వారికి మాత్రమే కాబట్టి ఆ వాదన చెల్లదని, డిజేబిలిటీ క్యాండిడేట్ 65 ఏళ్లు వచ్చే వరకు ఏడాదికి 50 వేల పౌండ్లు పొందుతాడని జడ్జి తెలిపారు. ఇది డిజేబిలిటీ ఉద్యోగిని మంచిగా ట్రీట్ చేసినట్టే అవుతుందని జడ్జి వివరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.