ఇజ్రాయెల్‌పై దాడికి ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు.. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3 పేరిట..
ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలు నువ్వా ? నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆరుగురు టాప్ ఇరాన్ ఆర్మీ కమాండర్లను చంపేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది చనిపోయారని , దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది.

ఇజ్రాయెల్ , ఇరాన్ యుద్దంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపుదాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇరాన్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికి ఉపయోగించుకోలేదని , అమెరికాతో అణు ఒప్పందం చేసుకోకుంటే ఆ దేశాన్ని ఎవరు కాపాడాలేరని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ స్వాగతించారు. అయితే అమెరికా అండ తోనే ఇజ్రాయెల్ రెచ్చిపోతోందని , దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ హెచ్చరించారు. యుద్దాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించిందని , తాము దానికి సరైన రీతిలో ముగింపు పలుకుతామన్నారు. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది చనిపోయినట్టు ఇరాన్ ప్రకటించింది. 329 మందికి గాయాలైనట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఇరాన్‌కు చెందిన ఆరుగురు టాప్ ఆర్మీ కమాండర్లు దాడిలో చనిపోయినట్టు తెలిపింది. అయితే ట్రంప్ తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాతో చర్చలను నిలిపివేస్తునట్టు ప్రకటించింది.
ఇజ్రాయెల్‌పై దాడికి ప్రతీకారంగా ఇరాన్ కూడా డ్రోన్ దాడులను ప్రారంభించింది. ఒకేసారి 800 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్‌కు కౌంటర్‌గా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3ని ఇరాన్ ప్రారంభించింది. అయితే చాలా ఇరాన్ డ్రోన్లను తమ ఐరన్ డ్రోమ్ అడ్డుకుందని IDF ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా బ్రిటన్ , ఫ్రాన్స్ , జోర్డాన్ కూడా రంగం లోకి దిగాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న 8 అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇరాన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. చైనా , రష్యా , ఒమన్ దేశాలు కూడా ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి.
100 టార్గెట్లు.. 200 యుద్ధ విమానాలు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. అణ్వాయుధ కేంద్రాలను టార్గెట్ చేసుకుని 330 బాంబులు, క్షిపణులతో టెహ్రాన్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ జరిపిన మెరుపుదాడిలో ఇరాన్‌కి తీవ్ర నష్టం జరిగింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్న ఇరాన్ శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్. తమ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ బాఘేరి, ఐఆర్‌జీసీ చీఫ్ హస్సేనీ సలామీ, ఐఆర్‌జీసీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ , సహా పలువురు జనరల్స్ మృతి చెందారని ప్రకటించింది ఇజ్రాయెల్. తమ దాడుల్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా చనిపోయారు. ఇరాన్ ప్రయోగించిన చాలా మిస్సైళ్లను కూల్చేశామని IDF ప్రకటించింది.
ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్‌పైకి వందల డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ రియాక్షన్‌ని ముందే ఊహించిన ఇజ్రాయెల్ ఎమర్జన్సీ విధించి.. దాడులను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. మరోవైపు హౌతీ రెబల్స్ కూడా ఇదే సమయంలో ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మెసాద్ సీక్రెట్ ఆపరేషన్‌తో ఇరాన్‌లో చాలా డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామంటూ కొన్నేళ్లుగా ఇరాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో ఆత్మరక్షణ పేరుతో ముందే ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. అమెరికా వద్దని వారించినా వినే పరిస్థితుల్లో లేదు ఇజ్రాయెల్. మరోసారి మేం బాధితులుగా మిగలాలనుకోవట్లేదు. అందుకే ఇరాన్ బెదిరింపులకు మేం ప్రతిచర్య చేపట్టామంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.