ఇరాన్‌కు మద్దతుగా చైనా..! అమెరికా దాడులను ఖండిస్తూ..
అమెరికా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడి చేయడంతో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ ప్రతిదాడి చేసింది. అమెరికా జోక్యంతో ప్రపంచ యుద్ధ భయం నెలకొంది. చైనా ఇరాన్‌కు మద్దతుగా నిలవడంతో వివాదం మరింత తీవ్రమైంది. ఈ సంఘర్షణ ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇజ్రాయెల్, ఇరాన్ వివాదంలో తలదూరుస్తూ.. అమెరికా ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. తమతో అణు ఒప్పందం చేసుకోవాలని చాలా కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు. కానీ, ఇరాన్ ఈ విషయంలో స్వతంత్రంగానే వ్యవహరిస్తామంటూ.. అమెరికా ఆఫర్‌ను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తుందని, భవిష్యత్తులో ఇది తమకు ముప్పుగా మారొచ్చని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ.. ఇరాన్‌పై దాడికి పాల్పడింది.
దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ఊహించని విధంగా ప్రతిదాడితో విరుచుకుపడింది. ఇరాన్ నుంచి ఇంతటి ప్రతిఘటన ఊహించని ఇజ్రాయెల్ బెంబేలెత్తిపోయింది. వెంటనే అమెరికా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ వివాదంలో జోక్యం చేసుకోవాలా వద్దా అని రెండు వారాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ట్రంప్.. ఆ మాట చెప్పిన 48 గంటల్లోనే ఇరాన్‌పై దాడి చేశారు. ఈ దాడిపై తాజాగా చైనా స్పందించింది. ఇరాన్‌పై అమెరికా చేసిన దాడిని తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా యూఎన్ చట్టాలను ఉల్లంఘించడమే అంటూ పేర్కొంది.
ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు ఇరాన్‌కు మద్దతుగా చైనా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరినట్లు అయింది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య కోల్డ్ వార్ నడుస్తునే ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా రెండు శక్తివంతమైన దేశాలు చెరో దేశానికి మద్దతుగా నిలవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం మరింత ముదిరి.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందనే భయం వ్యక్తం అవుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
