Afghanistan Crisis: ఆఫ్గనిస్థాన్‌లో మళ్లీ కాలకేయుల రాజ్యం.. రెండు దశాబ్ధాల యుద్ధంతో అమెరికా సాధించింది ఏంటి?
రెండు దశాబ్దాలు ఆఫ్గనిస్థాన్‌లో తిష్టవేసి అమెరికా సాధించింది ఏమిటి? తన బద్ధశత్రువు బిన్ లాడెన్‌ను చంపడం తప్ప అగ్రరాజ్యానికి చెప్పుకోవడానికి ఏముంది?
రెండు దశాబ్దాలు ఆఫ్గనిస్థాన్‌లో తిష్టవేసి అమెరికా సాధించింది ఏమిటి? తన బద్ధశత్రువు బిన్ లాడెన్‌ను చంపడం తప్ప అగ్రరాజ్యానికి చెప్పుకోవడానికి ఏముంది? ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించి.. తాలిబన్ రాక్షసుల నుంచి ఆఫ్గన్లకు విముక్తి కల్పిస్తామంటూ ఆ దేశంలో అడుగుపెట్టిన అమెరికా.. ఇప్పుడు అర్ధాంతరంగా అక్కడి నుంచి వైదొలకడం కరెక్టేనా? ఆఫ్గన్ సేనలకు తాలిబన్లతో ఓ నెల రోజులు కూడా పోరాడే శక్తి కూడా ఇవ్వలేని అమెరికా శిక్షణ ఎంత? ఆర్ధికంగా, రక్షణ పరంగా అమెరికా ఇన్నాళ్లూ ఆఫ్గాన్‌పై పెట్టిన ఖర్చు ఎంత? ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు చందమేనా?
ఆమెరికా సేనలు ఆఫ్గన్ నుంచి వైదొలగిన కేవలం 10 రోజుల్లో కాబూల్ సహా యావత్ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు తాలిబన్లు. ఇది ఆఫ్గాన్ ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పి తప్పించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నిస్తున్నారు. తమ బలగాలు అండగా నిలిచినా.. తాలిబన్లతో పోరాడేందుకు ఆఫ్గాన్ ప్రభుత్వం ముందుకు రాకపోవడమే నేటి పరిస్థితులపై కారణమంటూ చేయిదులుపుకున్నారు. అయితే తాలిబన్ల శక్తియుక్తులను సరిగ్గా అంచనావేయడంలో బైడెన్ పూర్తిగా విఫలం చెందారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి..ఆఫ్గనిస్థాన్‌లో నేటి పరిస్థితులకు బైడెన్ చేతగానితనమే కారణం..ఆయన పదవికి రాజీనామాచేసి వైట్‌హౌస్ నుంచి బయటకు వెళ్లాలంటూ డిమాండ్ చేశారు.
అటు మిత్ర దేశాలు, ప్రపంచ మీడియా కూడా అమెరికా వైఫల్యం కారణంగానే ఆఫ్గనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల అరాచక రాజ్యం మొదలయ్యిందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆఫ్గనిస్థాన్‌కు తాలిబన్ల నుంచి విముక్తి కల్పించడంలో అమెరికా ఘోర వైఫల్యం చెందినట్లు ఆరోపిస్తున్నారు. తాలిబన్ల విషయంలో అమెరికా విఫలం కావడం ఆఫ్గాన్ పునర్‌నిర్మాణం పేరుతో గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న చైనాకు ప్లస్ కానుంది.
వియత్నాం, చిలీ, ఇరాక్, క్యూబా, లిబియా, లెబనాన్ ఇలా అనేక యుద్దాల్లో బిగ్ బ్రదర్ అమెరికాదే పెద్ద పాత్ర. లక్షలాది ప్రాణాలు పోవడం తప్ప ఆ దేశాలు నేటికీ బాగుపడింది లేదు. 70 ఏళ్లుగా అమెరికా పాల్గొన్న అనేక యుద్దాల పర్యవసానం పరికించి చూస్తే..అమెరికా కార్పొరేట్, ఆయుధ తయారీ కంపెనీలు బాగుపడిందే ఎక్కువ.
ఆఫ్గాన్‌పై అమెరికా పెట్టిన ఖర్చు అంచనా… 2001-2020 మధ్య ఆఫ్గాన్ యుద్దంలో అమెరికా పెట్టిన ఖర్చు అంచనా… 2 లక్షల కోట్ల డాలర్లు (మన కరెన్సీలో రూ.148 లక్షల కోట్లు). ఇందులో ఆఫ్గాన్ సైన్యానికి శిక్షణ, ఆయుధాల కోసం పెట్టిన ఖర్చు… 89 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో 6.5 లక్షల కోట్లు). ఇదంతా అమెరికా ప్రజల నెత్తిన పడిన అప్పుగానే భావిస్తున్నారు. 2050 నాటికి వడ్డీతో కలిపి ఈ అప్పు 6.5 లక్షల కోట్ల డాలర్లకు పెరిగే అవకాశముంది. ఈ లెక్కన ఆఫ్గన్‌లో తాలిబన్లపై యుద్ధం పేరిట ప్రతి అమెరికా పౌరుడిపై 20వేల డాలర్ల భారం పడుతున్నట్లే.
రెండు దశాబ్దాల పోరులో ప్రాణ నష్టం…
ఆఫ్గానిస్థాన్ గడ్డపై అమెరికా సేనలు రెండు దశాబ్ధాలకు పైగా సాగించిన యుద్ధంలో అగ్రరాజ్యానికి భారీగానే ప్రాణనష్టం సంభవించింది. చనిపోయిని అమెరికా సైనికులు… 2,448 అమెరికాకు చెందిని ఇతర సిబ్బంది… 3,846 ఇతర నాటో దేశాల సైనికులు… 1,144 ఆఫ్గాన్ పోలీసులు, సైనికులు… 66,000 ఆఫ్గాన్ పౌరులు… 47,245 జర్నలిస్టులు… 72 తాలిబన్లు, ఇతర ఉగ్రవాదులు… 51,191
మహిళలకు స్వేచ్ఛా వాయువులు…
అమెరికా, నాటో దళాలు ప్రవేశించాక తాలిబాన్ల ఉక్కుపిడికిలిలో ఉక్కిరిబిక్కిరవుతున్న మహిళలు ఇప్పుడిప్పుడే స్వేఛ్ఛా వాయువులు పీల్చుకోవడం మొదలుపెట్టారు. విద్యా, వైద్య, సామాజిక రంగాలలో ముందడుగు వేశారు. బాలికలు ఉత్సాహంగా పాఠశాలలకు వెళ్లారు. ప్రాధమిక విద్యలో 50 శాతం పైగా బాలికల సంఖ్య పెరిగింది. రాజకీయాల్లో కూడా ప్రవేశించి పార్లమెంటులో 25 శాతం స్థానాలకు ప్రాతినిథ్యం సాధించారు. మహిళలకు ఆరోగ్య సేవలు, ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. గత 20 ఏళ్లలో మహిళల జీవన స్థితిగతులతో పాటు ఆఫ్గాన్‌లో విద్యా, వైద్య ప్రమాణాలు బాగానే పెరిగాయి. భారత్ సహా అనేక దేశాల భాగస్వామ్యంతో మౌలిక వసతులు మెరుగయ్యాయి. అయితే తాలిబన్ల పున: ప్రవేశంతో ఆ దేశ మహిళల ఆశల శౌధాలు కుప్పకూలాయి. మహిళా జర్నలిస్టులు కూడా బురఖా ధరించడం చూస్తేనే తెలుస్తోంది అక్కడి పరిస్థితి ఎంత భయానకమో.
మార్పు అత్యాసే… తాజా మాట… మహిళల విద్యకు తాము వ్యతిరేకం కాదని, మహిళలు వారి హక్కులు అనుభవించవచ్చని తాలిబన్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ వారి మాటలకు, చేతలకు పొంతన ఉండదని అందరికీ తెలిసిందే. నెల క్రితం బందక్షాన్, తఖార్ ప్రావిన్సులను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలు వారి ఆలోచన తీరులో మార్పు రాలేదని తేటతెల్లం చేస్తోంది. 15ఏళ్లు దాటిన బాలికలు, 45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను తమకివ్వాలని తాలిబన్లు ఆదేశాలిచ్చారు. తాలిబన్ ఫైటర్లను పెళ్లి చేసుకోవడానికి వీరు అవసరమని ప్రకటనలు చేశారు.
తాలిబన్ల అరాచక రాజ్యంలో పెళ్లి అంటే భార్య హోదా కాదు, లైంగిక బానిసత్వం… ఇదే నిజం. మహిళలు, బాలికల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మానవ హక్కుల అణిచివేత వార్తల పట్ల యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆఫ్గాన్ మొత్తం జనాభా 3.9 కోట్లు కాగా.. మహిళా జనాభా 1.8 కోట్లు. ఇందులో 15-45 ఏళ్ల వయస్సు మహిళలు దాదాపు 80 లక్షలు. తాలిబాన్ల దాష్టీకాలకు గురయ్యే మొదటి వర్గం వీరే. వీరి భవిష్యత్తుపైనే ప్రస్తుత ఆందోళనలు వ్యక్తమవుతోంది. స్వేచ్ఛ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న ఆఫ్గనిస్థాన్‌లో మహిళలు ఆశలను అమెరికా కుదేలుచేసింది. ఆఫ్గన్ నుంచి తమ సేనలను ఉపసంహరించుకోవడం ద్వారా వారిని మళ్లీ మునుపటి చీకట్లోకే నెట్టేసింది.
ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్లపై అమెరికా సాగించిన రెండు దశాబ్ధాల యుద్ధం తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు అక్కడ మిగిలింది నాటి కాలకేయుల రాక్షస రాజ్యమే.. కుప్పకూలిన మహిళల స్వేచ్ఛావాయుల ఆశల సౌధాలే..
(Research Desk, TV9 Telugu)
Also Read..
పాముతో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఆశ్చర్యపోయిన డాక్టర్లు.. అసలేమైందంటే.?
మనవరాలితో ప్రకృతిని, లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న మాజీ మంత్రి.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..