IMF about Corona: కరోనా చాలా ఖరీదైనది.. దీని అంతానికి 364 లక్షల కోట్లు అవసరం అంటున్న ఐఎంఎఫ్
IMF about Corona: కరోనా వైరస్‌ను అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి 50 బిలియన్ల డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 364 లక్షల కోట్లు) ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) అంటోంది.
IMF about Corona: కరోనా వైరస్‌ను అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి 50 బిలియన్ల డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 364 లక్షల కోట్లు) ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) అంటోంది. దాని లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి 2021 చివరినాటికి, 60 శాతం మందికి 2022 మధ్యనాటికి వ్యాక్సినేషన్ అందాలి. అలా చేస్తే 2022 సంవత్సరం మధ్య నాటికి వైరస్ నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుందని ఐఎంఎఫ్ చెబుతోంది. ఇప్పటి వరకు కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల ప్రాణాలు బలి తీసుకుంది. 2022 నాటికి ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఐఎంఎఫ్ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి వేగవంతంగా వ్యాక్సినేషన్ చేపట్టడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఐఎంఎఫ్ నివేదిక తేల్చి చెబుతోంది. యూరోపియన్ కమీషన్, జీ 20 దేశాలు నిర్వహించిన ఆరోగ్య శిఖరాగ్ర సమావేశంలో ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా ఒక నివేదిక సమర్పించరు. ఆ నివేదికలో పలు ఆసక్తికర అంశాలను పొందుపరిచారు.
డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచ బ్యాంక్, గవి, ఆఫ్రికన్ యూనియన్ సహా ఇతర సంస్థల లక్ష్యాలు నెరవేరాలంటే, మూడు ఆచరణాత్మక చర్యలు చేపట్టేలా ఓ ప్రణాళికను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రతిపాదించింది. అందులో మొదటగా… 2021 చివరినాటికి 40 శాతం మందికి, 2022 అర్ధభాగం నాటికి 60 శాతం మందికి టీకా వేయాలని చెప్పారు. ఇందుకోసం 50 బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఐఎంఎఫ్ లెక్కకట్టింది. ఇందుకోసం కొవాక్స్ కార్యక్రమానికి నిధులను సమకూర్చాలని..దేశాల మధ్య ముడిపదార్థాలు, వ్యాక్సిన్ల రవాణా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ఈ నివేదికలో పేర్కొన్నారు. రెండవ చర్యగా… వైరస్ కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా అదనంగా వంద కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేయలని సూచించారు. ఇక మూడో చర్యగా… వ్యాక్సిన్ సరఫరా కొరత ఉన్న ప్రాంతాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, చికిత్సలు విస్తృతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మూడు చర్యల కోసం 50 బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఐఎంఎఫ్ నివేదిక అంచనా వేసింది.
మహమ్మారికి వేగంగా ముగింపు పలకడానికి విరాళాలు, నిధులు, వ్యాక్సిన్ ఉత్పత్తి, ఆరోగ్య సదుపాయాలు పెంచాలని అదేవిధంగా, అందుకు ధనిక దేశాలు చొరవ తీసుకోవాలని క్రిస్టాలినా జార్జివా సూచించారు. అధునాతన ఆర్థిక వ్యవస్థలు ఈ ప్రయత్నానికి ఎక్కువ సహకారం అందించాలని ఆమె కోరారు. ఇలా చేయడం వల్ల జీడీపీలో 40%, అదనపు పన్ను ఆదాయంలో సుమారు 1 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని అంచనా వేసినట్టు నివేదికలో వెల్లడించారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్, స్టాఫ్ ఎకనామిస్ట్ రుచిర్ అగర్వాల్‌తో కలిసి జార్జివా వివిధ ప్రతిపాదనలతో నివేదిక రూపొందించారు. యాక్సెస్ టు కోవిడ్ -19 టూల్స్ (ఎసిటి) యాక్సిలరేటర్, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర సంస్థల ద్వారా ఈ ప్రయత్నాన్ని వేగవంతం చేయాలని వారు ప్రతిపాదించారు.
అయితే ఈ ప్రణాళికను అమలు చేయడానికి 50 బిలియన్ డాలర్లు ( 3.64 లక్షల కోట్లు) ఖర్చు అవుతుంది. ఇందులో 35 బిలియన్ డార్లు, ధనిక దేశాలు, ప్రైవేట్, దాతలు సమకూరిస్తే…మిగిలిన 15 బిలియన్ డాలర్లు జాతీయ ప్రభుత్వాలు తమ బడ్జెట్ నుంచి చెల్లించాలని ఐఎంఎఫ్ సూచించింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి 22 బిలియన్ డాలర్ల నిధుల అవసరమని జీ20 దేశాలు ఇప్పటికే గుర్తించాయి. 13 బిలియన్ డాలర్ల అదనపు గ్రాంట్లు అవసరమని కూడా ఐఎంఎఫ్ తెలిపింది. ఇందులో… విస్తృతమైన పరీక్షలు, తగినంత చికిత్సా విధానాలు, వ్యాక్సినేషన్‌కు సన్నాహాలు, తదితర కార్యక్రమాలు అమలు చేయడానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ఐఎంఎఫ్ పిలుపునిచ్చింది. అత్యవసర చర్యలు చేపట్టకుండా కరోనా మహమ్మారిని అరికట్టడం అసాధ్యమని, సరైన చర్యలు చేపట్టకపోతే అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావడానికి 2022 చివరి వరకు లేదంటే.. మరింత కాలం వేచి చూడక తప్పదని వెల్లడించారు.
వ్యాక్సిన్ తయారీకి అవసరమైన నిధులు, పూర్తిస్థాయి వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి 8 బిలియన్ డాలర్లు అవసరమని.. ప్రపంచ దేశాలన్నీ ఆ మొత్తాన్ని సమన్వయంతో సమకూర్చుకోవాలని నివేదిక సూచించింది. 2021 చివరి నాటికి అన్ని దేశాలలో కలిపి కనీసం 40శాతం, 2022 సగం నాటికి 60శాతం మందికి టీకాలు వేయడం ద్వారా కరోనా బారి నుంచి చాలావరకు ప్రజలను కాపాడుకోవచ్చని ఐఎంఎఫ్చెప్పింది. ఇలా చేస్తే 2025 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుంటుందని, దాదాపు 9 ట్రిలియన్ డాలర్ల సమానమైన పెట్టుబడులు సృష్టించబడుతాయని నివేదించింది. ఈ విధానం ద్వారా ధనిక దేశాలకు ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని ఐఎంఎఫ్ అధికారులు అంటున్నారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న దేశాలకు, లేని పేద దేశాలకు మధ్య అంతరం పెరిగే కొద్దీ ఆర్ధిక అసమానతలు కూడా పెరిగిపోతాయని ఐఎంఎఫ్ హెచ్చరించింది.
భారతదేశంలో పరిస్థితిపై.. ఈ ఏడాది ముగిసేసరికి భారత్ లో 35 శాతం వ్యాక్సినేషన్ చేయడం కూడా కష్టమేనని ఐఎంఎఫ్ తేల్చి చెప్పింది. కరోనా బారి నుంచి బయటపడాలంటే భారత్ వెంటనే భారీగా టీకా ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వాలని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ సూచించారు. దీంతోపాటు దేశీయంగా వ్యాక్సిన్ ల తయారీని వేగవంతం చేసేందుకు అవసరమైన ముడిసరుకులను త్వరగా సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. కరోనా రెండో దశ వ్యాప్తితో భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సంక్షోభం.. అల్ప, మధ్య ఆదాయ దేశాలకు ఓ హెచ్చరిక వంటిదని ఐఎంఎఫ్పేర్కొంది. కరోనా మొదటి దశ వ్యాప్తిని భారత్ ఆరోగ్యవ్యవస్థ సమర్థంగా ఎదుర్కొందని.. కానీ, రెండో దశ వ్యాప్తిలో పరిస్థితులు తారుమారయ్యాయని ఐఎంఎఫ్ నివేదిక చెప్పింది. ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకలు, చికిత్స అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. అందరికీ వ్యాక్సిన్లు అందేలా.. భారత్ అదనంగా వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించింది.