ఆకలి..ఆకలే ! మనుషులైనా..జంతువులైనా .. ఒకటే మరి ! థాయిలాండ్ లో ఆకలితో ఉన్న ఓ ఏనుగు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఒకరి ఇంటి కిచెన్ లోకి ఎంటరైంది. గోడను తన తొండంతో ఎలా నాశనం చేసిందో గానీ.. ఎంచక్కా తన తల అందులో దూరేలా రంధ్రం చేసేసింది. అందులోనుంచి తలను జొప్పించి కింద ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉన్న బియ్యాన్ని లాగించేసింది. నిన్న తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎదో అలికిడి అవుతున్నట్టు గమనించిన ఆ ఇంటి దంపతులు నిద్ర లేచి చూసేసరికి ఈ ‘ఏనుగమ్మ’ నిర్వాకం కనిపించింది. ఫుడ్ ని లాగించేస్తున్న గజరాజును చూసి షాక్ తిన్న వారు.. ఎలాగోలా అతి కష్టం మీద దాన్ని బయటకు వెళ్లగొట్టగలిగారు. అదృష్ట వశాత్తూ అది వారిపై దాడి చేయకుండా దగ్గరలోని చెట్లు, గుట్టల వద్దకు వెళ్ళిపోయింది.ఎక్కడి నుంచి వచ్చిందో గానీ సుమారు 2 నెలలుగా అది ఇక్కడ తరచూ ‘న్యూసెన్స్’ సృష్టిస్తుంటుందని స్థానికులు చెబుతున్నారు. నిజానికి ఇది దేన్నీ నాశనం చేయదని,, కానీ ఇప్పుడు ఇలా చేసిందేమిటని దీని ‘బాధిత దంపతులు’ వాపోతున్నారు.
తమ ఇంటి కిచెన్ గోడ దాదాపు పూర్తిగా పడిపోయిందని, ఇప్పుడు మళ్ళీ గోడ కట్టాలంటే ఎక్కువే ఖర్చవుతుందని వాళ్ళు బావురుమంటున్నారు. కష్టపడి గోడ కట్టిస్తే మళ్ళీ రాదన్న నమ్మకమేమిటని కూడా పాపం వీళ్ళు ఒకటే ఇదైపోతున్నారు. వీరిని ఎవరూ ఓదార్చలేకపోతున్నారు కూడా..
మరిన్ని ఇక్కడ చూడండి: రేపు ప్రతిపక్షాల భేటీ……ప్రధాన పార్టీలకు శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఆహ్వానాలు ..అప్పుడే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు ?
Most Expensive Fish: జాలరి అదృష్టం పండింది.. “కచ్చేళ్ళ చేప” చిక్కింది.. భారీ ధర పలికింది..