తన వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్స్ తీసుకురావడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే 2020లో కేవలం ఆరు నెలల వ్యవధిలో సుమారు పదికి పైనే కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. అలానే కొత్త సంవత్సరంలో కూడా యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో కొన్ని యూజర్స్‌కి ఆందోళన కలింగించేవైతే మరికొన్ని వాట్సాప్ వినియోగాన్ని మరింత సులభతరం చేసేవి. ఆ ఫీచర్లేంటో..అవి ఎలా పనిచేస్తాయో..వాటి వల్ల వాట్సాప్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయో తెలుసుకుందాం..
వాట్సాప్‌లో మొబైల్ వెర్షన్‌కి మాత్రమే పరిమితమైన ఆడియో/వీడియో కాలింగ్ ఫీచర్‌ని త్వరలోనే డెస్క్‌టాప్ వెర్షన్‌కి తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. గతేడాదే వాట్సాప్ దీని గురించి ప్రకటన చేసినప్పటికీ ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నారనేది మాత్రం వెల్లడించలేదు. అయితే ఇప్పటికే ఈ ఫీచర్‌ను అమెరికాలో కొంత మంది యూజర్స్‌కి అందుబాటులోకి రావడంతో త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. డెస్క్‌టాప్ వెర్షన్‌లో వీడియో కాల్ వచ్చినప్పుడు ప్రత్యేక విండోలో కాల్ యాక్సెప్ట్/రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. అలానే ఇతరులకు మనం కాల్ చేసినప్పుడు కాల్ స్టేటస్ చూపిస్తూ పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. 2021 పిబ్రవరి 8 తేదీ నుంచి వాట్సాప్ కొత్త పాలసీని తీసుకురానుంది. ఇందులో భాగంగా కొత్త టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించని యూజర్స్ వాట్సాప్ ఖాతా పనిచేయదు.
ఇప్పటి వరకు వాట్సాప్ ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. వెబ్ వెర్షన్ మినహాయిస్తే రెండు ఫోన్లలో ఒకేసారి ఉపయోగించుకునే అవకాశం లేదు. దీంతో రెండు డివైజ్‌లో వాట్సాప్ ఉపయోగించాలనుకునేవారు ప్రతిసారీ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో వాట్సాప్ ఈ సమస్యకు చెక్ పెడుతూ మల్టీ డివైజ్ సపోర్ట్ తీసుకురానుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫీచర్ యూజర్స్ అందుబాటులోకి రానుందట. ఈ ఫీచర్‌తో ఒకేసారి రెండు వేర్వేరు ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వాట్సాప్ కొత్త ఏడాదిలో తీసుకొస్తున్న మరో కొత్త ఫీచర్ గ్రూప్ కాలింగ్ రింగ్‌టోన్ కస్టమైజేషన్. దీని సహాయంతో గ్రూప్ కాల్‌కు ప్రత్యేకమైన రింగ్‌టోన్ పెట్టుకునే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఛాట్ చేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ ఫొటోలు/వీడియోలు పేస్ట్ చేసే అవకాశం లేదు. అయితే కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌లో ఛాట్ బార్‌లో ఒకే సారి ఎక్కువ ఫొటోలు/వీడియోలు పేస్ట్ చేసుకోవచ్చు. అంటేమీ ఫోన్‌లో ఫొటో గ్యాలరీలో ఫొటోలు సెలెక్ట్ చేసి వాటిని కాపీ చేసి తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ఛాట్ బార్‌లో పేస్ట్ చెయ్యొచ్చు. ఇవే కాకుండా వాట్సాప్ మరికొన్ని ఆసక్తికర ఫీచర్స్‌ని ఈ ఏడాదిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో ఎవరైనా ఇతరుల వాట్సాప్ ఖాతాలపై ఆరోపణలు చేస్తే వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. కానీ, ఆరోపణలు చేసిన వారు సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అలానే ఇతరులకు పంపే వీడియోలతోపాటు, స్టేటస్‌లో పోస్ట్ చేసే వీడియోలను మ్యూట్ చేసుకునే ఫీచర్‌ని కూడా తీసుకొస్తున్నారని తెలుస్తోంది.