ఒక్కోసారి మనం అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం. తెలియక చేసినా అవే మనకు పెద్ద చిక్కులు తెచ్చిపెడతాయి… పాఠాలు నేర్పిస్తాయి. అలా ఓ వ్యాపారి పొరపాటున కొన్ని లక్షల రూపాయలను చెత్త కుప్పలో పడేసాడు. ఆ తర్వాత లబో దిబోమంటూ చెత్త తీసుకెళ్లే బండ్ల వెనక పడ్డాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
గ్రీస్ దీవి లెమన్స్‌లో ఉండే ఓ వ్యాపారవేత్త బ్యాంకులో కొంత డబ్బు జమయాలనుకున్నాడు. అందుకోసం 16 లక్షల రూపాయలను ఓ కవరులో పెట్టి, దానిని ఓ పెద్ద సంచిలో ఉంచాడు. అయితే అదే సంచిలో మరో కవరు ఉంది. దానిలో పనికి రాని కొన్ని పేపర్లు ఉన్నాయి. డబ్బు సంచి తీసుకొని ఆఫీసుకు బయలుదేరిన అతనికి దారిలో పెద్ద చెత్త డబ్బా కనిపించింది. అంతే… తన పెద్ద సంచిలోని చిన్న కవర్ బయటకు తీసి… చెత్త కుప్పలో పడేసి ఆఫీసుకు వెళ్లిపోయాడు. తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగిని పిలిచి సంచిలో ఉన్న మరో కవరు తీసి ఇచ్చి, ఇందులో ఉన్న 16 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పాడు. అతను కవరు తెరిచి చూస్తే అందులో చెత్త పేపర్లు కనిపించాయి. అది చూసి యజమాని షాక్ తిన్నాడు. తను చెత్తకుప్పలో డబ్బులున్న కవరు పడేసానని తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులతో కలిసి అతను చెత్త పడేసిన ప్రాంతంలో వెతికారు. కానీ అక్కడ చెత్త మొత్తం మున్సిపాలిటీ ట్రక్ ఎత్తేయడంతో.. ఆ ట్రక్కులు వెళ్లే చోటికి బయలు దేరారు. దారిలో ఆ చెత్త ట్రక్కు కనిపించడంతో పోలీసులు వాటిపై ఉన్న డస్ట్‌బిన్స్‌ను వెతికించారు. అదృష్టం కొద్దీ వ్యాపారి పడేసిన డబ్బు సంచీ అలాగే ఉంది. డబ్బు దొరకడంతో వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు. పరధ్యానంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ ఘటన చాటిచెప్పింది.
Also Read: Viral video: ముంగిస, నాగుపాము మధ్య భీకర యుద్ధం.. చూస్తే గుండెలు హడల్