ఐక్యరాజ్యసమితి వేదికపై తెలంగాణ స్వరం గట్టిగా వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం ‘దళిత బంధు’ ప్రస్తావన తీసుకొచ్చారు ఓ యువకుడు. ప్రపంచస్థాయి వేదికపై భారతదేశం మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్న వివిధ దేశాల దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతి కోసం చేపట్టిన అనేక పథకాల ప్రస్తావన తీసుకొచ్చి సమావేశంలో ఔరా అనిపించారు.
ఫిబ్రవరి 28 నుంచి 4 ఏప్రిల్ వరకు జెనీవా నగరంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన 52వ మానవ హక్కుల మండలి సమావేశానికి తెలంగాణ నుండి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన మెట్టు సాయి సంపత్‌కు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి హాజరైన సాయి సంపత్ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతి కోసం చేపట్టిన అనేక పథకాల గురించి సవివరంగా అంతర్జాతీయ వేదికపై ప్రసంగించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో దళిత కుటుంబానికి రూపాయలు 10 లక్షల నగదు పథకం తో పాటు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో దళిత విద్యార్థికి కోటి రూపాయల స్కాలర్ షిప్ పథకం గురించి వివరించారు.
వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల హాజరైన జెనీవా సమావేశంలో ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు సాయి సంపత్ పేర్కొన్నారు. జెనీవా వెళ్లి వచ్చిన అనంతరం సాయి సంపత్ తాండూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించడం జరిగింది. అంతర్జాతీయ వేదికపై తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పాలు పంచుకోవడం పట్ల తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సాయి సంపత్‌ను అభినందించారు. అదేవిధంగా భారతదేశం పట్ల వివిధ దేశాల ప్రతినిధులు కొనసాగిస్తున్న దుష్ప్రచారనన్ని తిప్పి కొట్టిన సాయి సంపత్ ను దళిత మేధావులు, వివిధ దళిత సంఘాలు అభినందించాయి.