అమెరికాలోని జార్జియాలోని లిథోనియా నగరంలో నిరాశ్రయుడు, మాదకద్రవ్యాల బానిసైన ఓ వ్యక్తి 25 ఏళ్ల భారతీయ విద్యార్ధినిపై దాడి చేశాడు. తలపై సుత్తితో దారుణంగా కొట్టాడు. దీంతో ఇండియన్ స్టూడెంట్ అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణ ఘటనను అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఈ హృదయ విదారక సంఘటన కెమెరాలో రికార్డ్ అయ్యింది కూడా.. ఈ వీడియో ద్వారా దాడి చేసిన వ్యక్తి జూలియన్ ఫాల్క్‌నర్ గా.. మృతుడు భారతీయ MBA విద్యార్థి వివేక్ సైనీగా గుర్తించారు. జులియన్ సైనీ తలపై సుత్తితో దాదాపు 50 సార్లు దారుణంగా కొట్టినట్లు కనిపించింది.
భారతీయ విద్యార్థి వివేక్ సైనీ మృతిని భారత రాయబార సంస్థ ఖండిస్తూ.. ఇది అత్యంత భయంకరమైన, క్రూరమైన, హేయమైన సంఘటనగా అభివర్ణించింది. ఈ దారుణ ఘటన పట్ల తాము చాలా బాధపడ్డామని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని భారత రాయబార కార్యాలయం సోమవారం ట్విట్టర్‌లో చేసిన ఒక పోస్ట్‌లో పేర్కొంది. అమెరికా అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఘటన జరిగిన వెంటనే రాయబార కార్యాలయం సైనీ కుటుంబ సభ్యులను సంప్రదించిందని, మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. మీడియా కథనాల ప్రకారం ఫాల్క్‌నర్ తలదాచుకున్న షాప్ లో సైనీ పార్ట్ టైమ్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు.
నివేదిక ప్రకారం సైనీ.. ఫాల్క్‌నర్‌కు ఆకలి తీర్చుకోవడానికి చిప్స్, కోక్, నీరు వంటివి అందించడమే కాదు.. జాకెట్‌ను ఇచ్చి అతనిని చలి నుండి రక్షించుకోవడానికి సహాయం చేసాడు కూడా.. అయితే భద్రతా కారణాల దృష్ట్యా సైనీ .. ఫాల్క్‌నర్‌ను తాను పనిచేస్తున్న స్థలాన్ని విడిచిపెట్టి.. వేరే ప్రాంతానికి వెళ్ళమని అభ్యర్థించాడు. అయితే ఫాల్క్ నర్ నిరాకరించడంతో షాప్ దగ్గర నుంచి వెళ్లకపోతే పోలీసుల సహాయం తీసుకుంటానని సైనీ చెప్పాడు. దీంతో కక్ష పెంచుకున్న ఫాల్క్‌నర్ సైనీపై దాడి చేయడానికి ప్లాన్ చేశాడు. జనవరి 16న సైనీ షాప్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఫాల్క్‌నర్ అతడిపై దాడి చేశాడు. ఘటనా స్థలంలో సైనీ మృతదేహం పక్కన ఫాల్క్‌నర్ నిలబడి ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
25-year-old Vivek Saini was attacked with a hammer by a homeless man at the Chevron Food Mart at Snapfinger and Cleveland Road in Lithonia late Monday night. #Homeless #usa #indian #internationalstudents pic.twitter.com/Cy2gL1tytH
— Gurpreet Kohja (@KhuttanGuru) January 22, 2024
చండీగఢ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రెండేళ్ల క్రితం ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళాడు. అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీనీ ఇటీవలే తీసుకున్నాడు. ఈ దారుణ ఘటనతో హర్యానాలోని పంచకులలోని భగవాన్‌పూర్ గ్రామంలో నివసిస్తున్న సైనీ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సైనీ తల్లిదండ్రులైన గుర్జిత్ సింగ్, లలితా సైనీలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన గురించి ఎవరితోనూ మాట్లాడే స్థితిలో వారు లేరు. MBA గ్రాడ్యుయేట్ అయిన తర్వాత సైనీ తన కుటుంబాన్ని కలవడానికి సెలవుల్లో గడపడానికి ఇండియా రావడానికి ప్లాన్ చేసుకున్నాడు. పది రోజుల తరువాత భారతదేశానికి సైనీ రావాల్సి ఉంది. అయితే వివేక్ సైనీకి బదులుగా అతని మృతదేహం భారతదేశానికి తిరిగి వచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..