సుమారు ఓ 50 ఏళ్లకు దగ్గరలో వయసున్న వ్యక్తి.. పైగా వికలాంగుడు.. రెండేళ్లుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో చిక్కుకుపోయాడు. దిక్కూ మొక్కు లేక దేశం కాని దేశంలో ఇరుక్కుపోయి ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. దయనీయమైన అతని కన్నీటి గాథకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ నగరానికి చెందిన సయ్యద్ హాజీ స్వతహాగా వికలాంగుడు. ఉమ్రా, హజ్ తీర్థయాత్ర చేయడానికి తీసుకెళ్తామంటే, గుడ్డిగా నమ్మేశాడు. కానీ అతనికి అలా చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ల ద్వారా మోసపోయాడు. ఉమ్రా అంటే ఓ ఏడాది కాలంలో ముస్లింలు ఎప్పుడైనా మక్కా తీర్థయాత్ర చేస్తే దానిని ఉమ్రా అంటారు. అయితే.. అతనిని ఉచితంగా ఉమ్రా తీర్థయాత్ర చేయడానికి తీసుకెళ్తానని, తిరిగి మళ్లీ తీసుకువస్తామని ఏజెంట్లు వాగ్దానం చేసినట్లు వికలాంగుడైన సయ్యద్ హాజీ తెలిపారు. ఉమ్రా పూర్తయిన తర్వాత అతడిని సౌదీ అరేబియాలోని రియాద్‌కు తీసుకెళ్లి పని చేయమన్నారని చెబుతున్నాడు.
ఈ క్రమంలో ఒక హోటల్‌లో పని కోసం ఉన్నప్పటికీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా చేయలేనని నిర్ణయించుకుని తిరిగి భారత్‌కు రావాలని భావించాడు. కానీ, ఉమ్రాకు తీసుకెళ్తామని మాట ఇచ్చిన ఆ ఏజెంట్లు అతన్ని సౌదీ అరేబియాలోని రియాద్‌లోనే విడిచిపెట్టారు. గత రెండేళ్లుగా చేసేదీలేక సయ్యద్ హాజీ ఫుట్‌పాత్‌లపైనే జీవనం సాగిస్తున్నాడు. ఆ దారిలో వచ్చిపోయే వారు ఇచ్చే ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నాడు. తన పరిస్థితి ఇక్కడ అయోమయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
దీంతో సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఎలాగైనా తమ గోడు తెలుపుకోవాలని, సయ్యద్ హాజీని తిరిగి తెచ్చుకోవాలని అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. సయ్యద్ హాజీ నంబర్ 0505260733 లేదా ఇండియా వాట్సప్ నంబర్ 8341544010కి కాల్ చేసి వీలైనంత త్వరగా తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..