AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టూడెంట్ వీసా రద్దు.. అగ్రరాజ్యం నుంచి వెనక్కి.. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి..?

అక్రమ వలసదారులను వెతికి మరీ వెనక్కి పంపిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. తాజాగా ఓ విద్యార్థిని వీసాను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. భారతీయ విద్యార్థి రజనీ శ్రీనివాసన్‌ వీసాను అమెరికా రద్దు చేసింది. కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈ భారతీయ విద్యార్థి హమాస్‌కు మద్దతు ఇస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

స్టూడెంట్ వీసా రద్దు.. అగ్రరాజ్యం నుంచి వెనక్కి.. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి..?
Ranjani Srinivasan
Mahatma Kodiyar
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 15, 2025 | 1:10 PM

Share

అక్రమ వలసదారులను వెతికి మరీ వెనక్కి పంపిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. తాజాగా ఓ విద్యార్థిని వీసాను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అమెరికా వెనక్కి పంపుతున్న వారిలో ఎలాంటి పత్రాలు లేకుండా అడ్డదారుల్లో సరిహద్దులు దాటి అమెరికా చేరుకుని నివసిస్తున్నవారే ఉన్నారు. కొందరు మాత్రం స్టూడెంట్ వీసాపై వెళ్లి.. చదువు పూర్తయిన తర్వాత వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే తిష్టవేసినవారు కొందరున్నారు. మొత్తంగా అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో అత్యధికంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. దక్షిణాది నుంచి వెళ్లేవారు చదువుకోసం స్టూడెంట్ వీసా (F1)పై, ఉద్యోగం కోసం H1B వీసాపై వెళ్తుంటారు. డాక్యుమెంట్లు పక్కాగా ఉంటాయి. వీసా గడువు ముగిసేలోపే కొనసాగింపు తెచ్చుకోవడం.. కుదరకపోతే వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అర్థాంతరంగా ఓ విద్యార్థిని వీసాను రద్దు చేయడమే కొత్త చర్చకు తెరలేపింది.

ఇంతకీ ఎవరు ఆ విద్యార్థిని?

అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో Columbia’s Graduate School of Architecture, Planning and Preservationలో “అర్బన్ ప్లానింగ్” అంశంపై పరిశోధన విద్యార్థి (PhD)గా ఉన్న రజనీ శ్రీనివాసన్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె అహ్మదాబాద్‌లోని “సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (CEPT)”లో డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో క్రిటికల్ కన్జర్వేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించారు. అది కూడా ఫుల్‌బ్రైట్ నెహ్రూ, ఇన్‌లాక్స్ స్కాలర్‌షిప్‌లకు అర్హత సాధించి మరీ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

మాస్టర్స్ తర్వాత లక్ష్మీ మిట్టల్ సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్ సహాయంతో వలస పాలన అనంతర భారతదేశంలో ఆర్థిక వ్యవస్థల్లోని కుల హక్కుల కొనసాగింపు, పరివర్తన అంశాలపై రీసెర్చ్ కూడా చేశారు. అలాగే వాషింగ్టన్, DCలోని ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ ప్లానింగ్ అడ్వొకసీ సంస్థలో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా, దక్షిణాసియాలోని అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలకు క్షేత్ర పరిశోధకురాలిగా కూడా పనిచేశారు. అంత ప్రతిభావంతురాలు ఒక్క విషయంలో అమెరికా ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించారు.

అమెరికాకు ఆగ్రహం తెప్పించిన అంశం ఏంటంటే?

అమెరికా ప్రభుత్వం దృష్టిలో రజనీ శ్రీనివాసన్ చేసిన తప్పు ఒక్కటే. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొనడమే ఆమె చేసిన తప్పు. “హింస, ఉగ్రవాదం కోసం వాదిస్తున్నందుకు” రంజనీ శ్రీనివాసన్ వీసాను రద్దు చేసినట్లు ట్రంప్ సర్కార్ తెలిపింది. “ఉగ్రవాద సంస్థ ‘హమాస్’కు మద్దతు ఇచ్చే కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు” అంటూ ఆమెపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఈ కారణంతో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం సైతం ఉంది.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కొలంబియా విశ్వవిద్యాలయం పాలస్తీనా అనుకూల విద్యార్థుల నిరసనలకు వేదికగా మారింది. అమెరికా మొదటి నుంచి ఇజ్రాయిల్ పక్షాన నిలిచింది. పాలస్తీనాలో అధికారంలో ఉన్న ‘హమాస్’ సంస్థను ఉగ్రవాదులుగా అమెరికా పేర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో గత వారం, పాలస్తీనా సంతతికి చెందిన మాజీ కొలంబియా విద్యార్థి మహమూద్ ఖలీల్‌ను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. గత ఏడాది యూనివర్సిటీ క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల నిరసనలకు ఖలీల్ ఆద్యుడని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ అభియోగాల నేపథ్యంలో అతడికి మంజూరు చేసిన గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాస హోదా)ను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే, కొలంబియా యూనివర్సిటీని చెందిన మరో విద్యార్థిని లెకా కోర్డియా విద్యార్థి వీసా గడువు దాటినప్పటికీ అమెరికాలోనే ఉన్నందుకు ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె గత ఏడాది న్యూయార్క్‌లో పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్నారు. తాజాగా రజనీ శ్రీనివాసన్ వీసాను మార్చి 5న రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

రజనీ సెల్ఫ్ డిపోర్టేషన్‌కి కారణం ఇదేనా?

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మార్చి 10న దేశంలో అక్రమంగా ఉంటున్న వారి కోసం సెల్ఫ్ డిపోర్టేషన్ రిపోర్టింగ్ ఫీచర్‌తో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) హోమ్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌లో నమోదు చేసుకుని తమంతట తాముగా అమెరికా విడిచి వెళ్లిపోతే.. వారు భవిష్యత్తులో చట్టబద్ధంగా అమెరికా తిరిగొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలా చేయకపోతే.. అమెరికన్ అధికారులు వారిని కనిపెట్టి మిలటరీ విమానాల్లో వెనక్కి పంపిస్తారు. అప్పుడు వారు ఎట్టి పరిస్థితుల్లో అమెరికా తిరిగొచ్చేందుకు అవకాశం ఉండదు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ఈ ప్రకటనతో రజనీ శ్రీనివాసన్ CBP యాప్‌ను ఉపయోగించి “స్వీయ బహిష్కరణ” ఆప్షన్ ఎంచుకున్నట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఆమె హింసను సమర్థించినట్టు తమ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్నది మాత్రం చెప్పలేదు. రజనీ శ్రీనివాసన్ లాగార్డియా విమానాశ్రయంలో సూట్‌కేస్‌ని లాగుతున్నట్లు కనిపిస్తున్న వీడియోను హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ శుక్రవారం Xలో పోస్ట్ చేశారు.

వీడియో చూడండి..

“యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నివసించడానికి, చదువుకోవడానికి వీసా మంజూరు చేయడం ఒక విశేషం. మీరు హింస, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినప్పుడు, ఆ ప్రత్యేక హక్కును రద్దు చేయాలి. మీరు ఈ దేశంలో ఉండకూడదు. కొలంబియా యూనివర్శిటీ ఉగ్రవాద సానుభూతిపరులలో ఒకరు స్వీయ-బహిష్కరణ కోసం CBP హోమ్ యాప్‌ను ఉపయోగించడం చూసి నేను సంతోషిస్తున్నాను” అని ఆమె సోషల్ మీడియా X లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. మొత్తానికి రజనీ శ్రీనివాసన్ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొనడంతో.. తన పరిశోధనను అర్థాంతరంగా వదిలేసి స్వదేశానికి తిరిగిరావాల్సి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..