డాలర్ డ్రీమ్స్ ఆవిరి.. తొలివిడతలో భారత్ చేరిన 104మంది.. ఎవరిని కదలించినా కన్నీటి కథలే..!
అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతంగా అమెరికా నుంచి పంపించి వేయడంతో భారత్ చేరుకున్న 104 మంది భారతీయుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

డాలర్ డ్రీమ్స్ ఆవిరయ్యాయి. తమ దేశంలో అక్రమంగా ఉన్నారంటూ 104 మంది భారతీయులు అమెరికా ప్రభుత్వం బలవంతంగా భారత్‌కు తరలించింది. వలసదారుల విమానం పంజాబ్ లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యింది. స్వదేశానికి చేరుకున్న భారతీయులు వివరాలు నమోదు చేసుకున్న అధికారులు వాళ్ల స్వస్థలాలకు తరలించారు.
భారత్‌కు తరలించిన వాళ్లను కదిలిస్తే కన్నీటికథలు బయటకు వస్తున్నాయి. తమ వాళ్ల ఆచూకీ కోసం ఇన్నాళ్లు తల్లడిల్లిన ఆప్తులు అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్‌కు చెందిన 33 మంది, పంజాబ్‌కు చెందిన 30 మంది, మహారాష్ట్ర, చండీఘడ్‌కు ముగ్గురు చొప్పున భారత్‌కు పంపించారు.
భారతీయులను అమెరికా అధికారులు అష్టకష్టాలు పెట్టారు. డిపోర్టేషన్ సమయంలో వలసదారుల చేతికి, కాళ్లకు సంకెళ్లు వేశారు. అక్కడి నుంచి వస్తున్న భారతీయులను క్రిమినల్స్‌లా ట్రీట్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డిపోర్ట్ టైమ్‌లో మిలిటరీ విమానంలోనూ సంకెళ్లతోనే తీసుకొచ్చారు. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన తర్వాతే ఆ సంకెళ్లను విప్పారని బాధితులు తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన 104 మందిలో 19మంది మహిళలు, 14మంది మైనర్లు ఉన్నారు. వారిలో నాలుగేళ్ల బాలుడు, ఇద్దరు పదేళ్లలోపు బాలికలు ఉన్నారు.
వాస్తవానికి బుధవారం ఉదయమే అమెరికా మిలటరీ విమానం అమృత్‌సర్‌కు చేరుకోవాలి. జర్మనీలో కొన్ని గంటల పాటు ఈ విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులకు ఆహారంతోపాటు అవసరమైన వస్తువులను అందించారు. మిలటరీ విమానంలో ఒకే టాయ్‌లెట్ ఉండడంతో వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అందులో కొందరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీళ్లంతా ఇంగ్లాండ్ మీదుగా అమెరికా వెళ్లారు. 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి వెళ్లారు. అక్కడికి వెళ్లొద్దని ఎంత చెప్పినప్పటికి వినలేదు. ఎలాగో వీసా తీసుకుని వెళ్లారు. ఇలా పేద పిల్లలే అక్కడికి వెళ్తున్నారు. చట్టప్రకారమే అమెరికా వెళ్లే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
అమెరికా నుంచి భారత్‌కు తరలించిన వాళ్లను అధికారులు స్వస్థలాలకు పంపిస్తున్నారు. తగిన డాక్యుమెంట్లు లేకుండా అమెరికా ఎలా వెళ్లారని వాళ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంజాబ్‌కు చెందిన 30 మందిని అమెరికా నుంచి డిపోర్ట్ చేశారు. వాళ్లను పంజాబ్ మంత్రి కుల్దీప్‌సింగ్ దాలీవాల్ కలిశారు. పంజాబ్ యువకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంజాబ్ ప్రభుత్వం వాళ్లకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్హతల ఆధారంగా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆ యువకులకు పంజాబ్ ప్రభుత్వం ఉచితంగా చికిత్సను అందిస్తుందని హామీ ఇచ్చారు.
అమెరికాకు ఎన్నో ఆశలతో వెళ్లామని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని పంజాబ్‌కు చెందిన యువకులు మంత్రి దాలీవాల్‌కు వివరించారు. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం తోనే అమెరికాకు వెళ్లినట్టు తెలిపారు. అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. తొలివిడతలో భాగంగా 104 మందిని వెనక్కి పంపించారు.
ఈ బృందంలో మొహాలీకి చెందిన ప్రదీప్‌తో సహా 205 మంది భారతీయులు ఉన్నారు. ప్రదీప్ మొహాలిలోని లాల్రులోని జాదౌత్ గ్రామ నివాసి. అతను తన కుటుంబ ఆశలతో అమెరికా వెళ్ళాడు. ప్రదీప్ తన భూమిని అమ్మి 41 లక్షల రూపాయల అప్పు తీసుకుని ఆరు నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. కానీ అక్కడి కఠినమైన విధానాల కారణంగా వెనక్కి వచ్చేశాడు. ప్రదీప్ డాంకీ రూట్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించాడు. అది ఇప్పుడు అతని జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుగా నిలిచింది. తమ కొడుకుకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తానని హామీ ఇచ్చి అమెరికాకు పంపామని కుటుంబసభ్యులు భోరుమన్నారు. కానీ ఇప్పుడు అతను ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడని చెప్పారు. తమ కల చెదిరిపోయిందని, ఇప్పుడు ఈ భారీ అప్పును ఎలా తీర్చాలో ఆలోచిస్తున్నామని అంటున్నారు. మొత్తం మీద, ఒకవైపు, వారి కొడుకు తిరిగి రావడంతో కుటుంబం సంతోషంగా ఉండగా, మరోవైపు, అప్పుల భారం వారి తలపై ఉంది. ఇప్పుడు ప్రదీప్ కుటుంబం భారత ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం నుండి సహాయం ఆశిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..