ఓ చిన్నారి మాస్క్ పెట్టుకోనందుకు ఏకంగా వారి తల్లిదండ్రులను విమానం నుంచి దించేసిన సంఘటన న్యూజెర్సీకి చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో జరిగింది. కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అయింది. విమానయాన సంస్థలు కూడా మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేస్తున్నారు. ఇదే విషయంలో ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..
నెవాక్ విమానాశ్రయంలో డెన్వర్ నుంచి న్యూజెర్సీకి బయలుదేరేందుకు యునైటెడ్ ఎయిరలైన్స్‌కి చెందిన విమానం రెడీగా ఉంది. అందులో ఓ దంపతుల కూతురు మాస్క్ పెట్టుకోలేదని విమానయాన సిబ్బంది గమనించి సూచించారు. దీంతో ఆ చిన్నారికి మాస్క్ పెట్టడానికి ఆ తల్లిదండ్రులు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో పాపతో పాటు తల్లిదండ్రులను కూడా విమానం నుంచి దింపేసారు సిబ్బంది. అయితే ఐదేళ్ల లోపు చిన్నారులు మాస్క్ పెట్టుకోకున్నా పర్వాలేదని నిబంధనలు ఉన్నాయి. కానీ సిబ్బంది అవేమి పట్టించుకోలేదు. దీంతో చిన్నారి తల్లి మాస్క్ పెట్టుకోనందున మమ్మల్ని విమానం నుంచి దింపేసారని ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేసింది. దీంతో స్పందించిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆ కుటుంబానికి మనీ రిఫండ్ చేస్తానని ప్రకటించింది.