WHO on Europe Covid-19 deaths: కరోనావైరస్ మహమ్మారి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు, మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతోపాటు కరోనా వేరియంట్లు కూడా పుట్టుకోస్తుండటంతో మహమ్మారి ముప్పు ఇంకా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య అరకోటి దాటింది. ఈ క్రమంలో యూరప్‌లో కరోనా పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. వచ్చే ఫిబ్రవరి నాటికి యూరప్‌లో కోవిడ్-19 బారిన పడి మరో ఐదు లక్షల మంది మరణించే అవకాశముందని డబ్ల్యూహెచ్‌ఓ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుతం యూరప్ రీజియన్ పరిధిలోని 53 దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోందని.. దీనివల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లుగే పేర్కొన్నారు. ఈమేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, యూరప్ దేశాల్లో మరో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
రష్యా, జర్మనీ, బ్రిటన్ పలు దేశాల్లో కోవిడ్-19 మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతోపాటు కేసులు కూడా వేల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. పలు వేరియంట్ల మూలంగా కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ధోరణి ఇలానే ఉంటే.. మరణాలు అధికమయ్యే ప్రమాదముందంటూ డబ్ల్యూహెచ్‌ఓ యూరోపియన్ యూనియన్ రీజియన్ తెలిపింది.
ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 249,035,981 కి చేరగా.. మరణాల సంఖ్య 5,040,922 కి పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 225,585,599 మంది కోలుకున్నారు.
Also Read: