యూరప్ దేశాలకు శుభవార్త.. ఫైజర్ బయోన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఈఎంఏ ఆమోదం

|

Dec 21, 2020 | 9:42 PM

ఇప్పటి దాకా కరోనా మహమ్మారితో తల్లడిల్లిన యూరప్ కొత్తగా స్ట్రెయిన్ వైరస్ తీవ్రతతో వణికిపోతుంది. దీంతో యూరోపియన్ దేశాల ప్రజలను కాపాడుకునేందుకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది.

యూరప్ దేశాలకు శుభవార్త..  ఫైజర్ బయోన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఈఎంఏ ఆమోదం
Follow us on

ఇప్పటి దాకా కరోనా మహమ్మారితో తల్లడిల్లిన యూరప్ కొత్తగా స్ట్రెయిన్ వైరస్ తీవ్రతతో వణికిపోతుంది. దీంతో యూరోపియన్ దేశాల ప్రజలను కాపాడుకునేందుకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ వినియోగానికి ఓకే చెప్పేసింది. వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు సూచించింది.
కొత్త వైరస్ విస్తరిస్తున్న వేళ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. దీంతో.. కొన్ని రోజుల్లో ఈ వ్యాక్సిన్‌ను యూరప్ దేశాల్లోని ప్రజలకు అందించనున్నారు. బ్రిటన్‌లో కొత్తగా వెలుగుచూసిన స్ట్రైయిన్ వైరస్ నేపథ్యంలో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సైంటిఫిక్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. అయితే, కొన్ని షరతులతో కూడిన వినియోగానికి ఫైజర్ బయోన్‌టెక్ వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చిందని ఈఎంఏ చీఫ్ ఎమర్ కుకే ఆన్‌లైన్ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.

ఈఎంఏ ఈ వ్యాక్సిన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం 27 యూరోపియన్ దేశాలకు మేలు జరగనున్నట్లు ఆమె తెలిపారు. సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలోనే వ్యాక్సిన్ అభివృద్ధి చెంది.. కరోనాను ఎదుర్కొనేందుకు అందుబాటులోకి రావడం సైంటిఫిక్ చరిత్రలోనే ఒక అద్భుత విజయంగా ఆమె అభివర్ణించారు. ఇదిలావుంటే.. అమెరికాలో ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు సైడ్ ఎఫెక్ట్స్‌కు లోనవుతుండటం కొంత ఆందోళన కలిగించే విషయం. అయినప్పటికే యూరప్ దేశాల్లో అత్యవసర వ్యాక్సినేషన్ మొదలు పెట్టనున్నారు.