
ఎబోలా వైరస్ మరోసారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మే 15 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,344 ఎబోలా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 930 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లోనే మరో 37 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం కాంగోలో వ్యాప్తి చెందుతున్న వైరస్ బుండిబుగ్యో (Bundibugyo) రకం ఎబోలా వైరస్‌గా అధికారులు గుర్తించారు. ఈ రకానికి సంబంధించిన వ్యాప్తిని మే 15న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ వైరస్‌ను పూర్తిగా అరికట్టేందుకు ఇప్పటివరకు సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడం వైద్య వర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో వ్యాధి నియంత్రణకు ప్రధానంగా బాధితులను గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలపైనే అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ఎబోలా వైరస్ సాధారణంగా అడవి జంతువులు, ముఖ్యంగా పండ్ల గబ్బిలాల్లో ఉంటుంది. వైరస్ సోకిన జంతువులను వేటాడడం లేదా వాటి మాంసాన్ని (బుష్‌మీట్) తినడం ద్వారా ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం ఉంటుంది. అనంతరం వైరస్ బారినపడిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట, వాంతులు వంటి శరీర ద్రవాల ద్వారా కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది లేదా ఇతరులకు కూడా సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు వెంటనే కనిపించవు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సాధారణంగా 2 నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు బయటపడతాయి.
ప్రారంభంలో అధిక జ్వరం, తలనొప్పి, తీవ్రమైన నీరసం, కండరాల నొప్పులు, గొంతు నొప్పి వంటి ఫ్లూ లేదా మలేరియాను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే వాంతులు, విరేచనాలు, కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, కొన్ని సందర్భాల్లో అంతర్గత, బాహ్య రక్తస్రావం కూడా సంభవించవచ్చు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కాంగో ప్రభుత్వం అత్యవసర ఆరోగ్య చర్యలను ముమ్మరం చేసింది. బాధిత ప్రాంతాల్లో వైద్య బృందాలను మోహరించి, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేయడం ప్రస్తుతం అక్కడి అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి