కరోనా (Corona) పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో వైరస్ పడగ విప్పుతోంది. ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుని చాలాకాలమే అవుతుండగా చైనాను కరోనా వణికిస్తోంది. దీంతో అధికారులు జీరో-కొవిడ్ పాలసీని విధించారు. అయినా వైరస్ అదుపులోకి రాకపోవడంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చైనాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు టెస్టింగ్ ఐసోలేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు. ఆ దెబ్బకు జనాలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే.. చైనాలో సెప్టెంబర్ 7న భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.8 గా నమోదైంది. 2017 తర్వాత సిచువాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ భూకంపం ఇదే. కొండచరియలు ఉండే ప్రాంతం కావడంతో భారీగానే నష్టం వాటిల్లింది. కనీసం 50 మంది దాకా మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం సమయంలోనూ లాక్‌డౌన్, ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లను అక్కడి సిబ్బంది బయటకు విడుదల చేయలేదు. పైగా బిల్డింగ్ కూలితే ఇందులోనే చావాలే తప్ప బయటకు వెళ్లకూడదంటూ అడ్డుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది.
కొందరితో సిబ్బంది దురుసుగా సైతం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు చైనా ట్విటర్ హ్యాండిల్స్ నుంచే వైరల్ కావడం గమనార్హం. అయితే వీటిపై చైనా అధికారులు స్పందించాల్సి ఉంది. అంతేకాదు భూకంప బాధితులకు సాయాన్ని సైతం కరోనా టెస్టుల క్లియరెన్స్ తర్వాతే ఇస్తామని అధికారులు చెప్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాలో పలు నగరాల్లో లక్షల మంది ఇంకా కరోనా కట్టడిలోనే ఉండిపోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి