అక్షరాలా 5,555 కోట్ల రూపాయలు. యూకే కోర్టు దుబాయ్ రాజు గారు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం తన మాజీ భార్య జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుసేన్‌కి చెల్లించుకున్న మొత్తం ఇది. బ్రిటిష్ ఫ్యామిలీ కోర్టు చరిత్రలోనే అత్యంత విలువైన విడాకులివి. అపరకుబేరుడి పెళ్ళే కాదు, పెటాకులు కూడా అంతే ఖరీదుంటాయని రుజువు చేస్తోన్న ఈ కాస్ట్‌లీ డివోర్స్ కేసు ఏంటో తెలుసుకుందాం.
5,555… లక్కీ నంబర్ లా వున్నా… ఇది బ్రిటన్ ఫామిలీ కోర్టు డివోర్స్ కేసుల చరిత్రలోనే రికార్డు సృష్టించిన నంబర్. బ్రిటన్ హైకోర్టు హిస్టరీలోనే కాస్ట్‌లీ డివర్స్ కేసుగా హల్ చేస్తోంది ఈ కేసు. రాజు గారి వ్యవహారమంటే అంతే మరి… బహుమానాలైనా, భరణాలైనా ప్రిన్స్‌లది మోస్ట్ కాస్టలీయెస్ట్ వ్యవహారమే మరి. దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం డివోర్స్ కేసు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ రాజుగాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ప్రధాన మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ ప్రముఖ గుర్రాల పెంపకం దారుకూడా. షేక్ మహమ్మద్‌కి బ్రిటన్ రాణి ఎలిజబెత్-2తో స్నేహపూర్వక సంబంధాలు సైతం ఉన్నాయి.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైన జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుసేన్‌ని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం తన ఆరో భార్యగా వివాహం చేసుకున్నారు. జోర్దాన్ రాకుమారి హయా సైతం సాధారణ మహిళ కాదు, రాచకుటుంబం నుంచి వచ్చిన యువతి. వ్యక్తిత్వం ఉన్న మహిళ. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో షో జంపింగ్ (గుర్రంతో దూకే క్రీడ) విభాగంలో జోర్దాన్ రాకుమారి హయా పాల్గొన్నారు.
షేక్ మహమ్మద్‌కి, ఆరో భార్య హయాల మధ్య గత కొన్నేళ్లుగా స్పర్ధలు మొదలయ్యాయి. దీంతో 2019లో హయా తన పిల్లలను తీసుకుని దుబాయ్ నుంచి బ్రిటన్‌కు పారిపోయారు. హయా తన భద్రత, స్వేచ్ఛ కోసం యూకే కోర్టును ఆశ్రయించింది. అత్యంత సంపన్నుడైన దుబాయ్ రాజు తనను అనుక్షణం నిర్బంధంలో ఉంచారని, తన భర్తనుంచి తన ప్రాణాలకే ముప్పు ఉన్నదని ఆమె ఆరోపించారు. తన ఇద్దరు కుమార్తెలను సైతం తన వద్దనుంచి బలవతంగా అరబ్ ఎమిరేట్స్‌కి రప్పించేందుకు షేక్ మహమ్మద్ ప్రయత్నిస్తున్నారని హయా కోర్టుకి విన్నవించారు.
అయితే దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ తన భార్య హయా తన అంగరక్షకుల్లో ఒకరితో సన్నిహితంగా మెలిగినట్టుగా కోర్టులో ఆరోపించారు. అయితే అందుకు తగిని సాక్ష్యాధారాలను చూపకపలేకపోయారు. ఇదిలా ఉంటే కోర్టు వ్యవహారం నడుస్తుండగా.. హయాతోపాటు ఆమె న్యాయవాదుల ఫోన్లను ఆమె భర్త షేక్ మహమ్మద్ ఇజ్రాయెల్‌కు చెందిన ‘పెగసస్ స్పైవేర్’ సాయంతో హ్యాకింగ్ చేయించాడని బ్రిటిష్ ఫ్యామిలీ కోర్టు గత అక్టోబరులో నిర్ధారించింది. ఈ విషయాన్ని షేక్ మహమ్మద్ ఖండించినప్పటికీ అది నిజమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో అనేక ప్రతిష్టాత్మక కేసుల్లో తీర్పులిచ్చిన బ్రిటన్ ఫ్యామిలీ కోర్టు దుబై రాజు డివోర్స్ వ్యవహారంలో షేక్ మహమ్మద్, హయాకి అక్షరాలా 5,555 కోట్ల రూపాయల భరణాన్ని ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చింది.
యూకే కోర్టు హయా భద్రతకు, వారి ఇద్దరు పిల్లలు అల్ జలీలా బిన్త్ మహ్మద్ బిన్ రషీద్, షేక్ జాయెద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్‌ల భద్రతకు అయ్యే ఖర్చుని ఇవ్వాల్సిందేగా దుబాయ్ పాలకుడు అల్-మక్తూమ్‌ని ఆదేశించింది. అంతేకాదు 2వేల516 కోట్ల రూపాయలు ముందుస్తుగా చెల్లించాలని లండన్ కోర్టు తేల్చి చెప్పింది. మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో సెటిల్‌మెంట్ చేయాల్సిందిగా తీర్పునిచ్చింది. పైగా తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఇద్దరు పిల్లలకు వారి జీవితాంతం భద్రతా ఖర్చులను భరించాలి అని కూడా కోర్టు స్పష్టం చేసింది. సెటిల్‌మెంట్‌లో భాగంగా, జడ్జి మూర్ హయా కుటుంబానికి ఏడాదికి 5 మిలియన్ పౌండ్‌లను ఇవ్వాలని దుబాయ్ రాజుని ఆదేశించారు. సెలవుల్లో ప్రైవేట్ జెట్‌లలోని విమాన ఖర్చులతో సహా వారి గుర్రాలు మరియు ఇతర పెంపుడు జంతువుల సంరక్షణ కోసం సంవత్సరానికి దాదాపు 300,000 పౌండ్లు కూడా ఈ భరణంలో ఉన్నాయి.
అల్-మక్తూమ్ మాజీ భార్య ప్రిన్సెస్ హయా బింట్ జోర్డాన్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె, పైగా ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా II సోదరి కావడంతో.. కేసు రసవత్తరంగా మారింది. లండన్ కోర్టు చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన సెటిల్మెంట్ గా భావిస్తున్నారు. అయితే ఇంత భారీ మొత్తంలో చెల్లించినా ఇంతకంటే అధిక మొత్తంలో భరణం చెల్లించుకున్న భర్తలు ఎందరో ఉన్నారు. అందుకే ఇది ఖరీదైనదే కానీ, అత్యంత ఖరీదైన డివోర్స్ మాత్రం కాదంటున్నారు నిపుణులు. సంపన్నుల ఇంట్లో పెళ్లైనా, పెటాకులైనా ఒకటే మరి. ప్రపంచమంతా చెప్పుకునేంత కాస్ట్‌లీగా ఉండాల్సిందా కదా అంటున్నారు ఈ వార్త విన్న జనాలు.
Also Read: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ హీరో.. ఎవరో గుర్తపట్టారా..?
నీటి సంపులో పడిపోయిన పిల్లి.. కాపాడేందుకు కోతి తాపత్రయం చూడండి