Donald Trump: అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల వేళ అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. డెమోక్రాట్స్ తరపున బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పెన్సిల్వేనియాలో ఇండిపెండెనస్ హాలులో జరిగిన రిపబ్లికన్ల ర్యాలీలో బైడెన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ట్రంప్. ప్రెసిడెంట్ బైడెనే మన శత్రువు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్మార్ట్ అన్న ట్రంప్.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉక్కుపిడికిలితో తెలివితేటలతో పాలిస్తున్నారంటూ ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారని, బైడెన్ అండగా నిలిచిన రాడికల్ లెఫ్టే ప్రజాస్వామ్యానికి అసలు ముప్పని అన్నారు ట్రంప్.. ఇటీవల ఫ్లోరిడాలో ఎఫ్‌బీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేసి పత్రాలు పట్టుకుపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు ట్రంప్. ఇది న్యాయాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభివర్ణించారు. తనను టార్గెట్ చేసినందుకు బైడెన్‌కు ఎదురుదెబ్బలు తగులుతాయని హెచ్చరించారు.
ఇటీవల డెమోక్రాట్స్ ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మీద చేసిన విమర్శలను ట్రంప్ ప్రస్తావించారు. ఇప్పటి వరకూ ఉన్న అమెరికా అధ్యక్షుడు ఎవరూ ఇంత దుర్మార్గమైన, ద్వేష పూరిత ప్రసంగం చేయలేదని బైడెన్‌ను తప్పుపట్టారు. ట్రంప్ ఆయన మద్దతుదారులు ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారని బైడెన్ అనడాన్ని తప్పుపట్టారు.. బైడెన్ భాష ప్రజాస్వామ్యాన్ని బెదిరించేలా ఉందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బైడెన్‌కు తగిన గుణపాఠం తెలపాలని అమెరికా ప్రజలను కోరారు.
ఈ ర్యాలీలో చైనా అధ్యక్షునిపై అనూహ్యంగా ప్రశంసలు కురిపించారు ట్రంప్. ఒకటిన్నర బిలియన్ల చైనా ప్రజలను ఉక్కు పిడికిలితో పాలిస్తున్న జీ జిన్‌పింగ్ చాలా తెలివైనవాడని అన్నారు.. జిన్‌పింగ్‌ను ట్రంప్ రాజులా అభివర్ణించడంతో ప్రేక్షకుల నుంచి గట్టిగా నవ్వులు వినిపించాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..