ఆఫ్గనిస్తాన్‌లో(Afghanistan) సంభవించిన భూకంపం పెనువిషాదాన్ని నింపుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 950మందికి పైగా మృతి చెందారు. 600 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని హెలికాఫ్టర్ల ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. భూప్రకంపనల ధాటికి వందలాది భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకొని వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణ నష్టం భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా(Earthquake in Afghanistan) నమోదైంది. భూకంపం కారణంగా భారీగా ఆస్తినష్టం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అఫ్గానిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో ఉండే ఖోస్త్ నగరానికి 44 కిలోమీట్ల దూరంలో భూకంపం కేంద్రం ఉంది. ఇది పర్వత ప్రాంతాల్లో ఉండటంతో సహాయ కార్యక్రమాలకూ ఆటంకం కలుగుతోంది. దాంతో మరణాలపై పూర్తి స్పష్టత రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళన చెందిన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.
భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, తమకు అంతర్జాతీయ సమాజం సహకారం కావాలని అఫ్గాన్ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. తాలిబన్ల ఆక్రమణతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలను ఈ భూకంపం మరింత దారుణ స్థితిలోకి నెట్టేసింది. భారత్, అఫ్గాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని 500 కిలోమీటర్ల మేర భూకంప ప్రభావం కనిపించినట్లు యూరోపియన్ సీస్మోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.
అఫ్గాన్‌నిస్థాన్‌లో ప్రకృతి విపత్తులు సాధారణమే అయినా.. 2002 సంభవించిన భారీ భూకంపంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. అఫ్గానిస్థాన్‌లో ఏటా సగటున 560 మంది భూకంపాల కారణంగా మరణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నివేదిక వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..