Covid-19: ఆ దేశంలో కరోనా సోకితే జైలే.. పాజిటివ్ అంటేనే బెంబేలెత్తుతున్న ప్రజలు..

|

Jan 14, 2022 | 7:13 PM

Covid-19 Positive Patients: కరోనా థర్డ్‌ వేవ్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్‌లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్

Covid-19: ఆ దేశంలో కరోనా సోకితే జైలే.. పాజిటివ్ అంటేనే బెంబేలెత్తుతున్న ప్రజలు..
China Locks Down 3rd City,
Follow us on

Covid-19 Positive Patients: కరోనా థర్డ్‌ వేవ్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్‌లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. పలు దేశాల్లో క‌రోనా కేసులు ఇదివ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో ఆస్పత్రులు రోగుల‌తో నిండిపోతున్నాయి. మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు.. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటి ఒక్కో తరహా విధానం అనుసరిస్తున్నాయి. ఇక కరోనా పుట్టినిల్లైన చైనాలో మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిందని ఆ దేశం చెప్పుకుంటున్నా..మళ్లీ అక్కడ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌తో పాటు నార్త్‌ ఈస్ట్‌ ప్రావిన్సెస్‌లో థర్డ్‌వేవ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఆ మహమ్మారి నుంచి కోలుకున్న వారే మళ్లీ వైరస్‌ బారిన పడుతుండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఇతర దేశాల్లో కరోనా ఉధృతి తగ్గినా..చైనాలో మాత్రం కంట్రోల్‌ అవదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇతర దేశాలతో పోలిస్తే..చైనీయులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటమేనంటున్నారు ఆ దేశ వైద్య నిపుణులు. కరోనా నుంచి బయటపడినవారికే మళ్లీ వైరస్‌ సోకుతోందని..లక్షణాలు లేకుండా విజృంభిస్తోందని అంటున్నారు. భయంకరమైన కేసులను ముందు ముందు చూస్తామేమోనని ఆందోళనగా ఉందంటున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం అలర్ట్‌ అయింది. చాపకింద నీరులా చుట్టేస్తున్న థర్డ్‌వేవ్‌ కరోనాతో అప్రమత్తమైంది డ్రాగన్‌. ఇటు ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూనే..వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేస్తోంది. అయితే కరోనా వైరస్‌తో ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసిన చైనా.. రోగుల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తోంది. మహిళలు, పిల్లలు అని చూడకుండా డబ్బాల్లో కుక్కుతున్నారు.

డ్రాగ‌న్ దేశంలో క్వారెంటైన్ రూల్స్ ఎంత క‌ఠినంగా ఉన్నాయో చెప్పడానికి ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. బిల్డింగ్‌లో ఒక్క పాజిటివ్ కేసు వ‌చ్చినా.. ఇలాంటి క్వారెంటైన్ క్యాంపుల్లోనే అనుమానిత కోవిడ్ పేషెంట్లను బంధిస్తోంది చైనా. కరోనా కేసులను పూర్తిగా తగ్గించాలనే క్రమంలో ఈ తరహా విధానం అనుసరిస్తోంది. క్వారెంటైన్ క్యాంపుల‌కు జ‌నాలను త‌ర‌లించేందుకు భారీ సంఖ్యలో బ‌స్సులు క్యూ క‌డుతున్నాయి. ప్రత్యేకంగా తయారు చేసిన మెట‌ల్ బాక్సుల్లో కరోనా సోకిన గర్భిణిలు, మ‌హిళ‌లు, చిన్నారులు, వృద్ధుల‌ను బంధిస్తున్నారు. బాక్సులో ఉడ్‌ బెడ్‌తో పాటు టాయిలెట్ ఉంటుంది. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను దాదాపు రెండు వారాల పాటు ఈ బాక్సుల్లో నిర్భంధిస్తున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక్క పాజిటివ్ కేసు వ‌చ్చినా.. ఆ ప్రాంతంలో ఉన్న వారంద‌రిని రాత్రికి రాత్రే క్వారెంటైన్ సెంట‌ర్లకు పంపిస్తున్నారు. ట్రాక్ అండ్ ట్రేస్ యాప్‌ల‌ను విరివిగా వాడుతున్నారు.

ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా 2 కోట్ల మందిని త‌మ త‌మ ఇళ్లలోనే నిర్బంధించారు చైనా అధికారులు. క‌నీసం ఆహారం కొనేందుకు కూడా వాళ్లను బ‌య‌ట‌కు పంప‌డం లేదు. చైనాలో 2019లో తొలిసారి క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదయ్యాయి. వైర‌స్‌ను క‌ట్టడి చేసేందుకు క‌ఠిన లాక్‌డౌన్లు, మాస్ టెస్టింగ్‌ల‌ను నిర్వహిస్తోంది చైనా. డైనమిక్ జీరో విధానం ఎలా ఉన్నా.. ఐసోలేషన్‌ విధానాలు అక్కడి పాలకుల క్రూరత్వాన్ని చాటుతున్నాయి. అందుకే అక్కడి ప్రజలు పాజిటివ్ అంటేనే చాలు బెంబేలెత్తుతున్నారు.

Also Read:

Afghanistan Taliban: తాలిబన్ల రాజ్యంలో ఆకలి కేకలు.. అవయవాలు అమ్ముకుంటున్న ఆఫ్గాన్లు..

Omicron Variant: రెండు మాస్క్‌లతో ఒమిక్రాన్‌ నుంచి రక్షణ.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!