UK Covid-19 variant: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పుట్టుకొస్తున్న కరోనా వేరియంట్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న క్రమంలో.. కొన్ని దేశాల్లో కొత్త కోత్త వేరియంట్లు కలవరం పుట్టిస్తున్నాయి. బ్రిటన్‌లో కరోనా పీడ వదలడం లేదు. కేసులు తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జూలైలో అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పక్కనపెట్టింది. మాస్క్‌లు ధరించాల్సిన పనిలేదని చెప్పింది. దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో అక్కడ కరోనా మరోసారి విరుచుకుపడుతోంది. తాజాగా బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసింది. డెల్టా వేరియంట్‌లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. డెల్టాప్లస్ ఏవై.4.2గా పిలుస్తున్నారు. కొత్త వేరియంట్ కారణంగానే బ్రిటన్‌లో కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు భావిస్తున్నారు. అయితే, నిపుణులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. డెల్టా వేరియంట్‌కు చెందిన 484కె, 484క్యూ రకం వైరస్‌లు కొద్దిరోజులుగా ఇంగ్లండ్‌లో వ్యాపిస్తున్నాయి. ఏవై.4.2 కారక కేసులూ వెలుగుచూశాయి. ఇదేమీ పెద్ద ఆందోళనకర వైరస్ కాదంటున్నారు. తొలిసారిగా గత జులైలోనే ఈ వైరస్‌ను గుర్తించాం. అప్పట్నుంచి దీని వ్యాప్తిని గమనిస్తున్నామని వైద్య నిపుణులు పేర్కొ్న్నారు.
అయితే.. బ్రిటన్‌లో రెండు వారాలుగా రోజుకు దాదాపు 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే బ్రిటన్‌లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. పాజిటివ్ కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో చలికాలం వచ్చేసింది. ఈ సమయంలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో వైద్య సేవలపై భారం పడుతుంది. కరోనా కేసుల నమోదు ఇలాగే ఉంటే మున్ముందు వైద్య వ్యవస్థకు సవాలే అంటున్నారు అక్కడి వైద్య నిపుణులు. ముఖ్యంగా ఎక్కువశాతం విద్యార్థులు కరోనా భారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్‌లో పాఠశాలకు వెళ్తోన్న విద్యార్థుల్లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంది. అలాగే మాస్క్‌లు తప్పనిసరి కాదు. అయితే కేసులు పెరిగితే విద్యార్థులు మాస్కులు ధరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల విషయంలో కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. వారు ఆ వైరస్‌తో పోరాడి కోలుకోగలరు. కానీ ఇంట్లో ఉండే పెద్దలు, ఉపాధ్యాయులు, టీకా తీసుకోనివారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రమాదమంటున్నారు.
బ్రిటన్ ప్రధానంగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాపైనే ఆధారపడింది. ప్రపంచంలో అందరిక కంటే ముందుగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంతో టీకా యాంటీబాడీలు తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసుల పంపిణీ చేపట్టారు. కరోనా నిబంధనల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: