ప్రముఖ ప్రకృతి పరిశోధకుడు, ఇంగ్లీష్ బ్రాడ్‌కాస్టర్ అటెన్‌బోరకు సంబంధించిన.. వైల్డ్ లైఫ్ న్యూ సిరీస్ విషయంలో కొత్త వివాదం మొదలైంది. ఆయన నరేట్ చేసిన ఈ స్పెషల్ సిరీస్‌ను బీబీసీ ప్రసారం చేయొద్దని నిర్ణయించినట్టు ది గార్డియన్‌లో కథనాలు ప్రచురితం కావడం సంచలనం రేపుతోంది. రాజకీయ, కార్పొరేట్ ఒత్తిళ్లకు తలొగ్గి బీబీసీ.. ఈ కథనాలను ప్రసారం చేసే విషయంలో వెనకడుగు వేసిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయ్.
బ్రిటన్‌లో అటవీ సంరక్షణ సంక్షోభంలో ఉందనీ.. ఆ విషయాలను ప్రపంచానికి తెలిసేలా అటెన్‌బోర కీలకమైన ఎపిసోడ్‌ను సిద్ధం చేశారనీ… కానీ, బీబీసీ దాన్ని ప్రసారం చేసేందుకు భయపడుతోందనే ప్రచారం జరుగుతోంది. WWF, RSPB వంటి చారిటీ సంస్థల ద్వారా ఫండ్స్ తీసుకుని మొత్తం ఆరు ఎపిసోడ్‌లను రూపొందించిన బీబీసీ.. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి.. అసలు విషయాలను దాచేస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేసింది ది గార్డియన్.
అయితే, తమపై వస్తున్న ఆరోపణల్ని, విమర్శల్ని ఖండించింది బీబీసీ. అటెన్ బోరాకు సంబంధించి ఏ ఒక్క ఎపిసోడ్‌నూ ఆపాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది. ఇది కేవలం తమపై జరుగుతున్న దుష్ప్రచారమేనని కొట్టిపారేసింది. చేసింది ఐదు ఎపిసోడ్‌లేననీ… ఆరో ఎపిసోడ్ అన్నది ఉత్తి ప్రచారమేనని స్పష్టం చేసింది. దేశంలో అటవీ సంపద ఎలా నాశనమవుతోందనే విషయాన్ని ఈ సిరీస్‌లో స్పష్టంగా తెలియజేశామంటూ ది గార్డియన్‌కు గట్టిగానే కౌంటరిచ్చారు బీబీసీ ప్రతినిధులు.
ఇందులో నిజమెంతో తెలియదుగానీ, బ్రిటీష్ రాజకీయ వర్గాల నుంచి సైతం బీబీసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ప్రకృతి, పర్యావరణ అత్యవసర పరిస్థితులను బీబీసీ సెన్సార్ చేసేందుకు ప్రయత్నించడం క్షమించరాని నేరమన్నారు గ్రీన్ పార్టీ ఎంపీ కరోలిన్ లూకాస్. ప్రకృతి సంపదను కాపాడేందుకు ముందుండాలే తప్ప.. ప్రభుత్వానికి బీబీసీ భయపడొద్దన్నారు. బీబీసీ నిర్వహణకోసం భారీగా ప్రజాధనాన్ని కేటాయిస్తున్న విషయాన్నీ గుర్తు చేశారు.
ఇటీవల ది కోశ్చన్ మోదీ డాక్యుమెంటరీతో వార్తల్లో నిలిచిన బీబీసీ.. అటెన్ బోర సరికొత్త సిరీస్ విషయంలో అదేస్థాయి వివాదాన్ని ఎదుర్కొంటోంది. మరి, ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..