ప్రపంచంలోనే అత్యంత ఉదారమైన రాజ్యాంగ వ్యవస్థల్లో ఒకటిగా పేరున్న సౌత్ ఆఫ్రికా ఇప్పుడు మహిళలు ఒకరి కంటే ఎక్కువ భర్తలు (బహుభర్తృత్వం) దిశగా అడుగులు వేస్తోంది. మహిళలు పలువురిని పెళ్లాడేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది. దక్షిణాఫ్రికాలో మహిళలకు ఒకటి కంటే ఎక్కువ భర్తలు ఉండాలనే ప్రతిపాదన ఒక పత్రంలో చేర్చబడింది. ఈ పత్రాన్ని గ్రీన్ పేపర్ అంటారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం దీనిని జారీ చేసింది. 1994 తరువాత దేశంలో వివాహ చట్టాన్ని సంస్కరించడానికి ఈ చర్య తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలు కూడా రెడీ అయింది. బహుభర్తృత్వంపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టింది. ఈ రోజు (జూన్ 30) చివరి రోజు కావడంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
వారికి నచ్చిన రీతిలో వారు స్పందించేందుకు అక్కడ వీలుంది. అయితే ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వం తీసుకు వస్తున్న చట్టంకు అనుకూలంగా ఓటు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలు కూడా ఇందుకు అనుకూలంగా ఓటు వేస్తుండటంతో ఆ సెంటర్ల వద్ద మంచి ఉత్సాహం నెలకొంది.
సౌత్ ఆఫ్రికాలో పురుషులు, మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న వారు ఈ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంప్రదాయవాదులు, మత సంస్థలు మాత్రం వ్యతిరేకిస్తూ తమ వాయిస్ వినిపిస్తున్నాయి. బహుభర్తృత్వం ద్వారా పుట్టే పిల్లలకు తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని అక్కడి స్టార్ నటుడు మౌసా సెలేకూ ప్రశ్నిస్తున్నారు. మౌసా సెలేకూ నలుగురు భార్యలు.
బహుభర్తృత్వం వల్ల దేశ సంస్కృతి నాశనం అవుతుందని విమర్శిస్తున్నారు. బహుభార్యత్వం ఆమోదం పొందిన ఆచారమని, కానీ బహుభర్తృత్వానికి ఆమోదం లేదని ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమొక్రటిక్ పార్టీ నేత కెన్నెత్ మెషో పేర్కొన్నారు. పురుషాధిక్య ప్రపంచంలో బహుభర్తృత్వం చెల్లదని అభిప్రాయపడ్డారు. ముస్లిం మత సంస్థలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.
ఎవరి వాదన ఎలా ఉన్నా.. నేటి కాలం యువత మాత్రం తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి చట్టాలు ప్రపంచంలోని అన్ని దేశాల్లో రూపు దిద్దుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బహుభార్యత్వం మాత్రం చట్టంగా మారబోతోంది.
ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉంది. తాజాగా బహుభర్తృత్వంపై వచ్చిన ప్రతిపాదనను స్వీకరించడం ద్వారా సంచలనం సృష్టించింది.