చిన్నప్పటి నుంచీ చూస్తున్నా.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. చందమామపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జాబిలి చుట్టూ కథలు అల్లారు. కొన్నాళ్ల కిందట ఆ జాబిలిపైనే అడుగుపెట్టారు. అక్కడ నీటి జాడను కనుగొన్నారు. భారీగా ఖనిజాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ దాటి.. చైనా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. చంద్రుడి మీదున్న మట్టి నుంచి నీటిని ఉత్పత్తి చేసి.. మరో కొత్త సంగతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని తెలుసు కాని.. దాని పైన ఉండే మట్టి నుంచి వాటర్ ని తయారుచేయడం కూడా సాధ్యమేనని ఇప్పుడు నిరూపించారు. అసలే.. భూమిపై వాటర్ సోర్స్ తగ్గిపోతున్న సమయంలో.. ఈ పరిశోధన ఫలితాలు కొత్త ఆశలను రేకెత్తించాయి. ఇంతకీ చంద్రుడిపై ఉన్న మట్టి నుంచి వాటర్ ను ఎలా బయటకు తీశారు? దీనికోసం చైనా శాస్త్రవేత్తలు అనుసరించిన మార్గమేంటి? ఇప్పుడీ ప్రయోగం సక్సెస్ అయ్యింది కనుక.. జాబిలిపై నివాసముండడానికి మార్గం సుగుమం అయినట్టేనా? ఈ రిజల్ట్.. భవిష్యత్ ప్రయోగాల తీరుతెన్నులను ఎలా మార్చనుంది?
CAS – చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు. CASలోని నింగ్ బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కు చెందిన సైంటిస్టులు ఈ విషయంలో ముందడుగు వేశారు. చాంగ్ ఈ-5 మిషన్ లో భాగంగా చంద్రుడిపై మట్టిని భూమికి తీసుకువచ్చారు. తరువాత దీనిని బాగా వేడి చేశారు. ఆ తరువాత ఈ మట్టి నుంచి నీటిని వెలికితీయడానికి స్పెషల్ మెథడ్ ను ఉపయోగించారు. ఈ ప్రయోగంలో తేలింది ఏంటంటే.. 500 లీటర్ల నీటిని తయారుచేయాలంటే.. ఒక టన్ను మట్టి అవసరం. అయితే ఈ ప్రయోగంలోనే సైంటిస్టులకు మరో విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. జాబిలి నుంచి తీసుకువచ్చిన మట్టి నుంచి తయారుచేసిన నీటిని.. అటు హైడ్రోజన్, ఇటు ఆక్సిజన్ గా విడగొట్టవచ్చు. దీంతో చంద్రుడిపై ఉన్న మట్టిపైన శాస్త్రవేత్తలు పూర్తిగా దృష్టి సారించారు. భూమి తరువాత అంతటి నివాసయోగ్యమైన గ్రహం కోసం ఎప్పటి నుంచో అన్వేషణ జరుగుతోంది. భూమికి దగ్గరగా ఉండేవాటిపైనా ఫోకస్ పెట్టారు. అక్కడ నీటి నిల్వలు ఉంటేనే మానవ మనుగడ సాధ్యం. అందుకే ఇప్పుడీ ప్రయోగానికి ఇంతటి ప్రాధాన్యత చేకూరింది.
జీవం మనుగడ సాగించాలంటే.. అనువైన, స్థిరమైన పరిస్థితులు ఉండాలి. అందుకే చంద్రుడిని ఆవాసంగా చేసుకోవడానికి ఉన్న అనువైన పరిస్థితులపైనే వివిధ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో మిగిలిన దేశాల కంటే చైనా శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేశారు. వీరు జాబిలిపై ఉండే మట్టి నుంచి నీటిని తయారుచేయడం.. పరిశోధనల్లో ఓ పెద్ద మలుపు అనే చెప్పాలి. లూనార్ సాయిల్ సాయంతో నీటిని తయారుచేయడానికి వీలుగా ఓ మెకానిజమ్ ను డెవలప్ చేస్తున్నారు. నీరుంటే.. మనిషి మనుగడకు అవకాశం ఉన్నట్టే. అందుకే ఇతర దేశాలకన్నా ముందే ఈ విషయంలో పైచేయి సాధించడానికి డ్రాగన్ తహతహలాడుతోంది. ఇప్పటికే అక్కడ నీటి జాడలు ఉన్నాయన్న సంకేతాలకు తోడు.. అక్కడి మట్టితో నీటిని తయారుచేయవచ్చన్న పరిశోధనతో ఇతర దేశాలు కూడా దీనిపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నాయి.
చంద్రుని ఉపరితలంపై పెద్ద ఎత్తున నీటి ఉత్పత్తికి సంబంధించి.. సైంటిస్టులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎండోజెనస్ హైడ్రోజన్, లూనార్ సాయిల్ మధ్య ప్రత్యేకమైన రసాయన ప్రతిచర్యను ఉపయోగించి నీటిని తయారుచేశారు. ఈ యునిక్ కెమికల్ రియాక్షన్.. తాగునీటిని తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మట్టిని 1200 K కన్నా ఎక్కువ స్థాయిలో వేడి చేస్తేనే నీటిని తయారుచేయడానికి వీలవుతుంది. దీనికోసం కాన్ కేవ్ మిర్రర్స్ ను ఉపయోగించారు. ఈ చర్య ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక గ్రాము లూనార్ సాయిల్ నుంచి.. 51 నుంచి 76 mg వాటర్ ను తయారుచేయవచ్చు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని ప్రకారం చూస్తే.. ఒక టన్ను లూనార్ సాయిల్ ద్వారా.. వంద.. 500 మిల్లీ లీటర్ల బాటిల్స్ కు సరిపడా నీటిని తయారుచేయవచ్చు. ఈ నీటితో 50 మందికి ఒక రోజుకు సరిపడా తాగునీటిని అందించవచ్చు. అయితే ఇలా నీటిని తయారుచేయడానికి లూనార్ ఇల్మెనైట్ అనే ఖనిజం చాలా ముఖ్యం. పరిశోధకులు చెబుతోంది కూడా ఇదే.
చంద్రుడిపై మట్టిని ఉపయోగించి నీటిని ఉత్పత్తి చేసే శాస్త్రవేత్తలు.. ఓ ప్రత్యేక పద్దతిలో హైడ్రోజన్, ఆక్సిజన్ ను విడదీయగలరు. దీనివల్ల చంద్రుడిపై నివాసముండే వారికి ఆక్సిజన్ తో పాటు మరికొన్ని శక్తి వనరులు కూడా అందే అవకాశం ఉంటుంది. ఈ పాయింటే.. శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. ఈ ప్రయోగం ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఉత్పత్తి చేయడం సాధ్యమైతే.. చందమామపైన కూడా మానవ మనుగడ సాధ్యమే అన్న ఆశలను పెంచుతోంది. 2020లో చాంగ్ ఈ5 మిషన్ ను చైనా ప్రయోగించింది. అప్పుడు జాబిలిపై ఉన్న మట్టిలో నీటి జాడను పసిగట్టారు. చంద్రుడిపై ఉన్న మట్టిని పరిశీలిస్తే.. వెయ్యి కన్నా ఎక్కువగానే అణు నిర్మాణాలు ఉన్నట్టు తేలింది. వీటిలో స్పటికాల్లా ఉండే ULMలో నీటి అణువులు ఉన్నట్టు బయటపడింది. చాంగ్ ఈ మిషన్.. చంద్రలోకంలో అవతలివైపు ఉన్న ప్రాంతం నుంచి రెండు కేజీల మట్టిని భూమికి చేరవేసింది. ఇప్పుడు దీనిని మరింతగా టెస్ట్ చేస్తే.. అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అసలు జాబిలిపై నీటి వనరులు ఎలా ఏర్పడ్డాయి? ఇది పెద్ద ప్రశ్న. మన దేశం ప్రయోగించిన చంద్రయాన్-1 ద్వారా మాత్రమే.. చందమామపై ఉన్న నీటి జాడ గురించి ఈ లోకానికి తెలిసింది. ఇది నిజంగా మనకు గర్వకారణం. ఎందుకంటే చందమామతో మనకు యుగయుగాలుగా బంధముంది. కాకపోతే వాతావరణమే లేని చందమామపై నీరు ఎలా ఏర్పడింది అన్నది మాత్రం బిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి ఇప్పటికీ శాస్త్రపరంగా సరైన నిర్థారణ లేదు. కాకపోతే ఆ మధ్యన యూనివర్సిటీ ఆఫ్ హవాయి వాళ్లు మాత్రం జాబిల్లిపై నీటి జాడ గురించి చెప్పారు. వీరి ప్రకటన సరికొత్త ఆశలను రేకెత్తించింది. భూమిపై వాతావరణంలో ఉండే ఎలక్ట్రాన్సే.. చందమామపై నీరు ఏర్పడడానికి కారణమని తెలిపారు. ఈ విషయాన్ని వాళ్లు.. మన దేశం ప్రయోగించిన చంద్రయాన్-1 మిషన్ ఇచ్చిన డేటాను ఆధారంగా చేసుకునే ప్రకటించారు. శాస్త్రీయంగా చూస్తే.. భూమిపై ఉండే ఎలక్ట్రాన్స్.. జాబిలిపై ఉండే ఖనిజాలు, శిలలను కరిగించడం, వాటిని విచ్ఛిన్నం చేసే పర్యావరణ చర్యలకు దోహదపడుంటాయని శాస్త్రవేత్తలు భావించారు. గతంలో కొన్ని పరిశోధనలు మాత్రం.. జాబిలిపై నీరు ఎలా ఏర్పడిందో చెప్పాయి. చంద్రుడి ఉపరితలాన్ని.. సౌరగాలి గట్టిగా తాకినప్పుడు నీరు ఏర్పడి ఉండొచ్చన్నది వీటి సారాంశం.
నిజానికి భూ అయస్కాంత వాతావరణం మీదుగా జాబిల్లి ప్రయాణం సాగించినప్పుడు… సౌరగాలి.. చందమామ ఉపరితలాన్ని టచ్ చేయడం కష్టమంటారు శాస్త్రవేత్తలు. అయితే జాబిల్లి ఇలాంటి వాతావరణంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా దానిపై నీరు ఏర్పడినట్లు తేలింది. సో.. సౌరగాలిలో ఉండే ప్రోటాన్ల అవసరం లేకుండానే చందమామపై నీరు ఏర్పడింది అన్నది స్పష్టమైంది. ఎలా అంటే.. భూమిపై ఉండే వాతావరణంలో ఎక్కువ పవర్ ఉన్న ఎలక్ట్రాన్ల ద్వారా రేడియేషన్ రిలీజ్ అవుతుంది. దీని ద్వారా.. చందమామపై నీటి అణువులు ఏర్పడ్డాయి. యూనివర్సిటీ ఆఫ్ హవాయి సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. దీనికోసం వాళ్లు.. మన చంద్రయాన్ -1 ఇచ్చిన డేటాను పూర్తిగా పరిశీలించారు. ఈ మిషన్ లో ఉన్న ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ అయినటువంటి.. మూన్ మినరాలజీ మ్యాపర్ ఇన్ స్ట్రుమెంట్ ఇచ్చిన.. రిమోట్ సెన్సింగ్ డేటాను రీసెర్చ్ చేశారు. అప్పుడు ఈ విషయం బయటపడింది. మన దేశానికి గర్వకారణమైన చంద్రయాన్-1 లో ఒక విషయంపై మాత్రం క్లారిటీ వచ్చింది. జాబిల్లి ఉపరితలంపైన నీటి జాడలు ఉండే ఖనిజాలు.. హైడ్రోజన్, ఆక్సిజన్ అణువుల రూపంలో ఉన్న విషయం వెలుగుచూసింది. తరువాత నాసా కూడా జాబిలిపై ఉండే నీటి జాడలు విషయంలో మరో అప్ డేట్ ఇచ్చింది. చందమామకు దక్షిణ ధ్రువంపై అతి పెద్ద బిలం ఉందని.. అక్కడ సూర్యరశ్మి తగిలే చోట నీటి జాడలు ఉన్నాయని చెప్పింది. దీంతో.. జాబిలిపై నీరు ఉందా లేదా అన్నదానిపై మరింతగా క్లారిటీ వచ్చింది. ఇదే ఇప్పుడు.. జాబిల్లిపై నివాసం ఉండే విషయంలో సగటు మనిషికి సరికొత్త ఆశలను మరింతగా పెంచుతోంది.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి