
మనం ఆపరేషన్ దోస్త్ అంటూ ఆపన్న హస్తం అందిస్తే..వాళ్లు మనకు దుష్మన్లుగా మారారు. చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు. ద్రోహం చేస్తే..! ఇప్పుడదే పని తుర్కియే చేసింది. ఇక చైనా కూడా తన అవసరాలు, ప్రయోజనాల కోసం పాక్‌పై ప్రేమ ఒలకబోస్తోంది. భారత్‌పై విషం కక్కుతోంది. తుర్కియే, చైనాలకు మనం చేతనైనంత ఉపకారం చేశామే కానీ, ఎలాంటి అపకారం చెయ్యలేదు. అయినా ఆ రెండు దేశాలు పాక్‌కి కొమ్ము కాశాయి.
2023లో తుర్కియేలో భారీ భూకంపం సంభవించినపుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారత్. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట తుర్కియేకు భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోదీ ప్రభుత్వం పంపింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మరిచి ఇప్పుడు భారత్‌పై దాడి చెయ్యడానికి పాకిస్తాన్‌కు సోంగర్ డ్రోన్లను పంపింది తుర్కియే. మనం సాయం చేస్తే, మనకు గాయం చేయడానికి చూసింది ఈ విష సర్పం.
తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు భారత్ అంటే నిలువెల్లా ద్వేషం. దాన్ని పలుమార్లు ఆయన బహిరంగంగానే వ్యక్తపరిచారు. పహల్గామ్ ఉగ్రదాడిని మాటమాత్రంగా కూడా ఖండించలేదు ఎర్డోగాన్. ఇక ఇస్లామిక్ దేశాలకు సౌదీ అరేబియా నేతృత్వం వహిస్తోంది. అయితే ఇస్లామిక్ దేశాలకు నేతృత్వం వహించాలని తుర్కియే ఎప్పటినుంచో కలలు కంటోంది. దీనికి సౌదీ అరేబియా అడ్డు రావడం, ఆ దేశంతో మనకు మంచి సంబంధాలు ఉండడంతో భారత్ మీద కూడా ద్వేషం పెంచుకుంది తుర్కియే.
ఇక భారతదేశంతో చైనాకు బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. గత ఏడాది చైనా నుంచి మనం 107 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకున్నాం. ఆ దేశానికి మనం కేవలం 17 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు మాత్రమే ఎగుమతి చేశాం. భారత్ నుంచి ఇంత భారీగా వాణిజ్య లబ్ధి పొందుతున్నప్పటికీ, చైనాకు కూడా మనం అంటే నిలువెల్లా ద్వేషమే. అందుకే అవసరమైనప్పుడల్లా పాక్‌కు సాయం చేస్తూ, మనకు గాయం చేయాలని చూస్తుంటుంది.
ఇక పాక్‌లో భారీ ఖర్చుతో గ్వదర్ పోర్టును నిర్మించింది డ్రాగన్. చైనా, పాక్ ఎకనామిక్ కారిడార్‌లో ఇది కీలకం. వన్ బెల్ట్, వన్ రోడ్ మెగా ప్రాజెక్టులో భాగం. దీంతో గ్వదర్ పోర్టు కోసం పాక్‌కి చైనా మద్దతు ఇస్తోంది. మరోవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైనాకు దీటుగా మనం ఎదుగుతున్నాం. ఇక సరిహద్దుల్లో మన సైన్యం…చైనా ఆర్మీకి గతంలో గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో భవిష్యత్తులో భారత్ తమను మించిపోతుందేమోనని చైనా కలవరపడుతోంది. దీంతో పాకిస్తాన్ ద్వారా అడ్డంకులు, ఆటంకాలు కల్పించి, భారత్ ఎదగకుండా చూడాలనేది చైనా ప్లాన్. ఇలా చైనా, టర్కీలు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం భారత్‌ను వ్యతిరేకిస్తూ, పాక్‌తో చేతులు కలుపుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..