Check to China: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా భారీ వ్యూహం.. జపాన్‌తో కలిసి కొత్త వ్యూహరచనలో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహాలతో సిద్దమవుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాతోపాటు పలు ప్రపంచ దేశాలకు ఎంబర్రాస్సింగ్ కలిగిస్తున్న డ్రాగన్ కంట్రీకి చెక్..
Check to China Joe Biden new strategy: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహాలతో సిద్దమవుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాతోపాటు పలు ప్రపంచ దేశాలకు ఎంబర్రాస్సింగ్ కలిగిస్తున్న డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ జపాన్‌తో కలిసి కొత్త వ్యూహానికి తెరలేపారు. ముఖ్యంగా సముద్ర జలాలపై పెత్తనం సాధించేందుకు పలు దీవుల్లో కృత్రిమ గ్రామాలను సృష్టిస్తూ చాలా దేశాలను ఇబ్బంది పెడుతున్న చైనా వైఖరితో జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, బ్రునై, తైవాన్ వంటి దేశాలు మరీ విసిగిపోయి వున్నాయి. ఈ క్రమంలో ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో అమెరికా, జపాన్ దేశాలు కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాయి. దీని వల్ల చైనాకు చెక్ పెట్టవచ్చని బైడెన్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో పెరుగుతున్న డ్రాగన్ కంట్రీ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఏర్పడిన క్వాడ్ కూటమిని మరింతగా బలోపేతం చేయాలని తాజాగా అమెరికా, జపాన్ దేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం భారత్, ఆస్టేలియా దేశాలతో కలిసి పనిచేయాలని ఆ రెండు దేశాలు భావిస్తున్నాయి. ఈ మేరకు రెండు రోజుల క్రితం వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్ ప్రధాని యోషిహిడేసుగా చర్చలు జరిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఒక విదేశీ నేతతో వైట్‌హౌస్‌లో బైడెన్ ముఖాముఖి అవడం ఇదే ప్రథమం. కరోనా కారణంగా ఏర్పడిన తీవ్ర సంక్షోభ సమయంలో అమెరికా అధ్యక్షునిగా మొన్న జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన బైడెన్.. గత 3 నెలలుగా కీలకాంశాలపై ఇంటర్నల్ సమీక్షలకే పరిమితమయ్యారు.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామని అమెరికా, జపాన్ అధినేతల భేటీలో నిర్ణయించారు. ఇందుకోసం క్వాడ్‌ను మరింత బలోపేతం చేస్తామని ఇరువురు నేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందిస్తామని చెప్పారు. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో పరస్పర సహాయసహకారాలు అందించుకోవాలని అమెరికా, జపాన్ నిర్ణయించుకున్నాయి. మయన్మార్‌లో హింసను ఇరు దేశాలు ఖండించాయి. వైట్ హౌజ్ భేటీలో ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంతో పాటు ప్రపంచంపై చైనా చర్యల వల్ల శాంతి, సామరస్యాలపై పడే ప్రభావం గురించి బైడెన్, సుగా చర్చించారు.
దక్షిణ చైనా సముద్రంలో 13 లక్షల చదరపు మైళ్ల ప్రాంతం తమదేనని చైనా ప్రకటించడం వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రునై, తైవాన్ దేశాల ఆందోళనకు కారణమవుతోంది. తూర్పు చైనా సముద్ర విషయంలో జపాన్‌తో చైనాకు వివాదాలున్నాయి. ఈ రెండు ప్రాంతాలు పలు విలువైన ఖనిజాలున్న ద్వీపాలకు ఆలవాలం కావడంతో చైనా ఏకపక్షంగా వీటిని తన స్వాధీనంలోకి తెచ్చుకునే యత్నాలు చేస్తోందని పొరుగు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ప్రస్తుత స్థితికి భంగం కలిగించే ఏకపక్ష చర్యలను వ్యతిరేకిస్తామని యూఎస్, జపాన్ తమ సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి. ఈ ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుండాలని పేర్కొన్నాయి. హాంకాంగ్, ఉయ్‌ఘర్ ప్రాంతాల్లో సమస్యలపై ఆందోళనలున్నట్లు తెలిపాయి. కాగా అమెరికా, జపాన్ అధినేతల భేటీ తర్వాత డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు పకడ్బందీ ప్లాన్ రెడీ అవుతున్న సంకేతాలు బయటపడ్డాయి.
ALSO READ: ఉక్రెయిన్ సరిహద్దులో రష్యన్ సైన్యం.. రంగంలోకి నాటో దళాలు!
ALSO READ: కర్నాటక ముఖ్యమంత్రిని కల్వనున్న కేసీఆర్.. రాజోలిబండ సమస్యపై సీఎం ఫోకస్