
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని అబ్బా ప్రాంతం కార్మికుల ఆర్తనాదాలతో విషాదంగా మారింది. మంగళవారం ఉదయం ఆర్టిసనల్ అనే గోల్డ్ మైన్ ఒక్కసారిగా కుప్పకూలింది. బయటకు రావడానికి అవకాశం దొరకక కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మట్టికింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. అక్కడ చనిపోయినవారిలో ఎక్కుమంది మైనర్లే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -ఇంకా పదుల సంఖ్యలో కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని.. రెస్క్యూ కొనసాగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.. నానా మంబెరేలోని గనిలో వందలాది కార్మికులు మైనింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మట్టి కూలిందని.. దీంతో భయానక పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు..
మధ్య ఆఫ్రికాలోని పేదరికం, ఉపాధి కొరత, అనధికారిక బంగారం తవ్వకాలకు ఇది ఒక భయానక ప్రతిబింబం.. ఆర్టిసనల్ మైనింగ్‌లో భారీ యంత్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలు ఉండవు. ఎలాంటి టెక్నికల్ సహాయం లేకుండానే పాత పద్దతుల్లో ఇక్కడ బంగారం తవ్వకాలు జరుగుతుంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గని ఏరియా మొత్తం చిత్తడిగా మారింది. అయినా కార్మికులు అక్కడే తవ్వకాలు మొదలు పెట్టడంతో పైన ఉన్న మట్టి ఒక్కసారిగా కార్మికులపైకి దూసుకువచ్చింది. దీంతో కార్మికుల తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది.
అయితే, ఇంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం అక్కడ భద్రతా లోపాలే కాదు, తీవ్రమైన నిరుద్యోగ సమస్య కూడా.. ఆఫ్రికాలో బంగారం అంటే కేవలం సంపద కాదు.. వేలాది కుటుంబాలకు అదే బతుకుదెరువు. అందుకే ప్రమాదం తెలిసినా, రక్షణ సదుపాయాలు లేకపోయినా, కార్మికులు గనుల్లోకి దిగాల్సి వస్తోంది. ఒకవైపు ప్రభుత్వాలు అక్రమ, ప్రమాదకర తవ్వకాలపై నియంత్రణకు ప్రయత్నిస్తున్నా,ఇంకవైపు స్థానికులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడంతో ప్రమాదమని తెలిసినా తవ్వకాలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎక్కువమంది మైనర్ యువకులే పని చేస్తుంటారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో కూడా చనిపోయింది మైనర్లే. కుటుంబాలను పోషించుకోవడానికి స్థానికులకు గోల్డ్ మైనింగ్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే తరచూ ప్రమాదాల బారిన పడి, ప్రాణాలు కోల్పోతుంటారు.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..