Shocking News: నడి సముద్రంలో భారీ అగ్నిప్రమాదం.. బుగ్గిపాలైన వేలాది లగ్జరీ కార్లు..

|

Feb 19, 2022 | 8:03 AM

Felicity Ace Ship: కరోనాతో ఇప్పటికే ఆటోమొబైల్ రంగం కుదేలైంది. మూలిగే నక్క మీద ముంజకాయ పడ్డట్టు, వేలాది కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.

Shocking News: నడి సముద్రంలో భారీ అగ్నిప్రమాదం.. బుగ్గిపాలైన వేలాది లగ్జరీ కార్లు..
Ship
Follow us on

Felicity Ace Ship: కరోనాతో ఇప్పటికే ఆటోమొబైల్ రంగం కుదేలైంది. మూలిగే నక్క మీద ముంజకాయ పడ్డట్టు, వేలాది కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో తలలు పట్టుకుంటున్నారు లగ్జరీ కార్ల తయారీదారులు. వివరాల్లోకెళితే.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3,965 లగ్జరీ కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆటోమొబైల్‌ రంగం. అట్లాంటిక్ మహా సముద్రంలో ఫెసిలిటీ ఏస్‌ అనే భారీ నౌకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అజోర్స్ దీవులకు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో, భారీ ఎత్తున మంటలు చెలరేగినట్టు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. నౌకలోని 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్టు వెల్లడించారు అధికారులు.

ఈ భారీ నౌకలో పోర్షే, బెంట్లీ, ఆడీ, లాంబోర్గిని వంటి 3,965 విలాసవంతమైన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతానికి సమీపంలో ఉండే, పోర్చుగల్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించారు. ఆ నౌకలోని సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి, ఓ హోటల్‌కు తరలించారు అధికారులు. కానీ, ఫెసిలిటీ ఏస్ మాత్రం సముద్రం మధ్యలో విగతజీవిలా తేలుతూనే ఉంది. మంటలను ఆర్పి, నౌకను ఒడ్డుకు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

జర్మనీలోని వోల్ఫ్స్‌బర్గ్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థకు చెందిన ఓ తయారీ కేంద్రంలో, పోర్షే, ఆడీ, లాంబోర్గినీ సహా పలు వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీనికి సమీపంలోని ఎండెన్‌ పోర్టు నుంచి అమెరికాలోని డావిస్‌విల్లేకు ఫెసిలిటీ ఏస్ నౌక ద్వారా తరలిస్తుండగా సముద్రం మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో దాదాపు 1100 పోర్షే కార్లు ఉన్నట్లు చెబుతున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు. వాహనాలను బుక్‌ చేసుకున్న వినియోగదారులకు డీలర్ల ద్వారా సమాచారాన్ని అందజేసినట్టు చెబుతున్నారు. వాటిలో 100కి పైగా కార్లు టెక్సాస్‌లోని పోర్ట్ ఆఫ్ హ్యూస్టన్‌కు వెళ్తున్నాయని చెప్పారు. 2019లో కూడా పోర్షే కార్లతో వెళ్తున్న ఓ నౌక సముద్రంలో మునిగిపోయింది.

Also read:

Air India: టాటాలు దిద్దిన కాపురం.. ఎయిరిండియాను గాడిలో పెట్టెందుకు పక్కా ప్లాన్స్ రెడీ.. భారీ ప్రణాళికల వివరాలు

Medical Officer Jobs:  నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ సంగారెడ్డి జిల్లాలో 103 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తివిరాలివే..

Bio-Asia: బయో ఆసియా సదస్సు – 2022కు బిల్ గేట్స్.. పాల్గొననున్న తెలంగాణ మంత్రి కేటీఆర్